ICET Exam | ఐసెట్‌లో బెస్ట్‌ స్కోర్‌ మీ లక్ష్యమా.. అయితే ఇవి తెలుసుకోండి..!

ICET Exam | ఐసెట్‌లో బెస్ట్‌ స్కోర్‌ మీ లక్ష్యమా.. అయితే ఇవి తెలుసుకోండి..!

ICET Exam : ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సులతో ప్రవేశాల కోసం ప్రతి ఏడాది ‘ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ICET)’ లను నిర్వహిస్తుంటారు. ఎంబీఏలో ప్రవేశానికి బీఏ, బీకామ్‌, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్‌, బీఫార్మసీ చదివినవారు అర్హులు. ఎంసీఏలో ప్రవేశానికి బీసీఏ, డిగ్రీ (కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్), బీఎస్సీ, బీకామ్‌, బీఏ (ఇంటర్‌/డిగ్రీ స్థాయిలో గణితం సబ్జెక్టుగా చదివి ఉండాలి) పూర్తిచేసి ఉండాలి. ఈ పరీక్ష రాసేందుకు కనీస వయస్సు 19 ఏళ్లు, ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు.

తెలంగాణలో టీఎస్‌ ఐసెట్ (TS ICET), ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ ఐసెట్‌ (AP ICET) పేరుతో ఈ ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. తెలంగాణలో ఐసెట్‌ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్నది. ఏపీలో దరఖాస్తుల ప్రక్రియ దాదాపు పూర్తికావచ్చింది. తెలంగాణలో జూన్‌ 5, 6 తేదీల్లో, ఏపీలో మే 6, 7 తేదీల్లో ఈ ఐసెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐసెట్‌ మంచి ర్యాంకు సాధించాలంటే పరీక్షకు ఎలా సిద్ధం కావాలి..? సిలబస్‌లో ఏముంటుంది..? పరీక్షా విధానం ఎలా ఉంటుంది..? అనే వివరాలు అభ్యర్థుల కోసం..

ఐసెట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు అభ్యర్థులు ముందుగా విశ్లేషణాత్మక దృక్పథం కలిగి ఉండాలి. అన్వయ నైపుణ్యాలను అలవర్చుకోవాలి. పరీక్ష తీరు, సిలబస్‌ స్థాయిపై అవగాహన పొందాక విభాగాల వారీగా ప్రిపరేషన్‌ కొనసాగించాలి. డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, కమ్యూనికేషన్‌ ఎబిలిటీ, మ్యాథమెటికల్‌ ఎబిలిటీపై ప్రధానంగా ప్రశ్నలు ఉంటాయి.

డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌

డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ విభాగంలో రాణించేందుకు విశ్లేషణ నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి. ఇందులో ప్రశ్నలు ఒక డేటాను ఇచ్చి, దాని ఆధారంగా సమస్య సాధించేవిగా, స్టేట్‌మెంట్‌ ఆధారితంగా ఉంటాయి. బేసిక్‌ అర్థమెటిక్‌ అంశాల్లో పట్టు సాధించడం ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా స్టేట్‌మెంట్‌ ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే గణితంపై ప్రాథమిక అవగాహన అవసరం. ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ విభాగంలో రీజనింగ్‌ ఆధారిత ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు కోడింగ్, డీ కోడింగ్, బ్లడ్‌ రిలేషన్స్‌, సిరీస్, సిలాజిసమ్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌లపై పట్టు సాధించాలి.

కమ్యూనికేషన్‌ ఎబిలిటీ

వొకాబులరీ కోసం బేసిక్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. అదేవిధంగా వొకాబులరీ పెంచుకునేందుకు ప్రతిరోజు కనీసం 20 కొత్త పదాలు నేర్చుకోవడం, వాటిని వినియోగించే తీరుపై ప్రాక్టీస్‌ చేయాలి. బేసిక్‌ గ్రామర్‌ అంశాలుగా పేర్కొనే సినానిమ్స్, ఆంటానిమ్స్, క్వశ్చన్‌ ట్యాగ్స్, డైరెక్ట్‌-ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్‌ అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి. అందుకోసం ఆరు నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్‌ గ్రామర్‌ బుక్స్‌ చదవాలి. బిజినెస్‌ అండ్‌ కంప్యూటర్‌ టెక్నాలజీలో వ్యాపార-వాణిజ్య అంశాలు, తాజా పరిణామాలు, కంప్యూటర్‌ బేసిక్స్‌పై అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. వీటిలో రాణించాలంటే బిజినెస్‌ టెర్మినాలజీ, కొత్త వ్యాపార విధానాలు, ఆయా సంస్థలు – వాటి క్యాప్షన్‌లు లాంటివి తెలుసుకోవాలి. ఇక కంప్యూటర్‌ టెర్మినాలజీకి సంబంధించి బేసిక్‌ ఆఫీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ టూల్స్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌కు సంబంధించిన ముఖ్య భాగాలు, వాటి పనితీరుకు సంబంధించి ప్రాథమిక నైపుణ్యం ఉండాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ విభాగంలో ప్యాసేజ్‌ల ఆధారంగా అడిగే 20 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే ముందుగా అభ్యర్థులు ఒక అంశాన్ని, అందులోని కీలక పదాలను, సారాంశాన్ని గుర్తించే నేర్పు పెంచుకోవాలి.

మ్యాథమెటికల్‌ ఎబిలిటీ

మ్యాథమెటికల్‌ ఎబిలిటీలో ఉండే అర్థమెటిక్, జామెట్రికల్, స్టాటిస్టికల్‌ ఉప విభాగాలకు సంబంధించి ప్రాథమిక సూత్రాలపై అవగాహన పెంచుకోవాలి. ఇందుకోసం హైస్కూల్‌ స్థాయి మ్యాథమెటిక్స్‌ పుస్తకాలను అధ్యయనం చేయాలి. ప్రశ్నల శైలి కొంత క్లిష్టంగా ఉండే స్టాటిస్టికల్‌ ఎబిలిటీ కోసం ఇంటర్మీడియట్‌ స్థాయి పుస్తకాల ప్రిపరేషన్‌ అవసరం. ముఖ్యంగా ప్రాబబిలిటీ, ఇన్‌ఈక్వాలిటీస్‌ అంశాల కోసం ఈ స్థాయి ప్రిపరేషన్‌ తప్పనిసరి. అర్థమెటిక్‌ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు శాతాలు, లాభ నష్టాలు, నిష్పత్తులు, మెన్సురేషన్, పని-కాలంపై అవగాహన పెంచుకోవాలి. అల్జీబ్రా అండ్‌ జామెట్రికల్‌ ఎబిలిటీ కోసం ట్రిగ్నోమెట్రీ, సెట్స్‌ అండ్‌ రిలేషన్స్, లీనియర్‌ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్‌ లాంటి అంశాల్లో నైపుణ్యం కలిగి ఉండాలి.