ఫ్రాన్స్‌లో దొరికిన ఓ మ్యాజిక్ రాయి.. చ‌రిత్ర గుట్టు విప్పుతుందా?

ఫ్రాన్స్‌లో దొరికిన ఓ మ్యాజిక్ రాయి.. చ‌రిత్ర గుట్టు విప్పుతుందా?

విధాత‌: పురాత‌న మాన‌వుడి నివాసాలు, ర‌హ‌స్యాలు తెలుసుకునేందుకు ప్ర‌పంచంలో చాలా చోట్ల ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ‌కు దొరికిన ఆధారాల‌ను స‌రి చూసుకుంటూ పురాత‌త్వ శాస్త్రవేత్త‌లు (Archeology) త‌మ ప‌రిశోధ‌న‌లను ముందుకు తీసుకెళ‌తారు. ఈ నేప‌థ్యంలో ఫ్రాన్స్‌ (Treasure Map in France) లో దొరికిన ఒక పురాత‌న రాయి 4000 వేల ఏళ్ల నాటి అనేక ర‌హ‌స్యాల‌ను విప్పుతుంద‌ని శాస్త్రవేత్త‌లు భావిస్తున్నారు.


దీనిపై అర్థం కాని రీతిలో ఒక మ్యాప్ లాంటిది ఉండ‌టంతో ఆ రాయిని వారు ట్రెజ‌ర్ మ్యాప్ అని పిలుస్తున్నారు. కాంస్య యుగానికి చెందిన ఈ రాయిని తొలినాళ్లలో సెయింట్ బెలెక్ స్లాబ్ అని పిలిచేవారు. తొలుత 1900 సంవ‌త్స‌రంలో ఫ్రాన్స్‌లోని ఫినెస్ట‌రే అనే ప్రాంతంలో దీనిని క‌నుగొన్నారు. ఆ త‌ర్వాత ఎందుక‌నో ఒక శ‌తాబ్దం పాటు ఉనికిలో లేకుండా అదృశ్య‌మైంది. త‌ర్వాత 2014లో పురాత‌న శాస్త్రవేత్త‌లు మ‌రో సారి దీనిని క‌నుగొని ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రిశోధ‌న‌ (Study)లు చేశారు. ఆ ఫ‌లితాల‌ను అనుస‌రించి దీనిని యూర‌ప్‌నకు చెందిన అతి పెద్ద మ్యాప్‌గా గుర్తించారు.


అయితే ఇంకా ఈ రాయి వ‌య‌సును, దాని పై ఉన్న ఆ మ్యాప్ ఎప్పుడు వేశార‌నే వివ‌రాల‌ను క‌నుగొనాల్సి ఉంది. ఒక రాయిపై ఉన్న మ్యాప్‌ను చూస్తూ కొత్త ప్ర‌దేశాల‌ను క‌నుక్కోవ‌డం అనే ఊహ ఎంతో కొత్త‌గా ఉంది. ఇది ఇంత‌కుముందు ఎప్పుడూ చేయ‌నిది అని యూనివ‌ర్సిటీ ఆఫ్ వెస్ట‌ర్న్ బ్రిట‌నీ ప్రొఫెస‌ర్ యువాన్ పైల్ల‌ర్ పేర్కొన్నారు. రాడార్ ప‌రిక‌రాలు, ఏరియ‌ల్ ఫొటోగ్ర‌ఫీ ద్వారా పురాత‌న న‌గ‌రాల‌ను గుర్తిస్తారు. అయితే ఆయా ప్ర‌దేశాల్లో గ‌నుక ఇప్పుడు కొత్త న‌గ‌రాలు వెలిసి ఉంటే.. వాటిని ఈ విధానాల్లో గుర్తించ‌డం క‌ష్ట‌మ‌వుతుంది.


కొత్త భ‌వ‌నాల కోసం పునాదుల‌ను త‌వ్వే క్ర‌మంలో ఆ గురుతులు చెరిగిపోవ‌డ‌మే దీనికి కార‌ణం. మొత్తం 30 * 21 కి.మీ. ఉన్న ఈ రాయిని పూర్తి స్థాయిలో అధ్య‌య‌నం చేయ‌డానికి 15 ఏళ్లు ప‌ట్టింద‌ని నికోల‌స్‌, మ‌రో శాస్త్రవేత్త పైల్లర్ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం దీనిపై ఉన్న న‌దుల‌ను, ప‌ర్వ‌తాల‌ను గుర్తించామ‌ని.. న‌గ‌రాల‌ను గుర్తించాల‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న యూర‌ప్ మ్యాప్‌ల‌తో పోల్చితే ఇది 80 శాతం వ‌ర‌కు స‌రిపోలుతోంద‌ని తెలిపారు. ఈ మ్యాప్‌ను పూర్తిగా ప‌రిష్క‌రించ‌గ‌లిగితే భ‌విష్య‌త్తును మ‌లుపుతిప్పే ర‌హ‌స్యాలు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని వారు భావిస్తున్నారు.