పిల్లలు పక్క త‌డ‌ప‌కుండా ఉండాలంటే..

నిద్ర‌లో పిల్ల‌లు ప‌క్క త‌డ‌ప‌డం మామూలే. కొందరు పిల్లలు కాస్త పెద్దయ్యాక కూడా పక్క తడుపుతుంటారు. దీంతో పెద్దవాళ్లు వాళ్ల‌ను గేలి చేస్తుంటారు. కొంద‌రు బెదిరిస్తుంటారు

పిల్లలు పక్క త‌డ‌ప‌కుండా ఉండాలంటే..

నిద్ర‌లో పిల్ల‌లు ప‌క్క త‌డ‌ప‌డం మామూలే. కొందరు పిల్లలు కాస్త పెద్దయ్యాక కూడా పక్క తడుపుతుంటారు. దీంతో పెద్దవాళ్లు వాళ్ల‌ను గేలి చేస్తుంటారు. కొంద‌రు బెదిరిస్తుంటారు. ఎంత చెప్పినా వినరని, కావాలనే పక్కలో మూత్రం పోస్తున్నారని ఈసడించుకుంటుంటారు. పిల్లలను దారిలోకి తేవాలని భావిస్తూ క్రమశిక్షణ పేరుతో మరికొందరు వేధిస్తుంటారు. కానీ ఇలాంటి ప్రయత్నాలేవీ పిల్లల మీద పనిచేయవు. ఎందుకంటే ఇది వారు కావాలని చేస్తున్న పనేమీ కాదు.


సాధారణంగా శిశువులకు మూత్రం నిలుపుకోవటం తెలియదు. అందువల్ల ఎప్పుడంటే అప్పుడు పోసేస్తుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ మూత్రాశయాన్ని నియంత్రించే నాడుల వ్యవస్థ ప‌రిణ‌తి చెందుతుంది. కాబ‌ట్టి అప్పుడు ఆపుకోవ‌డానికి కావాల్సిన ప‌ట్టు డెవ‌ల‌ప్ అవుతుంది. అందుకే పెద్ద‌య్యే కొద్దీ అలా అనియంత్రంగా ప‌క్క త‌డిపే అల‌వాటు త‌గ్గిపోతుంది. సాధార‌ణంగా ఏడేళ్ల వ‌య‌సు వ‌చ్చేస‌రికి పిల్ల‌లెవ‌రూ ప‌క్క త‌డ‌ప‌రు. 90% మంది పిల్లలు రాత్రిపూట పక్క తడపటం పూర్తిగా మానేస్తారు.


పెద్దయ్యాక ఎందుకు?


కొందరిలో పెద్ద‌యిన‌ తర్వాత కూడా నిద్ర‌లో ప‌క్క త‌డిపే అల‌వాటు కొనసాగుతూ వస్తుంటుంది. దీనికి పిల్లలు రాత్రంతా మూత్రం ఆపుకోలేకపోవటం, మూత్రాశయం నిండినా మెలకువ రాకపోవటం, రాత్రిపూట పెద్దమొత్తంలో మూత్రం తయారు అవుతుండటం వంటివి కార‌ణ‌మ‌వుతాయి. అంతేకాదు.. కొందరు పిల్లలు పగటి పూట అంతగా మూత్రానికి వెళ్లకుండా బలవంతంగా ఆపుకోవటం కూడా దీనికి కారణం కావొచ్చు. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌, మలబద్ధకం, వూబకాయం, నిద్రలో శ్వాసకు అడ్డంకి తలెత్తటం, మధుమేహం, మూత్రకోశంలో, నాడీవ్యవస్థలో లోపాల వంటి ఇతరత్రా సమస్యలూ దీనికి దారితీస్తుండొచ్చు.


 


ఏం చేయాలి?


అన్నింటిక‌న్నా ముఖ్యంగా పిల్ల‌ల‌కు చుల‌క‌న చేస్తూ, తిట్ట‌డ‌మో, బెదిరించ‌డ‌మో చేయ‌కూడదు. దానివ‌ల్ల ఎటువంటి ఉప‌యోగం ఉండ‌ద‌ని గ్ర‌హించాలి. పిల్ల‌లు ప‌డుకోబోయే ముందే మూత్ర విస‌ర్జ‌న‌కు వెళ్లి వ‌చ్చి ప‌డుకునే అల‌వాటు చేయాలి. ప‌సి వ‌య‌సు నుంచే ఇది క్ర‌మంగా అల‌వాటు చేస్తే నిద్ర‌లో ప‌క్క త‌డిపేందుకు ఆస్కారం ఉండ‌దు. అలా అల‌వాటు చేసే ప్ర‌య‌త్నం చేసినా కూడా స‌మ‌స్య అలాగే ఉంటే, దాని వెనుక ఇన్ ఫెక్ష‌న్ల వంటి కార‌ణాలేమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. డాక్ట‌ర్ స‌ల‌హా తీసుకోవడం మంచిది.