సరికొత్త ఫీచర్స్‌ పరిచయం చేసిన యూట్యూబ్‌.. అవేంటో తెలుసా..?

సరికొత్త ఫీచర్స్‌ పరిచయం చేసిన యూట్యూబ్‌.. అవేంటో తెలుసా..?

విధాత‌: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్‌. మొబైల్‌, టీవీ, వెబ్‌ వెర్షన్‌ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను తీసుకువస్తుంటుంది. తాజాగా వెబ్‌, మొబైల్‌ వెర్షన్‌ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. డిజైన్‌లో స్వల్ప మార్పులు చేయడంతో పాటు కొత్తగా 30కిపైగా ఫీచర్స్‌ను జత చేసింది. దీంతో మోడ్రన్‌ లుక్‌లో యూట్యూబ్‌ కనిపిస్తున్నది. ఇక యూట్యూబ్‌ కొత్తగా స్టేబుల్ వ్యాల్యూమ్ ఫీచర్‌ను పరిచయం చేసింది.


దీంతో కంటెంట్‌తో పాటు సౌండ్‌లో ఎలాంటి మార్పులుండవు. ఏదైనా కంటెంట్‌ ఒకే స్థాయిలో సౌండ్‌ అవుట్‌పుట్‌ ఉంటుంది. దాంతో కంటెంట్‌ మారగనే సౌండ్‌ పెరగడమో.. లేదంటే తగ్గడమో ఉండదు. దాంతో పాటు యూజర్‌కు సంబంధించి లైబ్రరీ ట్యాబ్‌ను, అకౌంట్ పేజీని కలిపి ఒకే ట్యాబ్‌గా యూట్యాబ్‌ పేరిట మార్చింది. ఇందులో యూజర్‌ ప్లే లిస్ట్‌, డౌన్‌లోడ్స్‌, చూసిన వీడియోలు, కొనుగోళ్లు, చానల్‌ డీటెయిల్స్‌, ఇతర అకౌంట్స్‌ వివరాలు కనిపిస్తాయి.


యూట్యూబ్‌లో ఎవరైనా ఏదైనా పాటను పాడడం ద్వారా సెర్చ్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని వినొచ్చు. అలాగే పాట గుర్తులేకపోతే ట్యూన్‌ను హమ్‌ చేసినా సెర్చ్‌ చేసుకునే వీలు కల్పించింది. కృత్రిమ మేథ సహాయంతో ఆ పాటను యూట్యూబ్ గుర్తిస్తుంది. ఈ ఫీచర్ త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రాబోతున్నది. యూట్యూబ్ కొత్తగా లాక్ స్క్రీన్‌ను సైతం పరిచయం చేసింది. త్వరలోనే మరికొన్ని ఫీచర్లను సైతం అందుబాటులోకి తీసుకురానున్నట్లు యూట్యూబ్‌ వివరించింది.