టీ ప్రియులారా పారా హుషార్‌… బానిస‌ల‌వుతున్నారేమో చూసుకోండి…

టీ ప్రియులారా పారా హుషార్‌… బానిస‌ల‌వుతున్నారేమో చూసుకోండి…

విధాత‌: త‌ల‌నొప్పి వ‌చ్చినా.. చిరాకు క‌లిగినా.. దిగాలుగా ఉన్నా సంతోషంగా ఉన్నా ఛాయ్ కొట్ట‌డం భార‌తీయుల‌కు బాగా అలవాటు. భార‌తీయుల‌కే కాదు ఆ మాట‌కొస్తే ద‌క్షిణాసియా దేశాల‌న్నింటిలోనూ టీ అంద‌రికీ ఆప్త మిత్రుడు. అయితే టీ అల‌వాటు చేసుకోవ‌డం (Tea Addiction) వ‌ల్ల కొన్ని అన‌ర్థాలు ఉన్నాయ‌ని.. అవి ఆత్మ‌హ‌త్యకు సైతం పురిగొల్ప‌గ‌ల‌వ‌ని ఒక తాజా అధ్య‌య‌నం పేర్కొంది. టీ అల‌వాటుకి మాన‌సిక స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌టానికి ఉన్న సంబంధాన్ని ఈ అధ్య‌య‌నం కూలంకుషంగా చ‌ర్చించింది.


 


పాల‌తో త‌యారుచేసే టీ తాగ‌డం అలవాటు చేసుకుంటే ఒత్తిడి, ఆందోళ‌న త‌ర్వాత కాల‌క్ర‌మంలో ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌ల వ‌ర‌కు వెళ‌తామ‌ని పేర్కొంది. చైనాకు చెందిన షింగువా యూనివ‌ర్సిటీ, సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ ఫైనాన్స్‌, ఎక‌న‌మిక్స్ ఇన్ చైనా అధ్యాప‌కులు సంయుక్తంగా ఈ అధ్య‌య‌నాన్ని చేప‌ట్టారు. చైనా యువ‌త‌లో ఇటీవ‌ల టీ సేవంచే అల‌వాటు పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ అధ్య‌య‌నం నిర్వ‌హించామ‌ని వారు పేర్కొన్నారు.


ఇందులో భాగంగా 5,281 మంది విద్యార్థుల‌ను వారు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని వారి టీ అల‌వాటును, మాన‌సిక ఆరోగ్యాన్ని ప‌రిశీలించారు. ప‌రిశోధ‌కులు ప్ర‌త్యేకంగా రూపొందించుకున్న ఎడిక్ష‌న్ స్కేలును ఉప‌యోగించి విద్యార్థుల‌కు టీ మీద ఉన్న మ‌క్కువ‌ను లెక్కించారు. ఎప్పుడు ప‌డితే అప్ప‌డు టీ తాగుదామ‌ని అనుకోవ‌డం. ప‌నిచేస్తున్నా టీ మీద‌కు ధ్యాస వెళ్ల‌డం, కొంచమే అనుకుని త‌ర్వాత క‌ప్పు మీద క‌ప్పు లేపేయ‌డం వంటి వాటికి ఈ స్కేలులో ఎక్కువ మార్కులు వేశారు.



 మొత్త‌మ్మీద స‌గ‌టున ఈ 5,281 మంది వారంలో ఒక్క‌సారైనా టీ లేక‌పోతే ఉండ‌లేను అనే ప‌రిస్థితిని ఎదుర్కొన్నార‌ని క్రోడీక‌రించారు. పాల టీలో ఉండే మితిమీరిన పంచ‌దార‌, కెఫీన్ తాగే వారి మూడ్‌ను నిస్తేజంగా ఉంచి, స‌మాజానికి దూరంగా ఉంచుతాయ‌ని ఈ అధ్య‌య‌నం అభిప్రాయ‌ ప‌డింది. ఇలా ఇది ఒంట‌రిత‌నానికి, త‌ర్వాత ఆత్మ‌హ‌త్య‌ల ఆలోచ‌న‌ల‌కు దారి తీస్తుంద‌ని పేర్కొంది. అయితే ఈ ప‌రిస్థితికి టీ నేరుగా ఎలా కార‌ణం అని ఈ అధ్య‌య‌నం చెప్ప‌లేక‌పోయింది.


‘చైనాలో కానీ ఇత‌ర దేశాల్లో కానీ టీకి యువ‌త అల‌వాటు ప‌డ‌టం బాగా పెరిగింది. త‌మ భావోద్వేగాల‌ను, మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను అదుపులో ఉంచుకోవ‌డానికి టీని ఎక్కువ‌గా సేవిస్తున్నారు. ఈ కోణంలో చూస్తే ఇది చాలా మందికి వ్య‌స‌నంలా మారింద‌ని చెప్పొచ్చు. కొద్ది కాలం త‌ర్వాత టీ అంటే వారికే మొహం మొత్తి తాగ‌డాన్ని తగ్గించాల‌నుకుంటారు. కానీ అప్ప‌టికే ప‌రిస్థితి చేయి దాటిపోతుంది. దీంతో వారు ఒత్తిడికి లోనై తీవ్ర ఇబ్బందులు ప‌డ‌తారు’ అని త‌మ నివేదిక‌లో అధ్య‌య‌న‌క‌ర్త‌లు వెల్ల‌డించారు.