తమిళనాడు పోలీస్ అధికారుల అమానవీయంపై నెటిజన్ల ఫైర్

ఓ మైనర్ బాలిక హత్యాచారం కేసు వివరాలను మీడియాకు వివరించే సమావేశంలో తమిళనాడు పోలీస్ అధికారుల వ్యవహరించిన అమానవీయంపై నెటిజన్లు, ప్రజలు ఫైర్ అవుతున్నారు. పోలీసుల తీరుపై సీఎం విజయ్ సైతం సీరియస్ కావడం గమనార్హం.

తమిళనాడు పోలీస్ అధికారుల అమానవీయంపై నెటిజన్ల ఫైర్

విధాత : ఓ మైనర్ బాలిక హత్యాచారం కేసు వివరాలను మీడియాకు వివరించే సమావేశంలో తమిళనాడు పోలీస్ అధికారుల వ్యవహరించిన అమానవీయంపై నెటిజన్లు, ప్రజలు ఫైర్ అవుతున్నారు. ప్రెస్ మీట్ లో పోలీసుల అధికార నవ్వులాట వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా..పోలీసు అధికారుల తీరుపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది.

కోయంబత్తూరు వెస్ట్ జోన్ ఐజీ రమ్య భారతి సహా డీఐజీ, ఎస్పీ ముగ్గురు అధికారులు పదేళ్ల బాలిక హత్యాచారం కేసు ప్రెస్ మీట్‌లో నవ్వులాటలు సాగిస్తూ..మీడియా ముందే పగలబడి నవ్వారు. సున్నితమైన ఈ కేసులో ఏమాత్రం సీరియస్‌నెస్ లేని అధికారులు వైఖరిపై జనాగ్రహం పెల్లుబికుతుంది. అధికారుల తీరును నెటిజన్లు ఏకిపారెస్తున్నారు. నటీనటులే నాయకులుగా ఎన్నికయ్యే ఒక రాష్ట్రం నుండి ఇంకేం ఆశించగలం? అంటూ మరికొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. పోలీసుల అమానవీయ చర్య విషయం సీఎం విజయ్ వరకు వెళ్లడంతో…సంబంధిత అధికారుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన ఐపీఎస్ అధికారులపై సీఎం విజయ్ సీరియస్ యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాల కథనం.

అసలు ఏం జరిగిందీ..?

కోయంబత్తూర్‌ లోని దుకాణానికి వెళ్లి అదృశ్యమైన 10 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైన ఘటన తమిళనాట కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే కార్తీక్‌, మోహన్ రాజ్‌ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నారి హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 రోజుల్లోనే రాష్ట్రంలో నేరాల గ్రాఫ్ పెరిగిందని డీఎంకే విమర్శలు గుప్పించింది. ఈ ఘటన రాష్ట్రంలోని శాంతిభద్రతలపై తీవ్ర సందేహాలను రేకెత్తిస్తోందని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అన్నారు. బాలిక హత్యకు బాధ్యులైనవారిని వీలైనంత త్వరగా న్యాయస్థానం ముందు నిలబెట్టి.. కఠిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు.