మానవాభివృద్ధిలో మన దేశ స్థానం ఎంతంటే?
విధాత: కరోనా వైరస్ సృష్టించిన విలయంతో ప్రపంచమంతా వణికిపోయింది. ఆ మహమ్మారి కలిగించిన నష్టం నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయినప్పటికీ పలు దేశాల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకట్టవేసేందుకు లాక్ డౌన్ వంటి ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. ఒకవైపు ఆంక్షలు, మరోవైపు ఆరోగ్యంపై నెలకొన్న భయానక పరిస్థితులు ప్రజా జీవనంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇలా గత రెండేళ్లుగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో ప్రపంచ మానవాభివృద్ధి ఐదేళ్లు వెనక్కి వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి అభివృధ్ధి […]

విధాత: కరోనా వైరస్ సృష్టించిన విలయంతో ప్రపంచమంతా వణికిపోయింది. ఆ మహమ్మారి కలిగించిన నష్టం నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయినప్పటికీ పలు దేశాల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకట్టవేసేందుకు లాక్ డౌన్ వంటి ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఒకవైపు ఆంక్షలు, మరోవైపు ఆరోగ్యంపై నెలకొన్న భయానక పరిస్థితులు ప్రజా జీవనంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇలా గత రెండేళ్లుగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో ప్రపంచ మానవాభివృద్ధి ఐదేళ్లు వెనక్కి వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి అభివృధ్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) వెల్లడించింది. అనిశ్చిత సమయాలు- అస్థిరమైన జీవితాలు అనే పేరుతో తొలి నివేదిక విడుదల చేసింది.
కరోనా మహమ్మారి విజృంభజన కారణంగా మానవాభివృద్ధి సూచిక వరుసగా రెండేళ్లు (2020, 2021 ఏడాది) క్షీణించిపోయిందని యూఎన్‌డీపీ నివేదిక పేర్కొన్నది. ముఖ్యంగా ఆయా దేశాల్లో ఆయుర్దాయం 2019లో 73 ఏళ్లుగా ఉండగా, అది 2021 నాటికి 71.4 కు పడిపోయిందని తెలిపింది.

యూఎన్‌డీపీ ఏర్పడిన గత 30 ఏళ్లలో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడటం ఇదే మొదటిసారి అని ఆ సంస్థ అభిప్రాయపడింది. ఆరోగ్యం, విద్య, సగటు ఆదాయం అనే మూడు అంశాలను ప్రామాణికంగా తీసుకుని గణించిన మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ) 2021లో భారత ర్యాంక్ 132గా వెల్లడించింది. మొత్తం 191 దేశాలతో ఈ జాబితా రూపొందించింది.
2020 మానవాభివృద్ధి సూచీలో 131 ర్యాంక్ పొందిన మన దేశం మరోస్థానం దిగువకు వెళ్లింది. ఆ ఏడాది హెచ్‌డీఐ జాబితాలో మొత్తం 189 దేశాలున్నాయి. 2021లో మన దేశ హెచ్‌డీఐ విలువ 0.633 కాగా అంతకు ఏడాది క్రితం (2020లో) ఇది 0.642గా ఉండటం గమనార్హం. సగటు ఆయుర్దాయం 69.7 సంవత్సరాల నుంచి 67.2 ఏళ్లకు పడిపోవడమే దీనికి కారణమని యూఎన్‌డీపీ నివేదిక పేర్కొన్నది.