Ugadi 2024 | ఉగాది నాడు ఈ ఐదు కార్య‌క్ర‌మాలు త‌ప్ప‌క చేస్తే.. ఏడాదంతా శుభాలే..!

ఉగాది పండుగ రోజున ఈ ఐదు కార్య‌క్ర‌మాలు త‌ప్ప‌నిస‌రిగా చేయాల‌ని పండితులు సూచిస్తున్నారు. ఈ ఐదు కార్య‌క్ర‌మాల‌ను చేయ‌డం వ‌ల్ల శుభాలు క‌లుగుతాయ‌ని చెబుతున్నారు. మ‌రి ఆ ఐదు కార్య‌క్ర‌మాలు ఏంటో తెలుసుకుందాం..

Ugadi 2024 | ఉగాది నాడు ఈ ఐదు కార్య‌క్ర‌మాలు త‌ప్ప‌క చేస్తే.. ఏడాదంతా శుభాలే..!

 

Ugadi 2024 | తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ఉగాది పండుగ‌నే తొలి పండుగ‌. తెలుగు క్యాలెండ‌ర్ ప్ర‌కారం ఉగాదిని తొలి ప‌ర్వ‌దినంగా జ‌రుపుకుంటారు. ఇక ఉగాది పండుగ రోజు ఉగాది ప‌చ్చ‌డి చేసుకుంటారు. కొత్త బ‌ట్ట‌లు ధ‌రించి కుటుంబ స‌భ్యులతో సంతోషంగా గ‌డుపుతారు. నోరూరించే పిండి వంట‌కాల‌ను త‌యారు చేసుకుంటారు. ఇక సాయంత్రం వేళ పంచాంగ శ్ర‌వ‌ణం నిర్వ‌హిస్తారు. త‌మ రాశుల ప్ర‌కారం ఆదాయ‌, వ్య‌యాలు, రాజ్య‌పూజం, అవ‌మానాల‌ను జ్యోతిష్యుల‌ను అడిగి తెలుసుకుంటారు. ఆ త‌ర్వాత ఏడాదంతా త‌మ భ‌విష్య‌త్ ఏంటో రాశుల ద్వారా తెలుసుకుంటారు. ఇదంతా ప‌క్క‌న పెడితే.. ఉగాది పండుగ రోజున ఈ ఐదు కార్య‌క్ర‌మాలు త‌ప్ప‌నిస‌రిగా చేయాల‌ని పండితులు సూచిస్తున్నారు. ఈ ఐదు కార్య‌క్ర‌మాల‌ను చేయ‌డం వ‌ల్ల శుభాలు క‌లుగుతాయ‌ని చెబుతున్నారు. మ‌రి ఆ ఐదు కార్య‌క్ర‌మాలు ఏంటో తెలుసుకుందాం..

1. తైలాభ్యంగ‌నం

2. నూత‌న సంవ‌త్స‌రాది స్తోత్రం

3. నింబ కుసుమ భ‌క్ష‌ణం

4. పూర్ణ‌కుంభ దానం

5. పంచాంగ శ్ర‌వ‌ణం

1. తైలాభ్యంగ‌నం

తైలాభ్యంగ‌నం అంటే నువ్వుల నూనెతో త‌లంటు పోసుకోవ‌డం. సూర్యోద‌యానికి ముందు మ‌హాల‌క్ష్మీ నూనెలోనూ, గంగాదేవి నీటిలోనూ ఆవ‌హించి ఉంటార‌ని రుషుల న‌మ్మ‌కం. కావున నూనెతో త‌లంటుకుని, అభ్యంగ‌న స్నానం చేస్తే.. ల‌క్ష్మీదేవి, గంగామాత అనుగ్ర‌హాన్ని పొందుతార‌ని పండితుల న‌మ్మ‌కం. ఆరోగ్య‌రీత్యా, ఆధ్యాత్మిక రీత్యా తైలాభ్యంగ‌న స్నానం మంచిది.

2. నూత‌న సంవ‌త్స‌ర స్తోత్రం

అభ్యంగ‌న స్నానం చేసిన అనంత‌రం సూర్యభ‌గ‌వానుడిని పూజించాలి. త‌ర్వాత మామిడి ఆకుల‌ను ఇంటికి అలంక‌రించాలి. దేవుని గ‌దిని కూడా మామిడి ఆకులు, పూల‌తో అలంక‌రించాలి. నూత‌న పంచాంగాన్ని ఉంచాలి. సంవ‌త్స‌రాది దేవ‌త‌ను, ఇష్ట దేవ‌తారాధ‌న‌తో పంచాంగాన్ని పూజించి, ఉగాది ప్ర‌సాదాన్ని(ఉగాది ప‌చ్చ‌డి) నివేదించాలి.

