పాల‌కుర్తి కాంగ్రెస్ అభ్య‌ర్థి యశ‌స్వినిపై వేసిన పిటిష‌న్ కొట్టేసిన‌ హైకోర్టు

పాల‌కుర్తి కాంగ్రెస్ అభ్య‌ర్థి యశ‌స్వినిపై వేసిన పిటిష‌న్ కొట్టేసిన‌ హైకోర్టు
  • ఎన్నిక‌ల్లో జోక్యం చేసుకోలేం
  • ఓటరు జాబితా నుంచి ఓటును తొల‌గించలేము
  • పిటిష‌న్‌ను కొట్ట‌వేసిన ధ‌ర్మాస‌నం

విధాత‌, హైద‌రాబాద్: పాల‌కుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా మామిడాల యశ‌స్విని పోటీ చేయ‌డానికి వీలులేద‌ని ఆమె ఓటును తొల‌గించాలంటూ హైకోర్టులో దాఖ‌లైన పిటిష‌న్‌పై తాము జోక్యం చేసుకోలేమ‌ని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పేసింది. మామిడాల యశస్విని ఓటు తొలగింపు అంశంలో జోక్యం చేసుకోలేము కానీ ఒకవేళ ఎన్నికల్లో ఆమె విజయం సాధిస్తే.. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్ష‌న్‌ 82, సెక్ష‌న్‌ 83, సెక్ష‌న్‌ 100 మేరకు గెలుపును సవాల్‌ చేస్తూ పిటిషనర్‌ ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని సలహా ఇచ్చింది. ఓటు తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌లో వాదనలను ముగిస్తున్నట్లు స్పష్టం చేసింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితా నుంచి యశస్విని ఓటు తొలగించాలంటూ డిండికి చెందిన కంపల్లి దేవ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తోందని పేర్కొన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్‌ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌ రవిచందర్‌ వాదనలు వినిపించారు. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత ఓటర్ల జాబితాలో తొలగింపు, చేర్పులకు అవకాశం లేదని ఎన్నికల కమిషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. నోటిఫికేషన్‌ వచ్చి, నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయినందున ఓటు తొలగింపు అంశంలో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌లో వాదనలు ముగిస్తూ పిటిష‌న్‌ను కొట్టివేసింది.