Triple Murder Case Solved: ర‌క్తపు మ‌డుగులో మూడు మృత‌దేహాలు.. ఒక కండోమ్ ప్యాకెట్‌.. పోలీసులు కేసును ఛేదించారిలా!

ఇదో ఆస‌క్తిక‌ర నేర‌వార్త‌. మాన‌వ సంబంధాలు ఎంత‌లా దిగ‌జారిపోతున్నాయో తెలిపే క‌థ‌నం. క్లూ లేకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డామ‌నుకున్న నిందితులు వ‌దిలేసిన కీల‌కమైన క్లూ ఆధారంగా పోలీసులు ద‌ర్యాప్తు చేసి అరెస్టు చేసిన నేర‌గాళ్ల క‌థ‌. ఈ నేరంలో ఒక మ‌హిళ‌ది కీల‌క పాత్ర‌.

  • By: TAAZ    crime    Mar 13, 2025 7:07 PM IST
Triple Murder Case Solved: ర‌క్తపు మ‌డుగులో మూడు మృత‌దేహాలు.. ఒక కండోమ్ ప్యాకెట్‌.. పోలీసులు కేసును ఛేదించారిలా!

Triple Murder case solved :

అది 2019 జూన్ 23. రోజువారీ త‌న ప‌నికోసం ఢిల్లీలోని అత్యంత విలాస‌వంత‌మైన నివాస ప్రాంతం వ‌సంత్ విహార్‌లోని ఇంటికి బ‌బ్లీ అనే ప‌ని మ‌నిషి వ‌చ్చింది. ఆమె ప‌నిచేసే ఇంట్లో ఇద్ద‌రు వృద్ధ దంప‌తులు ఉంటారు. వ‌సంత్ అపార్ట్‌మెంట్ వారి నివాసం. విష్ణు మాథుర్ (80) కేంద్ర ప్ర‌భుత్వ రిటైర్డ్ ఎంప్లాయీ. అత‌ని భార్య శ‌శి మాథుర్ (75) కూడా గ‌తంలో న్యూఢిల్లీ మున్స‌ప‌ల్ కార్పొరేష‌న్‌లో ప‌నిచేసి రిటైర్ అయ్యారు. ఒంట్లో బాగోలేని కార‌ణంగా ఆమె మంచానికే ప‌రిమిత‌మ‌య్యారు. అదే అపార్ట్‌మెంట్‌లో ఖుష్బూ నోటియాల్.. శ‌శి బాగోగులు చూసుకునేది. రోజులాగే ప‌నికి వ‌చ్చిన బ‌బ్లి.. బెల్ కొట్టింది. లోప‌లి నుంచి ఎలాంటి స్పంద‌న లేదు. ప‌లుమార్లు బెల్ కొట్టి.. కాసేపు ఆగింది. అయినా ఎంత‌కీ ఎవ‌రూ డోర్ తీయ‌లేదు. ఇలాంటి స‌మ‌యాల్లో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఇంటి ఓన‌ర్లు ఆమెకు డూప్లికేట్ కీ ఇచ్చారు. దానితో ఆమె త‌లుపు తీసేందుకు సిద్ధ‌మైంది. అయితే.. అది లాక్ వేసి లేదు. త‌లుపు తీసుకొని ఆమె లోనికి వెళ్లింది. ఆ రోజు ఆమె చూసిన దృశ్యం.. కొన్ని రోజుల‌పాటు ఆమెను వెంటాడింది. అక్క‌డ నేల‌పై ఇద్ద‌రు వృద్ధ దంప‌తులు నెత్తుటి మ‌డుగులో ప‌డి ఉన్నాయి. వారి గొంతులు కోసి ఉన్నాయి. వారి ఒంటిపై అనేక సార్లు క‌త్తితో పొడిచిన గాయాలు ఉన్నాయి. మ‌రో గ‌దిలో ఖుష్బు కూడా నిర్జీవంగా ప‌డి ఉంది. ఆమె గొంతును కూడా కోశారు. అక్క‌డి వాతావ‌ర‌ణం గ‌మ‌నిస్తే.. ఎవ‌రూ బ‌ల‌వంతంగా లోనికి చొర‌బ‌డిన‌ట్టు ఆన‌వాళ్లు లేవు. త‌లుపేమీ విరిగిపోయి లేదు. హాల్‌లో ఉన్న టేబుల్‌పై కొన్ని ఖాళీ టీక‌ప్పులు ఉన్నాయి. కొన్ని న‌గ‌లు మాయ‌మైన‌ట్టు తేలినా.. ఇంట్లో డ‌బ్బు మాత్రం దోపిడీకి గురికాలేదు. ఆ వృద్ధ దంప‌తుల మొబైల్ ఫోన్ల‌ను మాత్రం ఎత్తుకెళ్లారు. మొత్తం ప‌రిస‌రాల‌ను పంకించిన పోలీసుల‌కు ఖుష్బూ బెడ్‌రూమ్‌లో ఒక ఆస‌క్తిక‌ర ఆబ్జెక్ట్ క‌నిపించింది. అది సింగిల్ కండోమ్ ప్యాకెట్‌. ద‌ర్యాప్తు అధికారులు ఒక క్లూ దొరికింద‌నుకున్నారు.

