ఆర్టిమిస్ 2 ప్రాజెక్టులో నాసా ముంద‌డుగు.. డెడ్‌లైన్ వైపు వ‌డివ‌డిగా ప్ర‌యాణం

  • Publish Date - October 25, 2023 / 08:52 AM IST

చంద్రుని (NASA Moon Missions) పై మ‌నుషుల నివాసాల‌ను ఏర్పాటు చేయ‌డానికి ఉవ్విళ్లూరుతున్న నాసా… ఆర్టిమిస్ (Artemis 2) పేరుతో ద‌శ‌ల‌వారీగా ప్ర‌యోగాలు చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఆర్టిమిస్ 1తో ఇప్ప‌టికే విజ‌యాన్ని అందుకున్న సాసా.. 2024 న‌వంబ‌రులో ఆర్టిమిస్ 2 మిష‌న్‌ను ప్ర‌యోగించనుంది. తాజాగా ఈ ప్రాజెక్టులో కీల‌క భాగాలైన ఓరియాన్ క్రూ మాడ్యూల్‌, స‌ర్వీస్ మ్యాడ్యూల్ రూప‌క‌ల్ప‌న పూర్త‌యిన‌ట్లు నాసా ప్ర‌క‌టించింది. ఇటీవ‌లే ఫ్లోరిడాలోని నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఆప‌రేష‌న్స్‌, చెక‌వుట్ బిల్డింగ్‌లో వీటిని అనుసంధానించిన‌ట్లు వెల్ల‌డించింది.


ఆర్టిమిస్ 2 అనేది ఈ వరుస‌లో తొలి మాన‌వ స‌హిత అంత‌రిక్ష ప్ర‌యోగం. ఇందులో రెడ్ వైస్‌మ్యాన్‌, విక్ట‌ర్ గ్లోవ‌ర్‌, క్ర‌స్టినా కోచ్ అనే ముగ్గురు వ్యోమ‌గాములు అంత‌రిక్షంలోకి వెళ్లి.. చంద్రుని చుట్టూ తిరుగుతారు. అక్క‌డ కాలు మోప‌కుండా.. ప‌రిశోధ‌న‌లు చేసి భూమికి తిరిగొస్తారు. ఈ ప్ర‌యోగం ద్వారా మాన‌వ స‌హిత యాత్ర‌ల‌లో త‌మ సామ‌ర్థ్యాన్ని మ‌దింపు చేసుకోవాల‌ని నాసా భావిస్తోంది. ఈ ఫ‌లితాల‌ను ప‌రిశీలించి చంద్రునిపై మాన‌వుణ్ని దింపేలా ప‌రిశోధ‌న‌లు కొన‌సాగిస్తుంది.


అలాగే భారీ రాకెట్ ఎస్ ఎల్ ఎస్‌, ఓరియ‌న్ స్పేస్‌క్రాఫ్ట్‌ల‌పైనా ఒక అంచ‌నాకు రావ‌డానికి ఆర్టిమిస్ 2 ఉప‌యోగ‌పడుతుంది. మిష‌న్‌లో భాగంగా సుమారు 10 రోజుల పాటు వ్యోమ‌గాములు అంత‌రిక్షంలో ఉంటార‌ని నాసా ఇప్ప‌టికే వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఓరియ‌న్ క్రూ మాడ్యుల్‌, స‌ర్వీస్ మాడ్యుల్‌ల‌ను అనుసంధానించిన శాస్త్రవేత్త‌లు.. వాటికి ప‌వ‌ర్ టెస్ట్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ ప‌రీక్ష‌లో అంత‌రిక్షంలో ఉన్న వాక్యుమ్ త‌ర‌హా ప‌రిస్థితుల‌నే సృష్టించి మాడ్యుళ్ల ప‌నితీరును విశ్లేషిస్తారు.


ఇదో బాహుబ‌లి…


చంద్రునిపై ప్ర‌యోగాల‌కు నాసా వినియోగించనున్న స్పేస్ లాంచ్ సిస్టం (ఎస్ ఎల్ ఎస్‌)లు ఒక అద్భుత సృష్టి అనే చెప్పుకోవాలి. ఒక‌రక‌రంగా వీటిని బాహుబ‌లి రాకెట్ల‌ని పిల‌వొచ్చు. సుమారు 212 అడుగుల ఎత్తు ఉండే ఈ రాకెట్‌లో రెండు భారీ ఇంధ‌న ట్యాంకులు ఉంటాయి. వీటిలో ఏకంగా 7,33,000 గ్యాల‌న్ల ద్ర‌వ ఇంధ‌నాన్ని నింపొచ్చు. ఈ ఇంధ‌నంతో రాకెట్‌కున్న నాలుగు ఆర్‌-25 ఇంజిన్లు తీవ్ర స్థాయిలో శ‌క్తిని ఉత్ప‌త్తి చేస్తాయి. ఫ్లైట్ కంప్యూట‌ర్లు, ఏవియానిక్ సిస్టంలు, ఎల‌క్ట్రిక‌ల్ సిస్టంలు రాకెట్‌కు బ్రెయిన్‌లా ప‌నిచేస్తూ.. ప‌నితీరును నిర్దేశిస్తాయి. కౌంట్‌డౌన్ పూర్త‌యిన త‌ర్వాత‌.. అంటే రాకెట్ లాంచ్ అయ్యాక తొలి 8 నిమిషాల్లోనే 9 ల‌క్ష‌ల కేజీల థ్ర‌స్ట్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది.

Latest News