నాసా మరో ఘనత.. 4.5 బిలియన్ ఏండ్లనాటి చిత్రం విడుదల

- 4.5 బిలియన్ ఏండ్లనాటి ఆస్ట్రాయిడ్ శాంపిల్స్ తొలి చిత్రం విడుదల
- అంతరిక్షం నుంచి గతనెలలో భూమిపైకి తెచ్చిన నాసా
విధాత: అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) మరో ఘనత సాధించింది. అమెరికా హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్ బుధవారం 4.5 బిలియన్ (45,000 లక్షల) సంవత్సరాలనాటి గ్రహశకలం శాంపిల్స్ తొలి చిత్రాన్నివిడుదలచేసింది. పురాతన గ్రహశకలం ధూళిని కలిగి ఉన్న క్యాప్సూల్ అంతరిక్షం నుంచి గత నెలలో భూమికి చేరిన సంగతి తెలిసిందే. బెన్నూ గ్రహశకలం నమూనాపై నాసా శాస్త్రవేత్తలు, పరిశోధనలు చేశారు. ఆ గ్రహశకలంలో అధిక-కార్బన్, నీరు కంటెంట్ ఉన్నట్టు నిర్దారించారు. ఇంకా లోతుగా పరిశోధనలు చేస్తున్నారు.
ఇప్పటివరకు భూమికి అందిన అతిపెద్ద కార్బన్-రిచ్ గ్రహశకలం నమూనా అని, రాబోయే తరాలకు మన సొంత గ్రహం మీద జీవం మూలాలను పరిశోధించడంలో ఇది శాస్త్రవేత్తలకు సహాయపడుతుందని నాసా నిర్వాహకుడు బిల్ నెల్సన్ చెప్పారు. నాసాలో తాము చేసే దాదాపు ప్రతిదీ మనం ఎవరు, మనం ఎక్కడ నుంచి వచ్చాము అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. భూమిని తాకే గ్రహశకలాల గురించి మనకు అవగాహనను ఇవి మెరుగుపరుస్తాయని వెల్లడించారు. అదే సమయంలో అవతల ఉన్న వాటి గురించి మనకు ఒక అవగాహన కూడా వస్తుందని తెలిపారు. నమూనాకు సంబంధించి ఇంక చాలా విషయాలు తెలియాల్సి ఉన్నట్టు ఆయన వివరించారు.