KALKI 2898 AD | కల్కి 2898 ఏడిలో భారీ తప్పిదం
రెబల్‌స్టార్ ప్రభాస్, దీపికా పడుకునే జంటగా నటిస్తున్న భారీ సైన్స్‌ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడి చిత్రంలో ఓ భారీ తప్పు దొర్లింది. అది కూడా అమితాబ్ బచ్చన్ పోషిస్తున్న అశ్వత్థామ పాత్ర ద్వారా.
వైజయంతీ మూవీస్(Vyjayanti Movies) – పరిచయం అక్కర్లేని బ్యానర్. అశ్వనీదత్(Aswani Dutt) – పేరు చెప్పాల్సిన అవసరం లేని నిర్మాత. ఎన్నో భారీ చిత్రాలు, సూపర్ హిట్ సినిమాలు అందించిన సంస్థ. 1975లో ఎదరులేని మనిషితో మొదలై, నిన్నటి సీతారామం వరకు బ్రహ్మాండమైన చిత్రాలను తీసిన నిర్మాత అశ్వనీదత్. ఎన్టీఆర్‌తో మొదలుపెట్టి, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లాంటి తరతరాల కథనాయకులతో అనితరసాధ్యమైన సినిమాలు తీసారు. మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి జంటగా తీసిన జగదేకవీరుడు–అతిలోక సుందరి చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ప్రస్తుతం అశ్వనీదత్ తన అల్లుడు, ప్రముఖ దర్శకుడు అయిన నాగ్అశ్విన్ దర్శకత్వంలో, బాహుబలి ప్రభాస్(Prabhas) కథానాయకుడిగా, దీపికా పదుకునే(Deepika Padukune) హీరోయిన్గా, దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), విశ్వనటుడు కమల్ హాసన్(Kamal Haasan) ప్రతినాయకుడిగా అత్యంత భారీగా ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రం నిర్మిస్తున్నాడు. దాని పేరు కల్కి 2898 ఏడీ(KALKI 2898- AD).
ఇప్పటివరకు ఈ సినిమా గురించి దర్శకుడు, నిర్మాత, నటీనటులు, విడుదలైన టీజర్లు చెప్పినదాని ప్రకారం, కథ మహభారత(Maha Bharata) కాలంలో మొదలై, భవిష్యత్తులో క్రీ.శ 2898 వరకు నడుస్తోందని తెలుస్తోంది. ఇందులో కథనాయకుడు ప్రభాస్ భైరవ అనే పాత్రలో నటిస్తుండగా, సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ మహాభారత కాలం నాటి ద్రోణ పుత్రుడు అశ్వత్థామ(Ashwatthama) పాత్రలో నటిస్తున్నాడు. మిగతా నటీనటుల పాత్రలు ఇంకా రివీల్ చేయలేదు. రేపోమాపో ట్రైలర్ విడుదల కాబోతోంది. దాంతో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
కల్కి టీజర్ యూట్యూబ్‌లో ఇప్పటికే కొన్ని మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది. అమితాబ్ పాత్రను విడుదల చేస్తూ కూడా ఒక టీజర్ వదిలారు. అందులో గమనిస్తే అశ్వత్థామ పాత్ర పోషిస్తున్న అమితాబ్ వృద్ధుడిగా కనిపిస్తాడు. ఆయన నుదుట ఒక కన్నులా వెలుతురు కనిపిస్తుంటుంది. అమితాబ్ యువకుడిగా, వృద్ధుడిగా కనిపించిన అన్ని ఫోటోలలో, విడియోలలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. అదేంటో తెలుసా..! అది శిరోమణి(Divine Gem).

