Food Inspectors | ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల ‘దందా ఆన్‌ వీల్స్‌’.. రెండేళ్లుగా ఒక్క హోటల్‌ సీజ్‌ చేసింది లేదు

ఫుడ్‌ సేఫ్టీ ఆన్‌ వీల్స్‌ను అడ్డం పెట్టుకుని అడ్డగోలు వసూళ్లు విధాత: హైదరాబాద్‌ మహా నగరంలో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల వసూళ్ల దందా జోరుగా నడుస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బల్దియాలో ఒకప్పుడు ముగ్గురు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు (Food Inspectors) మాత్రమే ఉండేవారు. తర్వాత ప్రభుత్వ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 18 మంది కొత్తగా నియమితులయ్యారు. అయితే.. ఎంతో ఉత్సాహంతో పని చేయడానికి వ‌చ్చిన‌ వారికి ఇక్కడ నిరాశే ఎదురైందని అంటున్నారు. కొన్నేండ్లుగా ఇక్కడే పాతుకుపోయిన కొందరు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు.. కొత్తగా […]

Food Inspectors | ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల ‘దందా ఆన్‌ వీల్స్‌’.. రెండేళ్లుగా ఒక్క హోటల్‌ సీజ్‌ చేసింది లేదు
  • ఫుడ్‌ సేఫ్టీ ఆన్‌ వీల్స్‌ను అడ్డం పెట్టుకుని అడ్డగోలు వసూళ్లు

విధాత: హైదరాబాద్‌ మహా నగరంలో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల వసూళ్ల దందా జోరుగా నడుస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బల్దియాలో ఒకప్పుడు ముగ్గురు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు (Food Inspectors) మాత్రమే ఉండేవారు. తర్వాత ప్రభుత్వ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 18 మంది కొత్తగా నియమితులయ్యారు. అయితే.. ఎంతో ఉత్సాహంతో పని చేయడానికి వ‌చ్చిన‌ వారికి ఇక్కడ నిరాశే ఎదురైందని అంటున్నారు.

కొన్నేండ్లుగా ఇక్కడే పాతుకుపోయిన కొందరు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు.. కొత్తగా చేరిన వారిని సక్రమంగా పని చేయనీయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు సంవత్సరాలుగా హైదరాబాద్‌ మహా నగరంలో ఒక్కటంటే ఒక్క హోటల్‌ను సీజ్‌ చేసిన దాఖలు లేవని పలువురు ప్రస్తావిస్తున్నారు. కొత్తగా చేరిన వారు ఏదైనా హోటల్‌కు తనిఖీల కోసం వెళ్లేందుకు ప్రయత్నించినా.. తమ సుపీరియర్‌లు అడ్డు తగులుతుండటంతో చేసేది లేక వెనుదిరుగుతున్నారని తెలుస్తున్నది.

ఫుడ్‌ ఆన్‌ వీల్స్‌తోనూ దందా

కొత్తగా ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ (Food Safety on Wheels) రావడంతో ఇప్పుడైనా పని చేయడానికి అవకాశం వచ్చింది అనుకుంటున్న తరుణంలో, దానిని కూడా తమ అక్రమ సంపాదనకు సుపీరియర్లు వాడుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారేమో.. కొత్తగా చేరినవారు సైతం ‘రాను రాను రాజు గుర్రం గాడిద అయినట్లు’, తమ సుపీరియర్ల బాటలోనే నడుస్తున్నట్టు వినికిడి. తమకు కేటాయించిన సర్కిల్‌ పరిధిలోని హోటళ్లకు పొద్దున్న టిఫిన్‌కు, మధ్యాహ్నం భోజనాలకు వెళ్లటం, తాము ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లమని చెప్పుకొంటూ వసూళ్లకు పాల్పడటం రివాజుగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

తోడైన స్విగ్గి, జొమాటో ఆర్డర్లు

స్విగ్గి, జొమాటో తదితర ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌లు వచ్చిన తర్వాత ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు ఇచ్చే fssai సర్టిఫికెట్లకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా వాటికి కూడా రెట్లు కట్టి ఇస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కొన్ని హోటళ్లు ట్రేడ్ లైసెన్స్(Trade License) తీసుకోకుండా ఈ సర్టిఫికెట్ తీసుకునే పని చేస్తున్నాయని సమాచారం. ఆహార కల్తీని నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి అధికారుల చేతి వాటంతో అనారోగ్యానికి గురవుతున్నామని ప్రజలు వాపోతున్నారు.

ఫిర్యాదు చేసినా.. అధికారులు ఆయుధంగా వాడుకుంటారే త‌ప్ప‌..

ఇటీవల నేరేడ్‌మెట్‌లోని ఒక హోటల్‌లో ఆహారం తిని.. ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికీ వారు చికిత్స పొందుతూనే ఉన్నారు. ఆన్‌లైన్‌లో ఫిష్ బిర్యానీ ఆర్డర్ చేసిన యువకులు అది తిని ఫుడ్ పాయిజన్ అయి హాస్పిటల్‌లో చేరి 40 వేలు ఖర్చు చేసుకున్న పరిస్థితి ఉన్నది.

దీనిపై ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరుగుతుందని అనుకోవడం లేదని, తమను అడ్డుపెట్టుకుని అధికారులే డబ్బు తీసుకుంటారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు తాము ఎవరికీ జవాబుదారీ కాదని, తాము ఏమి చేసినా ఎవరూ అడగరని ధీమాతో ఉన్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.