ఖుష్బూ దాదాపు ఏడాది కాలంగా ఆ ఇంట్లో ఉంటున్న‌ది. వృద్ధ దంప‌తుల కొడుకు కొద్ది సంవ‌త్స‌రాల క్రితం రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయాడు. వారికి మ‌రో కుమార్తె కూడా ఉన్న‌ది. ఆమె త‌న కుటుంబంతో ద‌క్షిణ ఢిల్లీలో నివ‌సిస్తున్న‌ది. శ‌శి ఆరోగ్యం బాగోలేక పోవ‌డంతో వారు పూర్తిగా ఖుష్బూపైనే ఆధార‌ప‌డ్డారు. ఖుష్బూకు ఒక స్నేహితుడు ఉన్నాడ‌ని, త‌ర‌చూ అత‌డు ఆ ఇంటికి వ‌స్తుండేవాడ‌ని ఇరుగుపొరుగువారు చెప్పారు. ఆ రూమ్‌లో కండోమ్ ప్యాకెట్ దొర‌క‌డంతో.. ఈ హ‌త్య‌లు ఖుష్బూ బాయ్‌ఫ్రెండ్ ప‌నేన‌ని పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. అత‌డు పారిపోయే క్ర‌మంలో ఆ ప్యాకెట్ కిందిప‌డిపోయి ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. అత‌డిని తాము సుమారు 72 గంట‌ల‌పాటు ప్ర‌శ్నించామ‌ని, త‌మ‌కేమీ అనుమానాస్ప‌దంగా క‌నిపించ‌లేద‌ని ఈ కేసు ద‌ర్యాప్తులో భాగంగా ఉన్న ఒక పోలీసు అధికారి తెలిపారు. దీంతో పోలీసులు ద‌ర్యాప్తును తాజాగా ప్రారంభించారు. మ‌రోసారి వృద్ధ దంప‌తుల కుమార్తె ఇంటికి వెళ్లారు. హ‌త్య‌కు కొన్ని రోజుల ముందు ఏమైనా అనుమానాస్ప‌దంగా అనిపించాదేమోన‌ని కుమార్తె వ‌ద్ద ఆరా తీశారు. ఆమె ప్రీతి షెరావ‌త్ పేరు చెప్పింది. ఆమె వారికి పాత ప‌రిచ‌యం. త‌ర‌చూ త‌న త‌ల్లిదండ్రుల వ‌ద్ద‌కు వ‌స్తుండేద‌ని తెలిపింది. ప్రీతి త‌ల్లి, శ‌శి ఎన్‌డీఎంసీలో స‌హోద్యోగులు. అయితే.. రిటైర్మెంట్ త‌ర్వాత ట‌చ్‌లో లేకుండాపోయారు. 42 ఏళ్ల ప్రీతి ఢిల్లీలోని నంగ్లోయిలో ఉంటుంది. అయితే.. పాత సంబంధాల‌ను పున‌రుద్ధ‌రించేందుకు ఆమె ఎందుకు ప్ర‌య‌త్నించింది? ఇప్పుడు ఎక్క‌డ ఉంది? ఇది తేల్చేందుకు పోలీసులు సిద్ధ‌ప‌డ్డారు.

