Betting App Promotions| బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో టాలీవుడ్ యాక్టర్స్ పై ఈడీ కేసు!

Betting App Promotions| బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో టాలీవుడ్ యాక్టర్స్ పై ఈడీ కేసు!

విధాత : చట్టవిరుద్దమైన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన 29మంది టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద వారిని ఈడీ విచారణ చేయనుంది. బీఎన్‌ఎస్‌లోని 318(4), 112, రెడ్‌విత్‌ 49, తెలంగాణ గేమింగ్‌ యాక్ట్‌లోని 3, 3(ఎ), 4 సెక్షన్లు, ఐటీ చట్టం 2000, 2008లోని 66డి సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేశారు. సైబరాబాద్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది.సినీ నటులు విజయ్‌ దేవరకొండ, రానా, ప్రకాశ్‌రాజ్‌,మంచు లక్ష్మి, నిధి అగర్వాల్‌, అనన్య నాగళ్ల, ప్రణీత, శ్యామల, శ్రీముఖి, ఇన్‌ఫ్లుయెన్సర్లు వర్షిణి సౌందరరాజన్, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృతాచౌదరి, నయనిపావని, నేహాపఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్‌ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, భయ్యా సన్నీయాదవ్, టేస్టీ తేజ, రీతూచౌదరి, బండారు సుప్రీత, లోకల్ బాయ్ నానీ తదితరుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

వీరంతా చట్టవ్యతిరేకమైన..నిషేధిత యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవాలంటూ ప్రచారం చేసి..భారీగా కమీషన్, పారితోషికం తీసుకున్నారని బాధితులు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. వారి ప్రచారాన్ని నమ్మి యాప్ లలో పెట్టుబడులు పెట్టి అప్పుల పాలై 1000మందికి పైగా ఆత్మహత్యలు చేసుకోగా..మరెందరో ఆర్థిక ఇబ్బందుల పాలయ్యారని పోలీసులు కేసు నమోదు చేశారు.

వీళ్లా సెలబ్రిటీలు : సజ్జనార్ ఫైర్

తమ స్వలాభం కోసం బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ యువత బంగారు భవిష్యత్ ను చిద్రం చేస్తున్న వీళ్లా సెలబ్రిటీలు!? అంటూ ఐపీఎస్, టీజీ ఆర్టీసీ ఎండీ వీసీ.సజ్జనార్ ఫైర్ అయ్యారు. సమాజ శ్రేయస్సుకు నాలుగు మంచి పనులు చేసి యువతకు ఆదర్శంగా ఉండాల్సిన మీరు.. బెట్టింగ్ యాప్ లకు బానిసలను చేసి ఎంతో మంది యువకుల మరణాలకు కారణం అయ్యారని విమర్శించారు. మీరు బెట్టింగ్ కు ప్రోత్సహించడం వల్లే యువత బంధాలు, బంధుత్వాలను మరిచి కన్న తల్లితండ్రులను చంపేస్తున్నారు. దొంగతనాలు చేస్తూ నేరాల బాట పడుతున్నారు. బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన మీరు ఈ సమస్యలకు ప్రధాన కారకులు కాదా!? ఆలోచించండని హితవు పలికారు. కాసులకు కక్కుర్తి పడి.. సామాజిక బాధ్యత ఏమాత్రం లేకుండా సమాజం ఎటుపోయిన పర్లేదనే మీ ధోరణి సరైంది కాదని మండిపడ్డారు.