అంగారకుడిపై భూకంపాలకు కారణమేంటి? పరిశోధనలో బయటపడ్డ రహస్యం

అంగారకుని (Mars) పై పరిశోధనలు ఊపందుకుంటున్న విషయం తెలిసిందే. సమీప భవిష్యత్తులోనే అక్కడ మానవ ఆవాసాలు ఏర్పాటు చేయాలని వివిధ దేశాలు ప్రయత్నిస్తుండటంతో.. అక్కడ జరిగే ప్రతి పరిణామంపైనా శాస్త్రవేత్తలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో 2022 మే4న అక్కడి ఉపరితలంపై వచ్చిన కంపనాల (Mars Quakes) కు కారణాలను ఇప్పటికి కనుగొన్నారు. తొలుత వాటిని ఏదో ఉల్క తాకడం వల్ల వచ్చిందని భావించినప్పటికీ అది కారణం కాదని జియోఫిజకల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం (Study) వెల్లడించింది.
మార్స్‌పై అప్పుడొచ్చిన ప్రకంపనలకు కారణం అంగారకుడి భూగర్భంలో ఉన్న క్రస్ట్ లో హఠాత్తుగా వచ్చిన మార్పులే కారణమని తెలుస్తోంది. మార్స్క్వేక్గా పిలిచే ఈ భూకంపానికి ఎస్1222ఎ అనే పేరును పెట్టారు. దీని తీవ్రత 4.7గా నమోదు చేశారు. ఆ సమయంలో ఈ కంపనాలు అంగారకుడి ఉపరితలాన్ని ఆరు గంటల పాటు కుదిపేశాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఈ పరిశోధన కోసం సుమారు 144.8 మిలియన్ స్వ్కేర్ కి.మీ. అంగారకుని ఉపరితలాన్ని పరిశీలించామని, వివిధ దేశాల ల్యాండర్ల నుంచి, ఉపగ్రహాల నుంచి సమాచారాన్ని సేకరించామని డా.బెంజమన్ ఫెర్నాండో వివరించారు. వీటన్నింటినీ పరిశీలించి అధ్యయనం చేయగా… ఉల్క పడితే ఏర్పడాల్సిన భారీ గొయ్యి లాంటి ఆకారం ఎక్కడా కనిపించలేదని పేర్కొన్నారు.
ఈ క్రతువులో కొన్ని వేల మంది పరిశోధకులు పాల్గొనాల్సి వచ్చిందని.. అసలు అంతరిక్ష ప్రయోగాలు చేపట్టని దేశాల శాస్త్రవేత్తలను కూడా తాము బృందంలోకి తీసుకున్నామని ఆయన అన్నారు. ఈ పరిశోధన ఫలితంగా అంగారకుడని భూ గర్భం మనం ఊహించని దాని కంటే ఎంతో ఉత్తేజితంగా ఉందని తెలిసందన్నారు.
అయితే అంగారకుడిలో టెక్టానిక్ ప్లేట్లు లేవనే ఇప్పటికీ నమ్ముతున్నామని, ఆ గ్రహంలో అంతర్గతంగా ఉన్న క్రస్ట్‌లో ఉష్ణోగ్రతలు పెరిగినపుడు, తగ్గినపుడు ఉపరితలంపై వాటి ప్రభావం కనపడుతోందన్నారు. ‘అయితే ఈ ప్రభావం అంతటా ఒకలా లేదు. కొన్ని చోట్ల ఈ ఒత్తిడి విపరీతంగా ఉండగా.. మరికొన్ని చోట్ల స్వల్పంగా ఉంది. దీనిపై పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది’ అని వెల్లడించారు.