అమ్మ‌కానికి అంద‌మైన గ్రామం.. రేటు కేవ‌లం రూ.6.6 కోట్లు

అమ్మ‌కానికి అంద‌మైన గ్రామం.. రేటు కేవ‌లం రూ.6.6 కోట్లు

విధాత‌: కాంక్రీట్‌కు జంగ‌ల్‌కు దూరంగా.. ప్ర‌కృతికి ద‌గ్గ‌ర‌గా, కలప ట్రీహౌస్‌లు, రాతి మార్గాలు, జానపద దుస్తులు, సంప్రదాయ‌ శైలి నిర్మాణాలు.. ఇలా అనేక చిత్ర‌, విచిత్ర‌మైన అంశాల‌తో కూడిన ఆ చిన్న గ్రామాన్ని విక్ర‌యానికి పెట్టారు. దాని రేటు భార‌త క‌రెన్సీలో రూ.6.6 కోట్లుగా అంత‌ర్జాతీయ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ సోథెబైస్ నిర్ణ‌యించింది. గ్రామానికి సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. వాటి వివ‌రాల‌ను వెల్లడించింది. ఆస‌క్తి ఉన్న వారు గ్రామాన్ని కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని పేర్కొన్న‌ది.


ఆ గ్రామం రొమేనియాలోని మరామురెస్ కౌంటీలో ఉన్న‌ది. దాని పేరు ఫెరెస్టీ. 0.94 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రామాన్ని 2014లో నిర్మించారు. క్రీస్తుపూర్వం 625 నాటి స్థానిక సంప్రదాయాలు, శైలుల ఆధారంగా ఇక్క‌డ ఇండ్ల‌ను పునర్నిర్మించారు. స్టర్జన్‌లు, కార్ప్స్, ట్రౌట్‌లతో కూడిన చెరువు, స్టోర్‌రూమ్‌తోపాటు చెక్క కలప మంటపం కూడా ఉన్న‌ది. స్టోర్‌రూమ్ పూర్తిగా రాతితో నిర్మించారు. రూఫ్ గార్డెన్ కూడా ఉన్న‌ది. ఇది మూలికలను పెంచడానికి, వన్యప్రాణులను ఆకర్షించడానికి, కలపను నిల్వ చేయడానికి అనుకూలంగా ఉన్న‌ది.


రోమేనియన్ సంప్రదాయాలు ఇప్పటికీ సజీవంగా ఉన్న ప్రదేశం ఇది. జానపద దుస్తుల‌ను ఇక్క‌డి ప్ర‌జ‌లు సగర్వంగా ధరిస్తారు. ఇక్కడ‌ ఒకే రకమైన ఐదు ఇండ్లు మాత్రమే కాకుండా, ఒక ఆవిరి స్నానం గ‌ది, హాట్ టబ్, బీబీక్యూ ప్రాంతం, ఒక్క ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి ఆకాశ మార్గాన వెళ్లే జిప్‌ లైన్ కూడా ఉన్న‌ది.


14 బెడ్‌రూమ్‌లు, ఆరు బాత్‌రూమ్‌లు 22 పడకలతో భవనాలు విస్తరించి ఉన్నాయి. రంగురంగుల సంప్ర‌దాయ వ‌స్త్రాల‌తో వాటిని అలంక‌రించారు. ఈ గ్రామం చుట్టూ పొలాలు, చెరువులు ఉన్నాయి. సహజ సౌందర్యాన్ని ఇష్టపడేవారికి ఈ ప్రాంతం క‌చ్చితంగా న‌చ్చుతుంది. ప్రకృతి ఒడిలో విశ్రాంతి కోసం లేదా రోజువారీ టెన్ష‌న్‌ జీవితం నుంచి ఉప‌శ‌మ‌నం పొందాల‌నుకొనే వారికి ఈ గ్రామం ఒక ఆక్ష‌ణీయ ప్ర‌దేశం.