ఎంగిలి గిన్నెలు తగిలాయని… వెయిటర్‌ను కొట్టి చంపారు
ఎంగిలి గిన్నెలు తగిలాయని ఓ వెయిటర్‌ను కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గత నెలలో చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది

లక్నో : ఎంగిలి గిన్నెలు తగిలాయని ఓ వెయిటర్‌ను కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గత నెలలో చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్‌కు చెందిన పంకజ్ అనే యువకుడు వెయిటర్‌గా పని చేస్తున్నాడు. నవంబర్ 17వ తేదీన అంకూర్ విహార్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు పంకజ్ వెళ్లాడు. అక్కడ అతిథులు భోజనం చేసిన గిన్నెలను వాషింగ్ ఏరియాకు పంకజ్ తరలిస్తున్నాడు. ఈ క్రమంలో ఆ ఎంగిలి గిన్నెల ట్రే.. రిషబ్‌తో పాటు అతని స్నేహితులకు తగిలింది. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన రిషబ్ తన బృందంతో పంకజ్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో పంకజ్‌కు తీవ్ర గాయాలై, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భయపడ్డ రిషబ్ తన స్నేహితుల సహాయంతో పంకజ్ డెడ్‌బాడీని సమీప అడవుల్లో పడేశారు.
పంకజ్ ఇంటికి తిరిగి రాకపోవడంతో తమ కుమారుడి అదృశ్యంపై పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. రిషబ్‌తో పాటు అతని స్నేహితులైన మనోజ్, అమిత్‌ను అరెస్టు చేసి విచారించగా, చేసిన నేరాన్ని అంగీకరించారు. అయితే మనోజ్ క్యాటరింగ్ యజమానిగా పోలీసుల విచారణలో తేలింది. అడవుల్లో పడేసిన పంకజ్ డెడ్‌బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రిషబ్, మనోజ్, అమిత్‌ను రిమాండ్‌కు తరలించారు.