Global Warming | ఎండల తీవ్రతను తగ్గించవచ్చా? భూమికి గొడుగు వేసేందుకు బ్రిటన్ చేస్తున్న ప్రయోగం ఏంటి?
మండిపోయే ఎండల్లో ఉపశమనం కోసం గొడుగు వేసుకుని బయటకు వెళతాం. కొంతలో కొంత వేడి తీవ్రతను అది తగ్గిస్తుంది. అసలు ఆ సూర్యకాంతి తీవ్రతను తగ్గించేందుకు మొత్తం ధరిత్రికే ఒక పెద్ద గొడుగులా పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తా? అదే తరహా ప్రయత్నాల్లో ఉన్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు.

Global Warming | అట్నుంచి నరుక్కురావడం అంటే ఇదేనేమో! ఇటు భూమిపై వాతావరణాన్ని నియంత్రించలేని స్థితిలో ఆ పనిచేసేలోపు సూర్య కాంతి తీవ్రతనే తగ్గిస్తే పోలా అనే ఆలోచనకు వచ్చింది బ్రిటన్. వేసవి తీవ్రతలు, ప్రతి ఏటా నమోదవుతున్న రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో భూమి అల్లల్లాడిపోతున్నది. ఇది అన్ని రంగాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. వాస్తవానికి పర్యావరణ పరిరక్షణ మీద దృష్టిపెట్టి, ధనిక దేశాల కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించి, శిలాజ ఇంధనానికి బదులుగా ప్రకృతి మెచ్చే పద్ధతుల్లో విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటే చాలా వరకూ పరిస్థితి మెరుగుపడుతుంది.
అదెలా ఉన్నా.. అసలు సూర్యుడి తీవ్రతను తగ్గించేలా గొడుగు కప్పే తరహా బృహత్ ప్రయత్నానికి సిద్ధపడుతున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. దానిలో భాగమే డిమ్ ది సన్ ప్రాజెక్ట్. పేరులోనే దీని అర్థం తెలిసిపోతున్నది. మనం ఇంట్లో దీపాలను డిమ్లో పెట్టుకుంటాం. అంటే కాంతి తీవ్రతను తగ్గిస్తామన్నమాట. సూర్యుడిని డిమ్ చేయడం ద్వారా సూర్యకాంతి తీవ్రతను తగ్గించి, భూమిపై ఉష్ణోగ్రతలను తగ్గించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. గ్లోబల్ వార్మింగ్పై పోరాటానికి బ్రిటిష్ ప్రభుత్వం ఉద్దేశించిన 50 మిలియన్ పౌండ్ల (సుమారు 568 కోట్ల రూపాయలు)లో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. మరికొద్ది వారాల్లోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు అనుమతులు వస్తాయని తెలుస్తున్నది. ఒక్కసారి అనుమతులు లభించగానే శాస్త్రవేత్తలు తమ పని ప్రారంభించనున్నారు.
వాతావరణంలోకి రిఫ్లెక్టివ్ పార్టికల్స్తో కూడిన మేఘాలను పంపడం, లేదా మేఘాలను కాంతివంతంగా మార్చేందుకు సముద్రజలాలు స్ప్రే చేయడం వంటివి వాటికి అవసరమైన సాంతికతను సిద్ధం చేసేందుకు ఉపక్రమించనున్నారు. వేడిని గ్రహించే దుప్పట్ల తరహాలో పనికొచ్చే సహజ కుంతలమేఘాలను పలుచన చేయడం కూడా ఒక పద్ధతి. ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే.. భూమిపై పడే సూర్యకాంతి తీవ్రత గణనీయంగా తగ్గిపోతుంది. ధరిత్రి ఉపరితలం తాత్కాలికంగా చల్లబడుతుంది. భూమిని చల్లబరిచేందుకు ఇదే ఉన్నవాటిలో చవకైన మార్గంగా భావిస్తున్నారు.
అయితే.. ఈ చర్య వాతావరణ నిర్మాణ క్రమాలను దెబ్బతీసే అవకాశం లేకపోలేదని కొందరు విమర్శిస్తున్నారు. ఆహార ఉత్పత్తికి కీలకమైన ప్రాంతాల నుంచి వర్షాలను మళ్లించే అవకాశాలు కూడా లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ధరిత్రిపై ప్రకృతి విరుద్ధం జరిగే తీవ్రస్థాయి కార్యకలాపాలే భూమిని క్రమంగా వేడెక్కేలా చేస్తున్నాయని అంటున్నారు. జియో ఇంజినీరింగ్ ప్రక్రియలతోనే ఈ పరిస్థితిని నివారించవచ్చని చెబుతున్నారు. ముందుగా పర్యావరణ మార్పులకు మూల కారణమైన శిలాజ ఇంధనాలను మండించడమనే ప్రక్రియను నిలిపివేయాలని సూచిస్తున్నారు. అయితే.. భూమిని డీకార్బనైజ్ చేసేందుకు కొంత సమయం తీసుకోవడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని ఏఆర్ఐఏ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రొఫెసర్ మార్క్ సైమెస్ చెబుతున్నారు. డీకార్బనైజేషన్ అనేది కీలకమని అన్నారు.
ఇవి కూడా చదవండి..
Telangana | అకాల వర్షాలు.. ఆరుగాలం శ్రమ నీటి పాలు!
Life on Mars | అంగారకుడిపై ఒకప్పుడు నదీ వ్యవస్థలు, సరస్సులు!.. భూమిలాంటి వాతావరణం?
eggs found in volcano | వేల గుడ్లను పొదుగుతున్న అగ్నిపర్వతం? ఎక్కడ.. ఆ కథేంటి?