Mohammad Mokhber | ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్.. ఆమోద ముద్ర వేసిన అయతొల్లా ఖమేనీ
Mohammad Mokhber | ఇరాన్ (Iran) అధ్యక్షుడు ఇబ్రహీమ్ రైసీ (Ebrahim Raisi) హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్ (Mohammad Mokhber) నియమితులయ్యారు. ఈ నియామకానికి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆమోదముద్ర వేశారు.

Mohammad Mokhber : ఇరాన్ (Iran) అధ్యక్షుడు ఇబ్రహీమ్ రైసీ (Ebrahim Raisi) హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్ (Mohammad Mokhber) నియమితులయ్యారు. ఈ నియామకానికి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆమోదముద్ర వేశారు.
ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఇరాన్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మొఖ్బర్‌ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించినట్లు.. రైసీ సంతాప సందేశంలో అలీ ఖమేనీ పేర్కొన్నారు. రైసీ మరణం నేపథ్యంలో దేశంలో ఐదు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ రాజ్యాంగం ప్రకారం ఇరాన్ అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆ పదవిని చేపడతారు.
అయితే ఆ నియామకానికి దేశ సుప్రీంలీడర్ ఆమోద ముద్ర అవసరం. అనంతరం ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్ స్పీకర్, న్యాయ విభాగాధిపతితో కూడిన ఓ కౌన్సిల్‌ను ఏర్పాటుచేస్తారు. ఆ తర్వాత 50 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహిస్తారు. కాగా, 1955లో ఇరాన్‌లోని డెజ్‌ఫుల్‌లో జన్మించిన మొఖ్బర్.. ప్రస్తుతం దేశ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 1980ల్లో ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో ఐఆర్‌జీసీ మెడికల్ కోర్‌లో ఆయన అధికారిగా ఉన్నారు.
ఖుజెస్థాన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్‌గా పనిచేశారు. టెలికమ్యూనికేషన్స్, బ్యాంకింగ్ రంగాల్లో మొఖ్బర్‌కు అనుభవం ఉంది. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర సమయంలో మాస్కోకు డ్రోన్లు, క్షిపణుల సరఫరా ఒప్పందాన్ని ఖరారు చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అంతేగాక అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యకలాపాల్లో ప్రమేయంపై యూరోపియన్ యూనియన్ నుంచి ఆంక్షలనూ ఎదుర్కొన్నారు.