Vijay | విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. బీజేపీపై అనుమానాలు పెరుగుతాయి: నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు

Vijay | తమిళనాడు రాజకీయాల్లో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి మెజారిటీ సాధించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించినా మ్యాజిక్ ఫిగర్‌కు ఇంకా దూరంగానే ఉండటంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరిగాయి.

  • By: Sandeep |    movies |    Published on : May 08, 2026 10:55 AM IST
Vijay | విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. బీజేపీపై అనుమానాలు పెరుగుతాయి: నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు

Vijay | తమిళనాడు రాజకీయాల్లో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి మెజారిటీ సాధించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించినా మ్యాజిక్ ఫిగర్‌కు ఇంకా దూరంగానే ఉండటంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరిగాయి.

ఇప్పటికే విజయ్ మూడు సార్లు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇవ్వకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గవర్నర్ వైఖరిపై పలు రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అవకాశం ఇవ్వాలి..

ఈ వివాదాస్పద పరిస్థితులపై తాజాగా స్పందించిన సినీ నటి, బీజేపీ నేత కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు. “ఎలాంటి తప్పూ చేయకపోయినా బీజేపీ ఎందుకు నిందలు ఎదుర్కోవాలి? కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి” అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

టీవీకే పార్టీ ప్రజల మద్దతుతో అతిపెద్ద పార్టీగా అవతరించిందని, కాబట్టి వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం కల్పించడం గవర్నర్ రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని కస్తూరి పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంటే ప్రజల్లో అనుమానాలు పెరుగుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

బీజేపీనే చేస్తుంద‌ని అనుకుంటారు..

విజయ్ మార్గంలో వచ్చే ప్రతి ఆటంకాన్ని ప్రజలు రాజకీయ తంత్రంగానే చూస్తారు. నిజానికి బీజేపీ అలా చేయకపోయినా.. అందరూ అలానే అనుకుంటారు. అందుకే ఎలాంటి ఆటంకాలు లేకుండా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం బీజేపీ సొంత ప్రయోజనాలకే మంచిది” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇక ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కూడా గవర్నర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కమల్ హాసన్, విశాల్, ప్రకాశ్ రాజ్, పోసాని కృష్ణమురళి తదితరులు ప్రజా తీర్పును గౌరవించాలని డిమాండ్ చేశారు. టీవీకే అతిపెద్ద పార్టీగా గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు పడకపోవడం రాజ్యాంగ విరుద్ధమని వారు విమర్శించారు.

ఇంకా సస్పెన్స్..

ప్రస్తుతం తమిళనాడులో కొనసాగుతున్న ఈ రాజకీయ అనిశ్చితి దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. గవర్నర్ తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లభిస్తుందా? అన్న ప్రశ్నలు ఆసక్తిగా మారాయి.

ఇదిలా ఉండగా, కస్తూరి గతేడాది తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సమక్షంలో పార్టీలో చేరారు. అదే పార్టీలో ఉంటూ ఇప్పుడు బీజేపీపై ప్రజల్లో అనుమానాలు పెరగకుండా జాగ్రత్తపడాలని సూచించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.