Telangana Armed Struggle । తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ-ముస్లిం గొడవలుగా చిత్రీకరించేందుకు బీజేపీ కుట్ర: సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి
మహాత్తరమైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ- ముస్లిం గొడవలుగా చిత్రీకరించేందుకు ఫాసిస్టు బీజేపీ కుట్ర చేస్తున్నదని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. సాయుధ పోరాటానికి మతం రంగు పులిమే బీజేపీ కుటిల ప్రయత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

Telangana Armed Struggle । నిజాం నిరంకుశుత్వానికి (Nizam’s tyranny) వ్యతిరేకంగా మట్టి మనుషులే ఉక్కు మనుషులై తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని (Telangana Armed Struggle) నిర్వహించారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి అన్నారు. అంతటి మహాత్తరమైన పోరాటాన్ని హిందూ- ముస్లిం గొడవలుగా (Hindu-Muslim conflict) చిత్రీకరించేందుకు ఫాసిస్టు బీజేపీ కుట్ర చేస్తుందని విమర్శించారు. సాయుధ పోరాటానికి మతం రంగు పులిమే బీజేపీ కుటిల ప్రయత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై సీపీఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల (Telangana peasant armed fighters) చిత్రాలతో కూడిన ఫొటో ఎగ్జిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. నిజాం, భూస్వామ్య, పెత్తందారులు, దొరల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా1931లో కమ్యూనిస్టు పార్టీ పోరాటాన్ని ప్రారంభించిందని, మట్టి మనుషులే ఉక్కు మనుషుల వలే పోరాటం చేశారని గుర్తు చేశారు. రావి నారాయణ రెడ్డి(Ravi Narayana Reddy), బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొహినుద్దీన్(Makhdoom Mohinuddin), దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ (Chakali Ailamma) సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని తెలిపారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించిన రావి నారాయణ రెడ్డి సాయుధ పోరాటంలో ప్రజలను భాగస్వామ్యులను చేయడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ప్రజారాజ్యం కోసం పోరాటం జరిగిందన్నారు. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న క్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) నాటి నిజాంతో లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ మహాత్తరమైన సాయుధ పోరాటాన్ని ఎందుకు ఇప్పటి వరకు గుర్తించలేదని చాడ వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. కర్ణాటక, మహారాష్ట్రలలో విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తారని, తెలంగాణలో మాత్రం ఎందుకు నిర్వహించబోరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చాడ కోరారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ‘తెలంగాణ సాయుధ పోరాట యోధుల స్మృతి వనం’ ఏర్పాటు చేయాలన్నారు.
చరిత్రను వాస్తవాలతో తిరిగి రాస్తాం : కే శ్రీనివాస్ రెడ్డి
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంపైన రాసిన పుస్తకాలు చూస్తే సిగ్గుపడాల్సి వస్తుందని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ (Telangana State Media Academy) చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పదేళ్ల కాలంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కనుమరుగు చేసేందుకు కుట్ర (conspiracy ) చేశారని విమర్శించారు. పాఠ్యపుస్తకాలలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర ఎక్కడా కనిపించదని అన్నారు. రావి నారాయణ రెడ్డి పేరు లేదని ప్రశ్నిస్తే, అప్పుడు ఆయన పేరును పొందపర్చారన్నారు. చరిత్రను వక్రీకరించి రాసిన వారికి కనువిప్పు కలిగేలా వాస్తవాలను తెలియచేస్తూ, చరిత్రను తిరిగి రాయాలని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని తామే ప్రారంభిస్తామని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని, ఇచ్చిన హామీలు అమలు కాలేదని తెలిపారు.
పోరాట ఫలితంగా 10 లక్షల ఎకరాల భూ పంపిణీ: జస్టిస్ చంద్ర కుమార్
నిజాం జమీదార్లు, జాగీర్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 4 లక్షల మంది యోధులు అమరులయ్యారని జస్టిస్ చంద్ర కుమార్ (Justice Chandra Kumar) తెలిపారు. పోరాటం ఫలితంగా దొరలు గడీలను ఖాళీ చేసి, పారిపోయారన్నారు. సాయుధ పోరాట ఫలితంగా పేదలకు 10 లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగిందని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లింల మధ్య గొడవలుగా చిత్రీకరించేందుకు కుట్ర జరుగుతున్నదని జస్టిస్ చంద్రకుమార్ విమర్శించారు. ఈ పోరాటంలో మఖ్దూం మొహినుద్దీన్, షేక్ బదంగీ, షోయాబుల్లాఖాన్ వంటివారు పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నిజాం సైన్యానికి రజాకార్లకు ఖాసీం రజ్వీ (Qasim Razvi) నాయకత్వం వహిస్తే, నిజాం ఖజానా విసునూరు రాంచంద్రారెడ్డి అధీనంలో ఉండేందని అన్నారు. సరైన చరిత్ర కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, నిజమైన చరిత్రను తీసుకురావాలని సూచించారు. అమరుల జ్ఞాపకార్థం స్మృతివనం (memorial) ఏర్పాటు చేయాలని జస్టిస్ చంద్ర కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీఎస్ బోస్, ఈటీ నరసింహ, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, సామాజిక వేత్తలు వినాయక్ రెడ్డి, మోటూరి కృష్ణ ప్రసాద్, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్ ఛాయాదేవి, సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బీ స్టాలిన్, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అనిల్ కుమార్, ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ తదితరులు పాల్గొన్నారు.