USA | ట్రంప్ హత్యకు డబ్బులివ్వలేదని.. తల్లిదండ్రులనే చంపేశాడు!

USA | ట్రంప్ హత్యకు డబ్బులివ్వలేదని.. తల్లిదండ్రులనే చంపేశాడు!

విధాత: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను హత్య చేసేందుకు డబ్బులివ్వలేదని సొంత తల్లిదండ్రులనే ఓ యువకుడు హత్య చేసిన విషయం దర్యాప్తు అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. తల్లిదండ్రుల హత్య కేసులో ఆ యువకుడిని విచారిస్తున్న క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ హత్యకు అతడు కుట్ర పన్నిన విషయం వెలుగు చూడటం ఈ కేసులో కీలక ట్విస్టు.

వివరాల్లోకి వెళితే విస్కాన్సిన్‌లోని మిల్వాకీ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల నికిటా క్యాసప్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 11న తన తల్లి టటియానా, సవతి తండ్రి డొనాల్డ్‌ మేయర్‌ను తమ నివాసంలోనే అతి దారుణంగా తుపాకీతో కాల్చి చంపాడు. కొన్ని వారాల పాటు వారి మృతదేహాల పక్కనే నివసించాడు. ఆ తర్వాత 14వేల డాలర్ల నగదు, పాస్‌పోర్ట్‌ ఇతర వస్తువులు తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

అతడి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకోగా జంట హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా గత నెల కాన్సస్‌లో నిందితుడు నికిటా క్యాసప్ ను పోలీసులు అరెస్టు చేశారు. తను అధ్యక్షుడు ట్రంప్‌ను చంపేందుకు పన్నిన కుట్ర తల్లిదండ్రులకు తెలిసిందని..అంతేగాక కుట్ర అమలుకు కావాల్సిన డబ్బులు ఇవ్వలేదని నిందితుడు వారిని హత్య చేసినట్లు విచారణలో తేలింది.

తల్లిదండ్రులను చంపేసిన తర్వాత ఇంటి నుంచి తీసుకున్న డబ్బుతో నిందితుడు ఓ డ్రోన్‌, ఇతర పేలుడు పదార్థాలను కొనుగోలు చేశాడని.. ఓ రష్యా వ్యక్తితో కలిసి ట్రంప్ హత్యకు నిందితుడు కుట్ర పన్నినట్లుగా గుర్తించారు. టిక్‌టాక్‌, టెలిగ్రామ్‌ వంటి సోషల్‌మీడియా యాప్‌లలో నిందితుడు సంభాషణలు జరిపి ట్రంప్ హత్యకు డీల్ కుదుర్చుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ట్రంప్‌ను చంపాక ఉక్రెయిన్‌ పారిపోవాలని అతడు ప్రణాళిక వేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు