Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను మూవీ టీమ్ జోరుగా నిర్వహిస్తోంది. దేశంలోని పలు నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహిస్తూ సినిమాపై హైప్‌ను మరింత పెంచుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా జరిగిన ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ ఫిట్‌నెస్ గురించి ఆమె చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

రామ్ చ‌ర‌ణ్ ఎన‌ర్జిటిక్ డ్యాన్స్..

ఈవెంట్‌లో మాట్లాడిన జాన్వీ కపూర్.. “ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ సర్‌తో కలిసి ఆయన పాటల్లో ఒకదానికి డ్యాన్స్ చేస్తే చాలు” అంటూ సరదాగా కామెంట్ చేశారు. “ఒక్కరోజంతా కూడా అవసరం లేదు.. సగం రోజే సరిపోతుంది. అప్పటికే మీ బాడీలో మార్పు కనిపిస్తుంది” అని నవ్వుతూ చెప్పారు.

అంతేకాదు, సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని కూడా జాన్వీ వెల్లడించారు. “మేము ఒక పాట కోసం మూడు నాలుగు రోజులు షూటింగ్ చేశాం. నాలుగో రోజుకి డ్యాన్సర్లందరూ సన్నబడ్డట్టు కనిపించారు. అంత ఎనర్జీతో రామ్ చరణ్ డ్యాన్స్ చేస్తారు” అంటూ ఆమె ఫన్నీగా చెప్పుకొచ్చారు. దీంతో సభలో నవ్వులు పూశాయి.

పెద్ది కోసం హార్డ్ వ‌ర్క్..

జాన్వీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ డ్యాన్స్ స్టామినా, ఫిట్‌నెస్ గురించి అభిమానులు మరోసారి చర్చించుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో బెస్ట్ డ్యాన్సర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్.. ‘పెద్ది’ కోసం కూడా ఎంతో కష్టపడ్డారని మూవీ యూనిట్ చెబుతోంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ ‘పెద్ది’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో యాక్షన్, ఎమోషన్, రొమాన్స్, స్పోర్ట్స్ డ్రామా అంశాలను దర్శకుడు అద్భుతంగా మిళితం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా క్రికెట్, కుస్తీ, పరుగు పందెం వంటి క్రీడలకు కథలో కీలక ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేయడం కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. పాత్రకు తగ్గట్టుగా తన లుక్, ఫిజిక్‌పై ఎంతో శ్రమ పెట్టినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోందని అభిమానులు చెబుతున్నారు.

ఇక బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్, ట్రైలర్ సోషల్ మీడియాలో భారీ స్పందన తెచ్చుకున్నాయి.