నల్గొండ మున్సిపాలిటీలో పింఛన్ల మాయాజాలం
నల్గొండ మున్సిపాలిటీలో అక్రమాల పుట్ట పగులుతోంది. కార్యాలయంలో తిష్టవేసిన కొందరు అక్రమాలతోనే రాజ్యమేలుతున్నారు. తాము ఏది చేసినా అడిగేవారు లేరని విర్రవీగుతున్నారు

– భర్తలు బతికుండగానే మహిళలకు వితంతు పింఛన్
– నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టించిన ఆ ఇద్దరు..
– 2 వేల మంది అనర్హులకు లబ్ధి
– మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: నల్గొండ మున్సిపాలిటీలో అక్రమాల పుట్ట పగులుతోంది. కార్యాలయంలో తిష్టవేసిన కొందరు అక్రమాలతోనే రాజ్యమేలుతున్నారు. తాము ఏది చేసినా అడిగేవారు లేరని విర్రవీగుతున్నారు. రాజకీయ అండదండలు ఉన్నాయని ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అక్రమాలకు తెరలేపారు. పట్టణంలోని 48 వార్డుల్లో పలువురు అనర్హులకు ప్రభుత్వ పథకాలు కట్టబెట్టారు. ఇందుకోసం సామాజిక పింఛన్లను పలువురికి వల వేశారు. పలువురు మహిళలకు భర్తలు ఉన్నప్పటికీ, ఏకంగా వితంతు పింఛన్లు మంజూరు చేసేశారు. అక్రమాల విషయం పలువురు అధికారుల దృష్టికి వెళ్లినా, చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి.
నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి..
నల్గొండ మున్సిపాలిటీలో కొందరు సిబ్బంది అరాచకాలు అన్నీఇన్ని కావు. 2014 మున్సిపల్ కౌన్సిల్ ఎన్నిక తర్వాత తమ ఆగడాలకు అడ్డులేకుండా చేసుకున్నారు. అప్పటి కౌన్సిలర్ల సహాయ సహకారాలతో అక్రమాలకు తెరలేపారన్న ఆరోపణలున్నాయి. అనర్హులకు వితంతు పింఛన్ల పంపిణీలో ఇద్దరు కీలకంగా పనిచేసినట్లు కార్యాలయంలో గుసగుసలాడుతున్నారు. ఆయా వార్డుల్లో వితంతు పెన్షన్లు దరఖాస్తుకు అవకాశం ఉండడంతో అప్పట్లో గెలిచిన సదరు కౌన్సిలర్లు తమకు అనుకూలంగా ఉండే కొంతమందిని ఎంపిక చేసుకుని అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. వారికి నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టించి, వితంతు పెన్షన్లు అందిస్తున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు వార్డుకు కనీసం 20 నుంచి 30 మంది ఈ వితంతు పెన్షన్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ లెక్కన సుమారు 2 వేల మంది వరకు అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేసి, ప్రజాధనాన్ని అక్రమాల బాట పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి.

సూత్రధారులు వీరే..
మున్సిపాలిటీలో పనిచేసే లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయ్ ఒకరు, జనన మరణ ధ్రువీకరణ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన మరొకరు.. అనర్హులకు వితంతు పెన్షన్ల మంజూరులో కీలకంగా వ్యవహరించినట్లు కార్యాలయంలో చర్చించుకుంటున్నారు. అప్పటి కౌన్సిలర్లు కొందరు వీరికి ఒక పెన్షన్ మంజూరు చేస్తే రూ.5 వేల నుంచి రూ.20వేల వరకు లంచంగా ఇచ్చారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. వీరిద్దరికీ మరికొంతమంది మద్దతుగా నిలిచి డబ్బులు దండుకున్నారనీ కార్యాలయంలో చర్చించుకుంటున్నారు. 2014లో డెత్ సర్టిఫికెట్లను మాన్యువల్ గా ఇస్తుండడంతో అవినీతిపరులకు కలిసి వచ్చినట్లయ్యింది. దీంతో వారు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా సాగిందని తెలుస్తోంది.
అధికారులకు తెలిసినా?
మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ తతంగంపై ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ గుంభనంగా వ్యవహరించడం వెనుక పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారులపై కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు వితంతు పింఛన్ల అక్రమాలపై నోరుమెదపడం లేదని ప్రచారం సాగుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో వార్డుకు పదిమంది ఉన్నా. మొత్తం 480 మంది అక్రమంగా వితంతు పెన్షన్లు పొందుతున్నట్లు.. అయితే మర్రిగుడ, చర్లపల్లి మరికొన్ని వార్డుల్లో ఒకే కుటుంబానికి చెందిన మహిళ వితంతు పెన్షన్ తీసుకుంటుండగా, ఆమె భర్త వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిపై అధికారులు ఇప్పటికైనా విచారణ చేస్తారా? చర్యలు తీసుకుంటారా? అనేది వేచిచూడాలి.
విచారణ చేసి చర్యలు తీసుకుంటాం: కమిషనర్ వెంకటేశ్వర్లు
మున్సిపల్ పరిధిలో అక్రమంగా అనర్హులు పింఛన్లు పొందుతుంటే వాటిపై త్వరలోనే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం. బాధ్యులైన వారు నకిలీ సర్టిఫికెట్లు పెట్టినట్లు తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. జిల్లా కలెక్టర్ కు దీనిపై విచారణ చేపట్టి నివేదిక సమర్పిస్తాం.