ప్చ్.. వేలంలో అమ్ముడుపోని టిప్పు ఖడ్గం

భారతదేశంలో.. ముఖ్యంగా కర్ణాటకలో టిప్పు సుల్తాన్ (Tippu Sulthan) ఒక మరిచిపోలేని అధ్యాయం. కొందరు అతడిని బ్రిటిష్ను ఎదిరించిన దేశభక్తుడిగా కీర్తిస్తే.. మరికొందరు ఇస్లాం మతతత్వవాదిగా చూస్తారు. అతడు వాడిన కత్తులు, ఇతర ఆయుధాలు కూడా గతంలో వేలం వేసినపుడు మంచి ధరకే అమ్ముడుపోయేవి. అయితే తాజాగా టిప్పు స్వయంగా ఉపయోగించిన ఖడ్గానికి (Sword) వేలం నిర్వహించగా ఆ స్థాయిలో ఆదరణ లభించకపోవడం గమనార్హం.
నాలుగో ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పును వధించిన తర్వాత అతడి కత్తిని అప్పటి గవర్నర్ జనరల్ కారన్వాలీస్ స్వాధీనం చేసుకున్నాడు. ఇప్పుడు కూడా అది అతడి వారసుల వద్దే ఉంది. ప్రస్తుతం వారికి నిధులు అవసరం కావడంతో దీనిని వేలం వేయడానికి నిర్ణయించుకున్నారు. ఆర్ట్ ఆఫ్ ఇస్లామిక్ అండ్ ఇండియన్ స్వార్డ్స్ పేరుతో గురువారం జరిగిన ఈ వేలంలో దీనిని ప్రదర్శనకు ఉంచారు. ప్రారంభ ధరను రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల మధ్య నిర్ణయించారు.
గతంలో ఇలాగే టిప్పుకు చెందని బెడ్ ఛాంబర్ కత్తిని వేలం వేయగా రూ.133 కోట్లు రావడంతో.. ఇదీ అదే ధర పలుకుతుందని కారన్వాలీస్ కుటుంబం ఆలోచించింది. అయితే ఎవరూ ఆ కత్తిపై ఆసక్తి చూపలేదు. కనీస ధర కూడా పలకకపోవడంతో దాని వేలంపాటను నిలిపివేశారు. కారన్వాలిస్ కుటుంబమే పెట్టిన మరో కత్తి, వజ్రాల సెట్ మాత్రం రూ.కోటికి అమ్ముడుపోయింది. టిప్పుకే చెందిన మరో రెండు విలువైన వస్తువుల పట్ల కూడా వేలంలో ఎవరూ ఆసక్తి కనబరచలేదని నిర్వాహకులు తెలిపారు.