Cardiac Microcurrent Device | గుండెకు గాయమైందా? మంచి పరిష్కారం కనుక్కున్న సైంటిస్టులు
గుండెలో ఎటువంటి సమస్య ఎదురైనా దాని ప్రభావం ముందుగా గుండె కండరం పైనే పడుతుంది. తద్వారా కార్డియాక్ కణజాలం దెబ్బతిని, క్రమంగా హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం పెరుగుతుంది. దీనికి మంచి పరిష్కారం కనుక్కున్నారు సైంటిస్టులు.

Cardiac Microcurrent Device | గుండెపోటు వచ్చినప్పుడల్లా గుండె కండర కణజాలం గాయపడుతూ ఉంటుంది. ఆ గాయం పెద్దదైతే కార్డియాక్ మజిల్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. పదే పదే ఇలా దెబ్బతింటూ ఉంటే కార్డియాక్ కణజాలం రిపేర్ కావడం కష్టమవుతుంది. అయితే, గుండెపోటు వల్ల దెబ్బతిన్న గుండె కణజాలం త్వరగా రిపేర్ చేయగలిగే ఒక పరికరాన్ని తయారుచేసింది జర్మనీకి చెందిన ఓ సంస్థ. శరీరంలో ఏర్పడిన గాయాలు మానడానికి అతి తక్కువ మోతాదు ఎలక్ట్రిక్ షాక్స్ ఉపయోగించవచ్చనే సూత్రం ఆధారంగా ఈ పరికరాన్ని అభివృద్ధి చేశామంటున్నారు ఈ సైంటిస్టులు.
డైలేటివ్ కార్డియోమయోపతి అనే సమస్య ఉన్నప్పుడు గుండె కణజాలం క్రమక్రమంగా బలహీనపడుతూనే ఉంటుంది. చివరగా ఇక గుండె ఏమాత్రం పనిచేయలేని స్థితి ఏర్పడుతుంది. అంటే గుండె కండరం ఇక సంకోచం, వ్యాకోచం చెందలేనంతగా దెబ్బతింటుందన్నమాట. ఇలాంటప్పుడు కొన్నిసార్లు మందులు పనిచేసినప్పటికీ, పేస్ మేకర్ అమర్చడం మాత్రమే ఇప్పుడు ఎక్కువగా వాడుతున్న చికిత్స. ఎక్కువ సందర్భాల్లో ఈ చికిత్స వల్ల కూడా ఉపయోగం ఉండదు. అప్పుడు హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ తప్ప గత్యంతరం ఉండదు.
వియన్నా మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు ఆధ్వర్యంలో రూపొందించిన కార్డియోక్ మైక్రో కరెంట్ పరికరం ఇలాంటి పేషెంట్లకు మంచి ఫలితాన్ని ఇస్తుందంటున్నారు ఈ సైంటిస్టుల్లో ఒకరైన డొమినిక్ వీడెమాన్. ఇది పేస్ మేకర్ లాంటి పరికరమే అయినా, దాని కన్నా అడ్వాన్స్ వర్షన్ గా చెప్పుకోవచ్చు. ఛాతి పైన రెండు చిన్న గాట్లు పెట్టి, గుండె పైన ఈ పరికరాన్ని అమరిస్తే, దాని నుంచి మైక్రో కరెంట్స్ విడుదలై గుండె కణజాలాన్ని యాక్టివేట్ చేస్తుందని చెప్తున్నారు దీని రూపకర్తలు. ఇది ఏ మేరకు ఫలితాలను అందిస్తుందో వెయిట్ చేయాలి.