గ్రేట్ స్ఫినిక్స్ ఆఫ్ గిజా మిస్ట‌రీని ఛేదించిన అధికారులు

గ్రేట్ స్ఫినిక్స్ ఆఫ్ గిజా మిస్ట‌రీని ఛేదించిన అధికారులు

ఈజిప్ట్ అన‌గానే అంద‌రికీ పిర‌మిడ్‌లే గుర్తొస్తాయి. పిర‌మిడ్‌లే కాకుండా అక్క‌డే ఉన్న గ్రేట్ స్ఫినిక్స్ ఆఫ్ గిజా ప్ర‌పంచ‌వింత‌గా పేరు తెచ్చుకుంది. మ‌నిషి మొహం, సింహం శ‌రీరంతో ఉండే ఈ అద్భుత నిర్మాణాన్ని ఎందుకు నిర్మించారు? ఎలా నిర్మించారు అనే ప్ర‌శ్న‌లు కొన్నేళ్లుగా శాస్త్రవేత్త‌ల‌ను తొలుస్తూనే ఉన్నాయి. లైమ్‌స్టోన్‌తో నిర్మించిన ఈ క‌ళాఖండం మిస్ట‌రీ గురించి ప‌రిశోధ‌కులు అనేక వాద‌న‌ల‌తో ముందుకు వ‌చ్చారు.


అందులో ప్ర‌ధాన‌మైన‌ది.. 1981లో జియాల‌జిస్ట్ ఫ‌రూక్ ఎల్ బాజ్ ఇచ్చిన వివ‌ర‌ణ అంద‌రినీ ఆకర్షించింది. ఆయ‌న చెప్పినదాని ప్ర‌కారం.. పిరమిడ్‌లను కావాల‌ని నిర్మించిన‌ట్లు గ్రేట్ స్ఫినిక్స్‌ను ఈజిప్షియ‌న్‌లు నిర్మించ‌లేదు. అంటే దీనిని నిర్మించాల‌న్న ఉద్దేశం వారికి లేదు. దీనిని రూపొందించ‌డంలో వాతావ‌ర‌ణ‌మే ప్ర‌ధాన పోషించింద‌ని ఫ‌రూక్ ప్ర‌తిపాదించారు. ఇప్పుడు సాంకేతిక‌త పెరిగిన నేప‌థ్యంలో ఆ ప్ర‌తిపాద‌న‌పై ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయి. ఈ ప‌రిశోధ‌న‌ల్లో ఫ‌రూక్ చెప్పిన దాంట్లో చాలా మ‌టుకు నిజ‌మే ఉంద‌ని తేలింది.


ఇందులో భాగంగా న్యూయార్క్ యూనివ‌ర్సిటీ శాస్త్రవేత్త‌లు ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌, కంప్యూట‌ర్ సిమ్యులేష‌న్‌ల‌ను ఉప‌యోగించారు. వీటిలో ఒక భారీ రాయి ఏడారి ఇసుక ద్వారా ఏర్ప‌డిన‌ట్లు చేసి.. దానిపై గాలి విసురుగా వ‌చ్చేలా ప‌రిస్థితులు సృష్టించారు. అందులో పలు కోణాల‌ను ప‌రిశీలించ‌గా స్ఫినిక్స్ ఆకారం వ‌చ్చింది. అంటే గాలికి రేగిన ఎడారి ఇసుక ఒక దిబ్బ ఆకారంలోకి రాగా.. దానికి అబ్బుర‌ప‌డిన ఈజిప్షియ‌న్లు ఈ మ‌నిషి మొహాన్ని.. సింహం శ‌రీరాన్ని చెక్కి ఉంటారని ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు. ఈ మొత్తం నిర్మాణంలో 80 శాతం ప్ర‌కృతి స‌హ‌జ‌మైన‌దేన‌ని.. 20 శాతం ఈజిప్షియ‌న్ల కృషి అని తేల్చి చెప్పారు.