హ‌త్య‌లు జ‌రిగిన నాలుగు రోజుల‌కు అంటే.. 2019 జూన్ 26వ తేదీన విష్ణు మాథుర్ ఫోన్ కొద్దిసేపు స్విచాన్ అయిన‌ట్టు పోలీసులకు అల‌ర్ట్ వ‌చ్చింది. వెంట‌నే ఆ ఫోన్ లొకేష‌న్‌ను పోలీసులు ట్రాక్ చేశారు. గుర్గావ్‌లోని ఒక హోట‌ల్ గ‌దిలో ఆ లొకేష‌న్ తేలింది. అక్క‌డికి వెళ్లిన పోలీసుల‌కు అక్క‌డ ప్రీతి త‌న లివిన్ పార్ట్‌న‌ర్ మ‌నోజ్ భ‌ట్ (39)తో క‌నిపించింది. కొద్దిసేపు వారిద్ద‌రినీ పోలీసులు ప్ర‌శ్నించారు. అనంత‌రం వారిద్ద‌రూ పోలీసుల‌ను గుర్గావ్‌లోని డీఎల్ ఎఫ్ ఫేజ్ 1 సుశాంత్ లోక్ ప్లాట్‌కు తీసుకెళ్లారు. అక్క‌డ నిర్మాణ శిథిలాలు, చెత్త‌ను తొల‌గించగా హ‌త్య‌కు ఉప‌యోగించిన ఆయుధాలు ఒక క‌త్తి, ఒక స్క్రూడ్రైవ‌ర్ బ‌య‌ట‌ప‌డ్డాయి. అక్క‌డే మ‌రో ఆస‌క్తిక‌ర ఆబ్జెక్ట్ క‌నిపించింది. రెండు కండోమ్స్ ఉన్న స్ట్రిప్‌. హ‌త్య జ‌రిగిన ప్రాంతంలో దొరికిన కండోమ్ ప్యాకెట్‌ను దీనితో పోల్చితే స‌రిపోయాయి. ఆ మూడు కండోమ్స్ ఒక్క‌టే ప్యాకెట్‌లోనివ‌ని పోలీసులు నిర్ధారించుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ప‌రీక్ష‌కు పంపారు. ఆ మూడు కండోమ్స్ ఒక ప్యాకెట్‌లోనివ‌ని ఫోరెన్స్ ప‌రీక్ష‌లోనూ తేలింది. క‌ల‌ర్‌, షేడ్‌, సైజ్ అన్నీ ఒకేలా ఉన్నాయి. వాటిలో ఒక ప్యాకెట్‌ను చించి, ఉద్దేశ‌పూర్వ‌కంగా.. కేసును ఖుష్బూ బాయ్‌ఫ్రెండ్‌వైపు నెట్టేందుకు గ‌దిలో వ‌దిలారు.. అని ద‌ర్యాప్తు అధికారి తెలిపారు. కేసును త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు నేర‌స్తులు ప్ర‌యత్నిస్తుంటార‌ని, ఆ క్ర‌మంలో తెలియ‌కుండానే కొన్ని క్లూల‌ను వ‌దిలేస్తుంటార‌ని ఆయ‌న చెప్పారు.

