న్యూస్ పేప‌ర్ల‌లో ఫుడ్ డేంజ‌ర్‌.. పేప‌ర్ ఇంక్‌తో తీవ్ర అనారోగ్యం

న్యూస్ పేప‌ర్ల‌లో ఫుడ్ డేంజ‌ర్‌.. పేప‌ర్ ఇంక్‌తో తీవ్ర అనారోగ్యం
  • ఆహారం నిల్వ, ప్యాకింగ్‌కు న్యూస్‌పేప‌ర్లు
  • వాడొద్ద‌ని గ‌తంలోనే నిషేధం
  • ప్యాకింగ్‌కు వాడొద్ద‌ని వ్యాపారుల‌కు,
  • వినియోగ‌దారుల‌కు ఎఫ్ ఎస్ఎస్ఏఐ హెచ్చ‌రిక‌



విధాత‌: రోడ్లుపై తిరుతిండ్లు అన్నీ దాదాపుగా న్యూస్ పేప‌ర్ల‌లోనే పెట్టి అందిస్తుంటారు. మిర్చిబ‌జ్జీలు, పునుగులు, ఇడ్లీలు, బోండాలు, స‌మోసాలు వంటివి ఇస్తుంటారు. ఎక్కువ సంద‌ర్భాల్లో న్యూస్ పేప‌ర్ల‌లోనే వీటిని పార్సిల్ చేసి ఇస్తుంటారు. వాటిని లొట్ట‌లేసుకుంటూ తింటుంటాం. కానీ, న్యూస్‌పేప‌ర్ల‌లో పెట్టిన ఫుడ్ తిన‌డం ఆరోగ్యానికి హానికరం అనే సంగ‌తి మర్చిపోతుంటాం.


కానీ, ఆహార పదార్థాలు వడ్డించడానికి, ప్యాకింగ్‌కు, నిల్వ చేయడానికి వార్తాపత్రికలను ఉపయోగించడం ప్ర‌మాదక‌ర‌మ‌ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) హెచ్చ‌రించింది. త‌క్ష‌ణ‌మే ఇలాంటి చ‌ర్య‌లు నిలిపివేయాల‌ని భారతదేశంలోని వినియోగదారులు, ఆహార విక్రేతలకు తాజాగా హెచ్చ‌రిక‌లు జారీచేసింది. వార్తాపత్రికల్లో వాడే ఇంక్‌లో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయని, అవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని ఫుడ్ రెగ్యులేటర్ తెలిపింది


న్యూస్ పేపర్ ఇంక్‌లో హానికర రసాయనాలు


“న్యూస్ పేపర్లను తయారు చేయడానికి వాడే ఇంక్‌లో ఎన్నో రసాయనాలు కలుపుతుంటారు. ప్రింటింగ్ ఇంక్‌లో ఆరోగ్యానికి హాని కలిగించే వివిధ బయోయాక్టివ్ మెటీరియల్స్ ఉంటాయి. దానికి తోడు వీటిని ఎక్కడ పడితే అక్కడ వేస్తారు. ఉదయం పేపర్లు వేసే టప్పుడు కూడా ఇవి చెట్ల మధ్యలో, దుమ్ములో పడిపోతూ ఉంటాయి. వీటిపై దుమ్మూ, ధూళి అనేవి ఎక్కువగా పేరుకుపోయి ఉంటాయి. ఇలాంటి వాటిపై వేడి వేడి ఆహార పదార్థాలు వేయడం వల్ల పలు సమస్యలు వస్తాయి. అంతే కాదు ఇవే దీర్ఘకాలిక వ్యాధులుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి” అని FSSAI చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జీ కమల వర్ధనరావు హెచ్చ‌రించారు.


న్యూస్ పేపర్‌లో ఉంచిన ఆహారాలు డేంజర్


రసాయనాలు కలిపిన ఈ ఇంక్ శరీరంలోకి వెళ్లడం వల్ల లేని పోని అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఇవి వెంటనే చూపించక పోయినా.. భవిష్యత్తులో మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ఈ విషయంపై పలు అధ్యయనాలు చేసినట్టు వెల్ల‌డించింది. న్యూస్ పేపర్లను ఆహార పదార్థాలకు అస్సలు వినయోగించ వద్దని తాజాగా సూచించింది. న్యూస్ పేప‌ర్ల‌పై బ్యాక్టీరియా, వైరస్‌లు లేదా ఇతర వ్యాధికారక క్రిముల ద్వారా కలుషితమయ్యే అవకాశం ఉంది. ఇవి ఆహారంలోకి మారవచ్చు, ఇది ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలకు కారణమవుతుంద‌ని హెచ్చరించింది.


ఆహార నియంత్రణ సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ప్యాకేజింగ్) రెగ్యులేషన్స్-2018 చ‌ట్టం ప్ర‌కారం

ఆహార ప‌దార్థాల‌ నిల్వ‌, ప్యాకింగ్, పార్సిళ్లకు న్యూస్‌పేప‌ర్ల‌ను ఉపయోగించడాన్ని నిషేధించింది. ఆ చ‌ట్టం ప్ర‌కారం.. వినియోగదారులు, విక్రేతలు తినదగిన వస్తువులను కవర్ చేయడానికి వార్తాపత్రికలను ఉపయోగించకూడ‌దు. వేయించిన ఆహారాల నుంచి అదనపు నూనెను పీల్చుకోవడానికి వార్తాపత్రికలను కూడా వాడ‌కూడ‌ద‌ని ఆ చ‌ట్టం హెచ్చ‌రించింది.