Usha Chilukoori | ట్రంప్‌ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌ భార్య ఉషా చిలుకూరి ఎవరో తెలుసా?

కొన్నేళ్లుగా అమెరికా ఎన్నికల్లో ఏదో ఒక రూపంలో భారతీయ లింకులు కనిపిస్తున్నాయి. ఇప్పటి ఎన్నికల్లో కూడా. ఇప్పుడు అందరూ వెతుకుతున్నది ఎవరీ ఉషా చిలుకూరి వాన్స్‌ అన్నదే! అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో దిగిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్‌ (39)ను ఎంచుకున్నారు

Usha Chilukoori | ట్రంప్‌ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌ భార్య ఉషా చిలుకూరి ఎవరో తెలుసా?

వాషింగ్టన్‌: కొన్నేళ్లుగా అమెరికా ఎన్నికల్లో ఏదో ఒక రూపంలో భారతీయ లింకులు కనిపిస్తున్నాయి. ఇప్పటి ఎన్నికల్లో కూడా. ఇప్పుడు అందరూ వెతుకుతున్నది ఎవరీ ఉషా చిలుకూరి వాన్స్‌ అన్నదే! అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో దిగిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్‌ (39)ను ఎంచుకున్నారు. జేడీ వాన్స్‌ భార్యే భారతీయ మూలాలు ఉన్న ఉషా చిలుకూరి వాన్స్‌. భారతీయ మూలాలే కాకుండా.. ఈసారి తెలుగు మూలాలు కూడా ఉండటం విశేషం. గతంలో జేడీ వాన్స్‌ ఓహియో సెనెటర్‌గా ఎన్నికయ్యే సమయంలో పలు సందర్భాల్లో ఉషా చిలుకూరి వాన్స్‌ ప్రజల్లో కనిపించారు.
జేడీ వాన్స్‌ అభ్యర్థిత్వాన్ని ట్రూత్‌ సోషల్‌లో ధృవీకరించిన ట్రంప్‌.. ‘సుదీర్ఘ చర్చలు, ఆలోచనలు, అనంతరం అద్భుతమైన ప్రతిభను దృష్టిలో ఉంచుకుని అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా గొప్ప రాష్ట్రం ఓహియో సెనెటర్‌ జేడీ వాన్స్‌ సరైన వ్యక్తి అని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు.
చాలా ఏళ్ల క్రితమే అమెరికాకు వలస వచ్చిన భారతీయ దంపతుల కుమార్తె ఉషా చిలుకూరి. ఆమె కాలిఫోర్నియాలోని శాన్‌ డియాగోలో పెరిగారు. ఒక ప్రభుత్వ సంస్థలో ఆమె లిటిగేటర్‌గా పనిచేస్తున్నారు. యేల్‌ జర్నల్‌ ఆఫ్‌ లా అండ్‌ టెక్నాలజీ మేనేజింగ్‌ ఎడిటర్‌గా పనిచేశారు. అదే పత్రికకు ఎగ్జిక్యూటివ్‌ డెవలప్‌మెంట్‌ ఎడిటర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆమె తల్లిదండ్రులు క్రిష్ చిలుకూరి, లక్ష్మి చిలుకూరి. ఇద్దరూ ప్రొఫెసర్లు. వారు ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమెరికాకు వెలస వెళ్లారు. ఉషా చిలుకూరి.. చరిత్ర సబ్జెక్టులో యేల్‌ వర్సిటీ నుంచి బ్యాచిలర్‌ పట్టా పొందారు. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో ఫిలాసఫీలో మాస్టర్స్‌ డిగ్రీ అందుకున్నారు.కేంబ్రిడ్జ్‌లో చదువుతున్నప్పుడు వామపక్ష, లిబరల్‌ గ్రూపుల కార్యకలాపాల్లో పాల్గొనేవారు.
ఉషా, జేడీ వాన్స్‌ మొదటిసారి యేల్‌ లా స్కూల్‌లో కలుసుకున్నారు. 2014లో కెంటకీలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఆమె తన కెరీర్‌లో అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌కు సహాయకురాలిగా కొంతకాలం పనిచేశారు. యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ ఫర్‌ డీసీకి జస్టిస్‌ బ్రెట్‌ కవనాఫ్‌ న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయనకు కూడా సహాయకురాలిగా ఉన్నారు. 2014లో డెమోక్రాట్‌గా రిజిస్టర్‌ చేసుకున్నారు. ఉషా చిలుకూరి, వాన్స్‌ పెళ్లి హిందూసంప్రదాయంలో జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు.. ఎవాన్‌ బ్లెయిన్‌, వివేక్‌, మిరాబెల్‌ ఉన్నారు.
జేడీ వాన్స్‌ బాల్యం ఓహియోలోని మిడిల్‌టౌన్‌లో సాగింది. ఆయన తొలుత మెరెయిన్స్‌లో ఇరాక్‌లో విధులు నిర్వహించారు. అనంతరం ఆయన ఓహియో స్టేట్‌ యూనివర్సిటీ నుంచి, యేల్‌ లా స్కూల్‌ నుంచి పట్టాలు పొందారు. ట్రంప్‌ పెద్ద కొడుకు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌తో జేడీ వాన్స్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జేడీ వాన్స్‌ 2016లో రాసిన ‘హిల్‌బిల్లీ ఎలెగి’ పుస్తకాన్ని జూనియర్‌ ట్రంప్‌ బాగా ఇష్టపడతారు. ఆ పుస్తకంలో వాన్స్‌.. ఉష తనకు ‘యేల్‌ స్పిరిట్‌ గైడ్‌’గా అభివర్ణించారు.