ఇక పూర్తిగా అశ్వత్థామ విషయానికి వద్దాం. అంటే మహాభారత కాలానికి. అశ్వత్థామ ద్రోణాచార్యుడికి, కృపికి జన్మించిన పుత్రుడు. పుట్టుకతోనే నుదుట మణితో జన్మించాడు కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్లు. ఆ మణి వల్ల అశ్వత్థామకు అస్త్రశస్త్రాల వల్లగానీ, వ్యాధుల వల్ల గానీ, ఆకలిదప్పుల వల్ల బాధింపబడకుండా ఉంటాడు. ఇది ఆ శిరోమణి కథ. మహాభారతంలో 9వ పర్వమైన శల్యపర్వం ధుర్యోధనుడి మరణపు అంచులలో ఉండటంతో ముగుస్తుంది. అంతకుముందు భీముడి గదాఘాతాలతో తొడలంతా రక్తమయమై ఆఖరి క్షణాలు గడుపుతున్న ధుర్యోధనుడి వద్దకు యుద్ధంలో కౌరవవీరులందరూ చనిపోగా మిగిలిన అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ వెళ్లి తన స్థితి చూసి బాధ పడతారు. స్వతహాగానే ఆవేశపరుడు, దుందుడుకు స్వభావి అయిన అశ్వత్థామ తన పగ తీర్చుకుంటానని ‘అపాండవం’(పాండవులు లేకుండా) చేస్తానని రారాజుకు మాట ఇస్తే సంతోషపడ్డ సుయోధనుడు అశ్వత్థామను సర్వసైన్యాధిపతిని చేస్తాడు. ఆ తర్వాత మొదలయ్యేదే 10వది అయిన సౌప్తిక పర్వం.
సౌప్తిక పర్వం(Sauptika Parva)లోనే అశ్వత్థామ భావి జీవితం నిర్ణయించబడుతుంది. పాండవులనుకుని, వారి కుమారులైన ఉపపాండవులను(Upa Pandavas), ధృష్టద్యుమ్నుడు, శిఖండిలను నరికి చంపిన తర్వాత ఆపాండవం చేసానని చనిపోబోతున్న ధుర్యోధనుడికి చెప్పి ఆనందంగా ప్రాణం విడిచేలా చేస్తాడు అశ్వత్థామ. కానీ తను చంపేసింది పాండవులను కాదు, వారి కుమారులనని తెలుసుకున్న అశ్వత్థామ అర్జునుడి(Arjuna)కి భయపడి వేదవ్యాసుడి ఆశ్రమంలో దాక్కుంటాడు. జరిగిన ఘోరం తెలుసుకున్న భీముడు ఆగ్రహోదగ్రుడై అశ్వత్థామ వేటకు బయల్దేరాడు. అశ్వత్థామ వద్ద బ్రహ్మశిరోనామకాస్త్రం ఉందని ముందే తెలిసిన శ్రీకృష్ణుడు(Lord Sri Krishna) అర్జునుడితో సహా వ్యాసాశ్రమానికి వస్తే, వారిపై తనకు ఉపసంహారం తెలియని ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు అశ్వత్థామ. దానికి ప్రతిగా అర్జునుడు అదే అస్త్రాన్ని ప్రయోగించగా, నారదుడు వచ్చి ఆ అస్త్రాల వల్ల ప్రళయం సంభవించి మానవజాతి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని, ఉపసంహరించుకోమని కోరగా, అర్జునుడు ఉపసంహరించుకుంటాడు కానీ, అశ్వత్థామకు తెలియకపోవడం వల్ల, ఇంకా పగ చల్లారకపోవడం వల్ల అపాండవం చేస్తానని దుర్యోధనుడికి ఇచ్చిన మాట కోసం పాండవ వంశాన్ని నాశనం చేయడం కోసం దాన్ని దారి మళ్లించి అభిమన్యుడి భార్య ఉత్తర గర్భం మీదకు పంపుతాడు. అది ఉత్తర