Rajinikanth | రజినీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు

Rajinikanth | తమిళనాడులో బాంబు బెదిరింపులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ బెదిరింపులు అధికారులకు తలనొప్పిగా మారాయి. తాజాగా ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, నటుడు ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు హైఅలర్ట్ అయ్యారు.

  • By: Sandeep |    movies |    Published on : Apr 11, 2026 4:20 PM IST
Rajinikanth | రజినీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు

Rajinikanth | తమిళనాడులో బాంబు బెదిరింపులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ బెదిరింపులు అధికారులకు తలనొప్పిగా మారాయి. తాజాగా ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, నటుడు ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు హైఅలర్ట్ అయ్యారు.

తమిళనాడు డీజీపీ కార్యాలయానికి ఓ బెదిరింపు ఈమెయిల్ రావడంతో వెంటనే అధికారులు స్పందించారు. అందులో రజినీకాంత్, ధనుష్ నివాసాలను టార్గెట్ చేస్తూ పేలుళ్లు జరగనున్నాయని హెచ్చరికలు ఉండటంతో, పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దింపి, వారి ఇళ్ల పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

గ‌తంలోను ఇలానే..

ప్రస్తుతం ఈ తనిఖీలు కొనసాగుతుండగా, ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని సమాచారం. అయినప్పటికీ పోలీసులు పూర్తి స్థాయి భద్రతా చర్యలు చేపట్టి, పరిసర ప్రాంతాల్లో పహారా కట్టుదిట్టం చేశారు.

ఇలాంటి సంఘటనలు తమిళనాడులో కొత్తవి కావు. గత ఏడాది అక్టోబర్‌లో కూడా చెన్నైలోని పోయస్ గార్డెన్ ప్రాంతంలో ఉన్న రజినీకాంత్, ధనుష్ ఇళ్లతో పాటు టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుతంగై నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపులు వచ్చాయి. అక్టోబర్ 27న డీజీపీ కార్యాలయానికి వచ్చిన మెయిల్ ఆధారంగా పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు.

అదే సమయంలో అక్టోబర్ 13న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ నివాసానికి కూడా ఇలాంటి బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. అయితే అన్ని సందర్భాల్లోనూ తనిఖీల అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.

పోలీసుల దర్యాప్తు వేగం

తాజా ఘటనపై పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేపట్టారు. ఈమెయిల్స్ ఎక్కడి నుంచి పంపబడ్డాయి? వెనుక ఉన్నవారు ఎవరు? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. సైబర్ క్రైమ్ విభాగం కూడా రంగంలోకి దిగి, ఈ బెదిరింపుల మూలాలను గుర్తించే పనిలో ఉంది.

సెలెబ్రిటీల భద్రతపై ఆందోళన

ఇలా తరచూ ప్రముఖులను టార్గెట్ చేస్తూ వస్తున్న బెదిరింపులు భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా సినీ తారలు, రాజకీయ నాయకుల భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

మొత్తానికి, తరచూ వస్తున్న ఈ ఫేక్ బాంబు బెదిరింపులు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తుండగా, వాటి వెనుక ఉన్న అసలు నిందితులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది.