CM Revanth Reddy: మాతృభూమి అభివృద్ధిలో భాగస్వాములవ్వండి : సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేయాలనుకుంటున్న తన ప్రయత్నాలకు మద్దతుగా జపాన్ లోని తెలుగువారంతా మాతృభూమి తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మీ అందరి సహకారం అవసరమని..ఎవరికి చేతనైనంత వారు చేయగలిగింది చేస్తే.. ప్రపంచంతోనే మనం పోటీ పడొచ్చన్నారు. మీ ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోండని..సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం ఏమిటో మీకు తెలుసన్నారు

CM Revanth Reddy: మాతృభూమి అభివృద్ధిలో భాగస్వాములవ్వండి : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేయాలనుకుంటున్న తన ప్రయత్నాలకు మద్దతుగా జపాన్ లోని తెలుగువారంతా మాతృభూమి తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జపాన్ తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణలో పెట్టుబడులు పెరగాలి, పరిశ్రమలు పెరగాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలనేదే మా ప్రజా ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో మీ అందరి సహకారం అవసరమని..ఎవరికి చేతనైనంత వారు చేయగలిగింది చేస్తే.. ప్రపంచంతోనే మనం పోటీ పడొచ్చన్నారు. మీ ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోండని..సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం ఏమిటో మీకు తెలుసన్నారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని గుర్తు చేశారు. తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నామని, ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ పరిశీలించామని, నీరు మన సంస్కృతికి, అభివృద్ధికి ప్రతీక అన్నారు.

మూసీ ప్రక్షాళన కీలకం
ప్రధాని మోదీ.. సబర్మతి, గంగా, యుమునా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు చేపట్టారని.. కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ మూసీ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. చెరువులు, నాలాలు, నదుల మధ్యలో నిర్మాణాలు చేస్తే కూలగొట్టకుండా ఉంటే ప్రకృతి క్షమిస్తుందా..? ఆ పని హైడ్రా చేస్తుంటే విమర్శిస్తున్నారన్నారు. ఢిల్లీలో కాలుష్యంతో అన్ని సంస్థలకు సెలవులు ఇస్తున్న పరిస్థితి నెలకొందని, కేవలం కాలుష్యంతో ఢిల్లీ నగరం స్థంభించే పరిస్థితి ఉంటే.. మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. అందుకే హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన చేయాలని నేను చెబుతున్నానన్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలు అని ఇందుకోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని..ఇందుకు మీ వంతు సహకారం అందించాలని రేవంత్ రెడ్డి కోరారు. సాగునీటీ ప్రాజెక్టులు, సాంకేతిక విస్తరణకే కాదు…పరిశ్రమలు, ఉద్యోగుల కల్పన కూడా ప్రధానమని..అందుకే తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తు చేశారు.

టోక్యో వాటర్‌ ఫ్రంట్‌ను సందర్శించిన సీఎం బృందం
జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రైజింగ్ తెలంగాణ ప్రతినిధి బృందం టోక్యో వాటర్‌ ఫ్రంట్‌ను సందర్శించింది. టోక్యో మహానగరం మధ్య నుంచి పారే సుమిదా నది రివర్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేసిన తర్వాత పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. టోక్యో నగరం మధ్యన జల రవాణాకు అనుగుణంగా రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసిన తీరు., సుమిదా నది పక్క నుంచి పొడవాటి ఫ్లైఓవర్‌, అవసరమైన చోట ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు టోక్యో నగర రూపురేఖలను ఎలా మార్చిందీ ఈ ప్రతినిధి బృందం పరిశీలించింది. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం టోక్యో రివర్ ఫ్రంట్‌ను క్షణ్ణంగా పరిశీలించడం గమనార్హం.