గర్భంలో ప్రాణం పోసుకుంటున్న పాండవ వారసుడిని కాల్చేస్తుంది. దాంతో అమిత క్రోధానికి గురైన శ్రీకృష్ణుడు, అశ్వత్థామను శపిస్తాడు. వ్యాసుడు అప్పుడు అతని నుదిటిపై ఉన్న శిరోమణి(Divine Gem)ని ఇచ్చి ప్రాణాలు కాపాడుకోమనగా, ఆ శిరోమణిని తీసి వ్యాసుడికి ఇచ్చేస్తాడు అశ్వత్థామ( కొన్నిచోట్ల శ్రీకృష్ణుడే దాన్ని తన సుదర్శన చక్రంతో పెకలించి, భూస్థాపితం చేసాడని, దాని శక్తి మళ్లీ బయటకు రాకుండా మంత్రశక్తులతో ఆ ప్రదేశాన్ని దుర్భేద్యం చేసాడని కూడా ఉంది). అశ్వత్థామను కలియుగాంతం వరకు నెత్తురు, చీము కారుతున్న గాయాలతో, పుండ్లతో, భయంకరమైన దుర్వాసనతో, ఎవరూ దగ్గరకు కూడా రాకుండాఉండేంత భయంకరంగా నిర్జనమైన కీకారణ్యాలలో బతకమని శపించాడు కృష్ణ పరమాత్మ. ఆ గాయాలలో ఈ మణి తీసేయగా నుదుటి మీద అయిన గాయం కూడా ఉంది. ఆ విధంగా యువకుడిగా ఉన్నప్పుడే అశ్వత్థామ ఆ మణిని కోల్పోయాడు.

దీనిని బట్టి మనకు తెలుస్తున్నదేమిటంటే, యువకుడిగా ఉన్నప్పుడు మాత్రమే అశ్వత్థామ నుదుట శిరోమణి ఉంటుంది కానీ, వృద్ధుడిగా ఉన్నప్పుడు కాదు. వేల సంవత్సరాలుగా ఇప్పటికీ చిరంజీవిగా బతుకుతున్న అశ్వత్థామ నుదుట ప్రస్తుతం శిరోమణి లేదు. అది ఉన్నట్టుగా సినిమాలో వృద్ధ అశ్వత్థామ పాత్రను చూపించారు. అది అతి పెద్ద తప్పు. ఈ విషయం వ్యాస మహాభారతం చదివిన చాలామందికి తెలుసు. కానీ దర్శకుడు నాగ్అశ్విన్ ఈ విషయంపై ఎందుకో దృష్టి పెట్టలేకపోయాడు. మహాభారతం చదవకుండానే అశ్వత్థామ పాత్రను తీర్చిదిద్దాడని కూడా అనుకోలేం. శిరోమణిని గ్రాఫిక్స్ ద్వారా అద్భుతంగా చూపించిన దర్శకుడు అసలు అది ముసలి అశ్వత్థామకు లేదన్న విషయం మాత్రం మర్చిపోయాడు.

కానీ, కనిపిస్తున్న కొన్ని ఫోటోలలో ఒకోసారి మణి లేకుండా కూడా వృద్ధ అశ్వత్థామ కనబడ్డాడు. మరి ఈ మర్మమేంటో మనకింకా తెలియదు. కానీ, వాస్తవమేమిటంటే, యుగాంతం వరకు అశ్వత్థామ అలాగే బతికిఉంటాడు. నర్మదా నదీ పరీవాహక ప్రాంతపు అరణ్యాలలో తిరుగాడుతుంటాడని ప్రతీతి. మరి ఈ తప్పిదానికి అశ్విన్ వద్ద ఏమైనా సమాధానముందో ఆయన చెపితేనే తెలియాలి.
Read more
Kalki 2898 AD | నాగ్ అశ్విన్‌కి.. ప్రభాస్ ఫ్యాన్స్ గుడి కట్టేస్తున్నారు.. ఎక్కడంటే?
Kalki 2898 AD | ‘బుజ్జి’ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తి రేకెత్తిస్తున్న వీడియో..
Prabhas- Anushka| మళ్లీ వార్తలలోకి ప్రభాస్-అనుష్కల పెళ్లి.. కృష్ణంరాజు భార్య స్పందన ఇదే..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram