Meghalaya Honeymoon murder | మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్..

  • By: TAAZ    crime    Jun 10, 2025 7:30 PM IST
Meghalaya Honeymoon murder | మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్..

Meghalaya Honeymoon murder | హనీమూన్‌ కోసం వెళ్లి మేఘాలయలో దారుణ హత్యకు గురైన రాజా రఘువంశి కేసు దర్యాప్తులో నివ్వెరపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ప్రొఫెషనల్‌ క్రిమినల్స్‌కు ఏ మాత్రం తీసిపోకుండా పక్కా ప్రణాళికతో రఘువంశి హత్యకు ఆయన భార్య సోనమ్‌ ప్లాన్‌ చేసినట్టు అర్థమవుతున్నది. అంతేకాదు.. రఘువంశి మృతదేహం అతని స్వస్థలానికి వచ్చినప్పుడు నిందితుడు, సోనమ్‌ ప్రియుడు రాజా కుష్వాహా.. ఏమీ తెలియనట్టు.. ఆ అంత్యక్రియల్లో పాల్గొనడం.. రెండు కుటుంబాలను ఓదార్చడం, హత్య సూత్రధారి సోనమ్‌ చెబుతున్న విషయాలు.. అన్నీ దిగ్భాంతిని కలిగిస్తున్నాయి. రాజా రఘువంశీని అతడి భార్య సోమన్ పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేయించినట్టు పోలీసులు నిర్ధించారు. ఇందుకోసం నిందితులకు రూ. 20 లక్షల సుపారీ కూడా ఇచ్చినట్టు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మే 11న రాజా రఘువంశీతో సోనమ్‌కి వివాహం జరిగింది. మే 20న వీరు హనీమూన్ కు మేఘాలయాకు వెళ్లారు. అయితే మే 23 నుంచి రఘువంశీ కనిపించడం లేదు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత అతడి మృతదేహం దొరికింది. అయితే ఆ రోజు నుంచి సోమన్ కనిపించకపోవడం అనుమానాలకు తావిచ్చింది. చివరకు సోమన్ తన భర్తను హత్య చేయించినట్టు తేలింది.

రాజా రఘువంశీని హత్య చేసేందుకు తొలుత కిరాయి హంతకులకు సోనమ్ రూ.4లక్షలు ఇచ్చేందుకు డీల్ చేసుకున్నదంట. తర్వాత ఆ మొత్తాన్ని రూ.20లక్షలకు పెంచిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో పోలీసులు ఇందౌర్‌కు చెందిన విశాల్‌సింగ్‌ చౌహాన్‌ (22), రాజ్‌సింగ్‌ కుశ్వాహా (21), ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పుర్‌కు చెందిన ఆకాశ్‌ రాజ్‌పూత్‌ (19)ను ఈ కేసులో అరెస్టు చేశారు. రఘువంశీని తాను చంపించలేదని, తననే ఎవరో అపహరించారని సోనమ్‌ చెప్పడం గమనార్హం. కేసులో అరెస్టయిన రాజ్‌ కుశ్వాహాతో సోనమ్‌కు సాన్నిహిత్యం ఉందని సమాచారం. అతడే ఈ హత్య ప్లాన్‌ను నడిపించాడని పోలీసులు వర్గాలు తెలిపాయి. అంతా సోనమ్‌, కుశ్వాహా ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసులు చెప్పారు. హత్యకు వారు ఉపయోగించిన పదునైన ఆయుధంతో అంతా తారుమారు అయినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఆయుధాన్ని సాధారణంగా మేఘాలయాలో వాడరని అందుకే పోలీసులు మరో కోణంలో దర్యాప్తు చేసినట్టు సమాచారం.

మే 10వ తేదీన రాజా రఘువంశికి, సోనమ్‌కు వివాహం జరిగింది. అనంతరం వారు మేఘాలకు హనీమూన్‌ నిమిత్తం వచ్చారు. వచ్చిన తర్వాత వారిద్దరు కుటుంబ సభ్యుల ఫోన్లకు అందుబాటులో లేకుండా పోయారు. జూన్‌ 2న రాజా రఘువంశి మృతదేహం లభ్యమైంది. అప్పటిదాకా అది ప్రమాదమో, ఇతరులు చేసిన హత్యో అన్న అనుమానాలను దర్యాప్తులో ఒక్కో అడుగు ముందుకు పడే క్రమంలో దిగ్భ్రాంతికర వాస్తవాలను బయటపెట్టింది. సోనమ్‌, రాజ్‌ ఇద్దరూ కూడబలుక్కొని.. రాజా రఘువంశిని హత్య చేసేందుకు కిరాయి హంతకులను మాట్లాడుకున్నారని పోలీసులు చెబుతున్నారు.

సోనమ్‌తో రాజ్‌ కుష్వాహాకు పెళ్లికి ముందే అక్రమ సంబంధం ఉన్నది. ఇతడు సోనమ్‌ సోదరుడి దగ్గర విశ్వసనీయంగా ఉద్యోగి. తన బావ హత్య నేపథ్యంలో మేఘాలయకు అతడు వెళ్లేటప్పుడు తన వ్యాపార బాధ్యతలను రాజ్‌ కుష్వాహాకే అతడు అప్పగించాడు. రాజాతో గోవింద్‌ నిత్యం ఫోన్‌లో మాట్లాడుతుండేవాడు. అయితే.. ఈ హత్యలో అతడే అసలైన నిందితుడన్న సంగతి అప్పటికి గోవింద్‌కు తెలియదు. రాజ్‌ కుష్వాహా.. సోనమ్‌ కుటుంబానికి అతిపెద్ద అండ నేనే అన్నట్టు ఉండేవాడు. అంత్యక్రియల తర్వాత కూడా తమ వద్దకు వచ్చి, తమతో మాట్లాడేవాడని సోనమ్‌ తండ్రి చెప్పాడు. కానీ.. ఇంతటి ఘాతుకానికి పాల్పడింది అతడేనని తమకు తెలియలేదని అన్నారు. కుష్వాహా తల్లి మాత్రం తన కొడుకు అలాంటివాడు కాదని, సోనమ్‌తో అక్రమ సంబంధం ఉన్న విషయం కూడా తనకు తెలియదని చెబుతున్నారు.

‘వాడికి ఇరవై ఏళ్లే. నేను మూడు రోజులుగా పచ్చిమంచినీళ్లు కూడా ముట్టలేదు. అతడు సోనమ్‌ సోదరుడి ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. సోనమ్‌ కూడా అక్కడే పనిచేసేది. కలిసి పనిచేసేటప్పుడు మాట్లాడుకోరా? నా కొడుకును ఈ కేసులో ఇరికించారు. అమాయకుడైన నా కొడుకును కాపాడాలని దేవుడిని కోరుకుంటున్నాను’ అని ఆమె చెబుతున్నారు. మరోవైపు సోనమ్‌ తల్లికి కూతురితో కుష్వాహాకు ఉన్న సంబంధం గురించి తెలిసీ తమ వద్ద దాచారని రఘువంశి సోదరుడు విపిన్‌ ఆరోపించారు. ఈ కేసులో ఐదుగురికి మించి నిందితులు ఉన్నారని ఆయన ఒక వార్తా సంస్థకు చెప్పారు. ఇదిలా ఉంటే.. రఘువంశిని హత్య చేసిన తర్వాత అతని ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌, పెళ్లి ఉంగరంతోపాటు.. కొంత నగదు కూడా ఉన్న అతడి పర్స్‌ మాయం అయ్యాయి.