US Navy F35 Crashes | కుప్పకూలిన అమెరికా ఎఫ్ 35 యుద్ధ విమానం

అమెరికా కాలిఫోర్నియాలోని లిమూరే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద అధునాతన ఎఫ్-35 సీ యుద్ధవిమాన కుప్పకూలింది. భారీ మంటలు చెలరేగినప్పటికీ పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఇది ఈ ఏడాదిలో రెండో ఎఫ్-35 ప్రమాదం కావడం గమనార్హం. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో ఆందోళనకు దారి తీస్తోంది.

US Navy F35 Crashes | కుప్పకూలిన అమెరికా ఎఫ్ 35 యుద్ధ విమానం

US Navy F35 Crashes | విధాత: అమెరికా యుద్ద విమానం ఎఫ్-35 యుద్ధ విమానం అమెరికా-కాలిఫోర్నియా సమీపంలోని లిమూరే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద కుప్పకూలింది. ఇది సెంట్రల్ కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోకు నైరుతి దిశగా దాదాపు 40 మైళ్ల దూరంలో ఉంది. యూఎస్‌ నేవీ వ్యూహాత్మక వైమానిక కార్యకలాపాలకు ఇది కీలక కేంద్రంగా ఉందని అధికారులు తెలిపారు. ఎఫ్-35 ఫైటర్ జెట్ విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.పైలట్‌కు ఎలాంటి గాయాలూ కాలేదని యూఎస్‌ నేవీ పేర్కొంది. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన జెట్ ఎఫ్‌-35సీ.. యూఎస్‌ విమాన వాహక నౌకలపై కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ విమానం షార్ట్ టేకాఫ్‌లు, నిలువు ల్యాండింగ్‌లను కలిగి ఉంటుంది. ఈ ఏడాది చోటుచేసుకున్న రెండవ ఎఫ్‌-35 ప్రమాదం ఇది. గత జనవరిలో అలాస్కాలోని ఐల్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద శిక్షణా మిషన్ సమయంలో వైమానిక దళ ఎఫ్‌-35ఏ కూలిపోయింది.

ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాల్లో ఒకటి. దీన్ని యూఎస్‌ రక్షణ దిగ్గజం లాక్‌హీడ్‌ మార్టిన్‌ అభివృద్ధి చేసిన ఐదో తరం స్టెల్త్‌ మల్టీరోల్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌. దీని ధర సుమారు 115 మిలియన్‌ డాలర్లుగా ఉంటుంది. ఈ జెట్‌ షార్ట్‌ టేకాఫ్‌తోపాటు వర్టికల్‌ ల్యాండింగ్‌ అవుతుంది. అమెరికా సహా అతికొద్ది దేశాల ఎయిర్‌ఫోర్సుల వద్దే ఈ ఫైటర్‌ జెట్‌ ఉంది. ఎఫ్-35 1.6 మాక్ వేగంతో అంటే గంటకు 1200 మైళ్ల వేగంతో ఎగురుతుంది. 18,000 పౌండ్ల ఆయుధాలను మోయగలదు. ఇది గాలి, భూమి, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, ఇంటెలిజెన్స్ సేకరణ వంటి అనేక మిషన్‌లను నిర్వహించగలదు. ఎఫ్-35 కోసం అమెరికాతో ఒప్పందాలు చేసుకున్న దేశాలలో ప్రపంచంలోని 20 దేశాలు ఉన్నాయి. ఈ ఫైటర్ జెట్లు కూలిన ఘటనలతో ఆ దేశాలు వాటి కొనుగోలు విషయమై అంతర్మధనంలో పడ్డాయి. ఇటీవలే బ్రిటన్‌ దేశానికి చెందిన ఎఫ్‌-35 బీ కేరళలో సాంకేతిక కారణాలతో నిలిచిపోయి..మరమ్మతుల అనంతరం స్వదేశానికి వెళ్లిపోవడం గమనార్హం.