నంగ్లోయిలోని చంచ‌ల్ పార్క్ ఏరియాలో పుట్టి పెరిగిన ప్రీతి.. 1997లో ల‌జ‌ప‌త్ న‌గ‌ర్‌లోని ఫుడ్ అండ్ క్రాఫ్ట్స్ ఇన్‌స్టిట్యూష‌న్‌లో మేనేజ్‌మెంట్ కోర్స్‌లో చేరింది. ఆ త‌ర్వాత మ‌నాలీకి వెళ్లిపోయి, అక్క‌డ ఒక హోట‌ల్‌లో ఫ్రంట్ డెస్క్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేసింది. ఆమె భ‌ర్త‌పేరు నికోల‌స్ అని, త‌మ‌ది పెద్ద‌లు కుదిర్చిన వివాహ‌మ‌ని పోలీసుల‌కు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ప్రీతి తెలిపింది. వారి పెళ్లి 2000 సంవ‌త్స‌రంలో జ‌రిగింది. నికోల‌స్ అనే పేరు ఉండేస‌రికి ఆయ‌న విదేశీయుడ‌ని భావించామ‌ని, ద‌ర్యాప్తులో అత‌డు కూడా నంగ్లోయి ప్రాంతానికి చెందిన‌వాడేన‌ని తేలింద‌ని పోలీసులు తెలిపారు. మ‌రుస‌టి ఏడాది వారికి ఒక కొడుకు పుట్టాడు. నికోల‌స్‌కు ఉద్యోగం లేదు. ప్రీతి కుటుంబ పోష‌ణ కోసం వేర్వేరు ప్ర‌యివేటు కంపెనీల్లో ప‌నిచేసింది. 2004లో వారికి కూతురు పుట్టింది. త‌ర్వాత ఆయ‌న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మ‌ళ్లీ 2006లో తిరిగి వ‌చ్చాడు. మ‌ళ్లీ 2007లో మ‌మ్మ‌ల్ని వ‌దిలేసి వెళ్లిపోయాడు.. అని ప్రీతి త‌న స్టేట్‌మెంట్‌లో తెలిపింది. త‌ర్వాతి తొమ్మిదేళ్లు ప్రీతి హోట‌ళ్లు, కాల్ సెంట‌ర్ల‌లో వేర్వేరు ఉద్యోగాలు చేసింది. సొంత‌గా హోట‌ల్ పెట్టాల‌న్న త‌న దీర్ఘ‌కాలిక క‌ల‌ను నెర‌వేర్చుకునేందుకు ఆమె సిద్ధ‌ప‌డింది. ఆ స‌మ‌యంలో ప్రాప‌ర్టీ డీల‌ర్‌గా త‌న‌ను తాను ప‌రిచ‌యం చేసుకున్న మ‌నోజ్ అనే వ్య‌క్తి ఆమెకు తార‌స‌ప‌డ్డాడు. కొద్దికాలానికికే వారు స‌న్నిహితంగా మారారు. ఆర్నెల్ల త‌ర్వాత ఒక రోజు బాగా మ‌ద్యం తాగిన మ‌నోజ్‌.. త‌న నేర చ‌రిత్ర‌, తన భార్య హ‌త్య కేసులో ఐదేళ్ల జైలు జీవితం గురించి ప్రీతికి చెప్పాడు. 2017 నాటికి మ‌నోజ్‌, ప్రీతి స‌హ‌జీవ‌నం మొద‌లుపెట్టారు. పీజీ బిజినెస్ ఫెయిల్ కావ‌డంతో రెస్టారెంట్ మొద‌లుపెట్టారు. న‌ష్టాల్లో ప‌డ‌టంతో 2018లో దాన్నీ మూసేశారు. ప్రీతి మ‌ళ్లీ కాల్ సెంట‌ర్‌లో ప‌నిచేయ‌డం మొద‌లుపెట్టింది.

ఈ స‌మ‌యంలో మ‌నోజ్ త‌న అస‌లు రూపాన్ని చూపాడు. మ‌ద్యం కోసం డ‌బ్బులు డిమాండ్ చేసేవాడు. 2019లో ప్రీతి అనారోగ్యం కార‌ణంగా జాబ్ వ‌దిలేసింది. నాకు డ‌బ్బుల‌న్నా ఇవ్వు లేదా ఎక్క‌డైనా దొంగ‌త‌నం చేసే అవ‌కాశ‌మైనా చూడు అంటూ తాను ఆమెకు చెప్పాన‌ని పోలీసుల విచార‌ణ సంద‌ర్భంగా మ‌నోజ్ వెల్ల‌డించాడు. ఆ స‌మ‌యంలో త‌న త‌ల్లికి స్నేహితురాలైన శ‌శి ఆంటీ గుర్తొచ్చింద‌ని మ‌నోజ్ తెలిపాడు. జూన్ 17, 2009న శ‌శి మాథుర్‌కు ఫోన్ చేయాల‌ని మ‌నోజ్ చెప్పాడు. ఆ ఇంటిపై రెక్కీ చేద్దామ‌ని ప్ర‌తిపాదించాడు. అదే రోజు సాయంత్రం శిశి ఇంటికి ప్రీతి వెళ్లింది. ఆమె బాగోగులు అడిగిన త‌ర్వాత ఎవ‌రైనా వ‌చ్చి క‌లుస్తుంటారా? అని ఆమెను అడిగి తెలుసుకున్న‌ది. జూన్ 22 రాత్రి తొమ్మిది గంట‌ల‌కు ప్రీతి, మ‌నోజ్ త‌న ప్లాన్‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. ప‌దిన్నర స‌మ‌యంలో ప్రీతి, మ‌నోజ్ త‌మ బ్లాక్ బ‌జాజ్ ప‌ల్స‌ర్ బండిపై బ‌య‌ల్దేరి వ‌సంత్ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. సీసీ టీవీ కెమెరాల‌ను త‌ప్పించుకునేందుకు మ‌నోజ్ త‌న బండిని ఆ బిల్డింగ్‌కు దూరంగా పార్క్ చేశాడు. ప్రీతి త‌న త‌ల‌ను దుప‌ట్టాతో క‌ప్పింది. మాథుర్స్ ఫ్లాట్‌కు వెళ్లి త‌లుపు కొట్టారు. అప్ప‌టికి 11.15 గంట‌లు అవుతున్న‌ది. ఖుష్బూ త‌లుపు తీసింది. అంకుల్‌, ఆంటీ అప్ప‌టికి మెళ‌కువ‌తోనే ఉన్నారు. ఈ టైమ్‌లో వ‌చ్చారేంట‌ని అడిగారు. దారిన పోతూ ఇలా వ‌చ్చామ‌ని చెప్పాము.. అని ప్రీతి వెల్ల‌డించింది.