3. నింబ‌కుసుమ భ‌క్ష‌ణం

నింబ‌కుసుమ భ‌క్ష‌ణం అంటే ఉగాది ప‌చ్చ‌డిని సేవించ‌డం అని అర్థం. ఉగాది ప‌ర్వ‌దినం నాడు ఉగాది ప‌చ్చడిని త‌ప్ప‌కుండా తినాలి. వేప పువ్వులు, కొత్త చింత‌పండు, కొత్త బెల్లం, ఉప్పు, మామిడి పిందెలు, కారం క‌లిపిన ష‌డ్రుచుల మేళ‌వింపే ఉగాది ప‌చ్చ‌డి. ఉగాది ప‌చ్చ‌డి తిన‌డం వ‌లన అనారోగ్య ప‌రిస్థితులు హ‌రించ‌బ‌డి, రోగ‌శాంతి, ఆరోగ్య పుష్టి కూడా చేకూరుతుంద‌ని న‌మ్మ‌కం.

4. పూర్ణ‌కుంభ దానం

ఉగాది నాడు ఇంద్ర ధ్వ‌జ‌, బ్ర‌హ్మ‌ధ్వ‌జ ప్ర‌తిష్టాప‌న ఆచారంగా ఉన్న‌ది. ఒక ప‌ట్టు వ‌స్త్రాన్ని, ఒక వెదురుగ‌డ‌కు ప‌తాకం వ‌లె క‌ట్టి, దానిపై కొబ్బ‌రిబొండంతో క‌లశాన్ని ఉంచి, ఆ క‌ర్ర‌కు మామిడి ఆకులు, నింబ ప‌త్రాలు, పూల తోర‌ణాలు క‌ట్టి, ఇంటి ప్రాంగ‌ణంలో ప్ర‌తిష్టించి ఆరాధించ‌డం ధ్వ‌జావ‌రోహణం అంటారు. రాగి, వెండి, పంచ‌లోహాలు లేదా మ‌ట్టితో చేసిన కొత్త కుండ‌ను క‌ల‌శంలా చేసి రంగుల‌తో అలంక‌రించి అందులో మామిడి, అశోక‌, నేరేడు, మోదుగ‌, వేప చిగుర్లతో పాటు సుగంధ చంద‌నం క‌లిపి పుష్పాక్ష‌త‌లు వేసి ఆవహ‌నం చేయాలి. పూజించిన క‌ల‌శానికి, ఒక నూత‌న వ‌స్త్రాన్ని చుట్టి క‌ల‌శంపై పసుపు కుంకుమ చంద‌నం, పసుపుదారాల‌తో అలంక‌రించిన కొబ్బ‌రి బొండంను ఉంచి పూజించాలి. అనంత‌రం పురోహితుడికి లేదా గురుతుల్యుల‌కు గానీ పూర్ణ‌కుంభం దానం ఇచ్చి వారి ఆశీస్సుల‌ను పొందాలి. అలా పొందితే సంవ‌త్స‌రం పొడ‌వునా విశేష ఫ‌లితం ల‌భిస్తుంద‌ని ప్ర‌తీతి.

5. పంచాంగ శ్ర‌వ‌ణం

తిథి, వార‌, న‌క్ష‌త్ర‌, యోగ‌, క‌ర‌ణ‌ములు అనే పంచ అంగాల స‌మ‌న్వితం పంచాంగం. ఉగాది రోజు దేవాల‌యాల్లో, ర‌చ్చ‌బండ‌ల వ‌ద్ద పండితులు, సిద్ధాంతుల స‌మ‌క్షంలో పంచాంగ శ్ర‌వ‌ణం నిర్వ‌హిస్తారు. ఏ రాశివారు ఏం చేయాలి..? ఏం చేయ‌కూడ‌దు..? ఆయా రాశుల ఆదాయ‌, వ్య‌యాలు ఎలా ఉన్నాయి..? రాజ్య‌పూజం, అవ‌మానం ఎలా ఉంద‌నే విష‌యాల‌ను పంచాంగం ద్వారా తెలుసుకుంటారు. వీటికి అనుగుణంగా మ‌నం ఎలా ముందుకు వెళ్లాలి అనేది ప్లాన్ చేసుకోవాలి.