మందులు వేసుకున్న వృద్ధ దంప‌తులు కాసేప‌టికి నిద్ర‌కు ఉప‌క్ర‌మించారు. టీవీ ఆన్ చేయ‌మ‌ని ఖుష్బుకు చెప్పిన మ‌నోజ్‌.. దాని సౌండ్ పెంచాడు. తాను తెచ్చుకున్న లిక్క‌ర్ బాటిల్ తీసి తాగ‌డం మొద‌లుపెట్టాడు. టీ పెట్టాల్సిందిగా ఖుష్బూను ఇద్ద‌రూ కోరారు. ఆమె టీ త‌యారు చేసి తీసుకుని రాగానే ఆమెపై దాడి చేసిన మ‌నోజ్‌.. క‌త్తితో ఆమె గొంతును కోశాడు. అనేక‌సార్లు ఆమె ఒంటిపై పొడిచాడు. టీవీ సౌండ్ కార‌ణంగా ఆమె అరుపులు బ‌య‌టకు వినిపించ‌లేదు. ఖుష్బూ చ‌నిపోవ‌డంతో వృద్ధ దంప‌తుల రూమ్ వైపు వెళ్లారు. లోపలికి వెళ్లిన మ‌నోజ్‌.. వారిద్ద‌రినీ గొంతుకోసి చంపేశాడు. స్క్రూడ్రైవ‌ర్‌తో విచ‌క్ష‌ణార‌హితంగా పొడిచాడు. అక్క‌డి నుంచి సాయిబాబా ఫొటో ఉన్న ఒక గోల్డ్ చెయిన్, డైమండ్ రింగ్‌, బ్రేస్‌లెట్‌, నాలుగు బంగారు గాజులు, మ‌రికొన్ని న‌గ‌లు తీసుకున్నామ‌ని మ‌నోజ్ పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డించాడు. వాటిని ప్రీతి, మ‌నోజ్ ఇద్ద‌రూ పంచుకున్నారు. ఎవ‌రికీ అనుమానం రాకుండా ఉండేందుకు ప్రీతి త‌న వాటాను త‌న భ‌ర్త‌కు వైద్యం చేయించేందుకు డ‌బ్బు కావాలంటూ ఒక దుకాణంలో కుద‌బెట్టింది. ల‌క్ష‌న్న‌ర రూపాయ‌లు తీసుకొని మ‌నోజ్‌కు ఇచ్చింది. హ‌త్య చేసిన త‌ర్వాత సాక్ష్యాలు ఎలా మాయం చేయాలో జైల్లో ఉన్న స‌మ‌యంలో తోటి ఖైదీల నుంచి తెలుసుకున్నాడ‌ని పోలీసులు చెప్పారు. అందుకే హ‌త్య‌లు చేసిన చోటుకు ఫోన్ తీసుకెళ్ల‌లేదు.. ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఒక కండోమ్ ప్యాకెట్‌ను అక్క‌డ వ‌దిలాడు. కానీ.. అత‌డు చేసిన ఒకే ఒక్క పొర‌పాటు.. విష్ణుమాధుర్ మొబైల్ ఫోన్‌ను కొద్ది క్ష‌ణాల‌పాటు ఆన్ చేయ‌డ‌మే. పోలీసుల‌కు నిందితుల జాడ తెలుసుకునేందుకు ఆ కొన్ని క్ష‌ణాలే స‌రిపోయాయి.