విధాత, హైదరాబాద్ : తెలంగాణ అభివృద్దికి కేంద్రం వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. హెచ్ఐసీసీ(HICC) ప్రాంగణంలో రూ.9,377 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు మాట్లాడనని చెప్పారని, నేను కూడా మాట్లాడనని మోదీ స్పష్టం చేశారు. అయితే రేవంత్ రెడ్డి నా మాటలు జాగ్రత్తగా వినాలని.. యూపీఏలో పదేళ్లుగా గుజరాత్ కు ఇచ్చినట్లుగా కేంద్ర నిధులు తెలంగాణకు ఇచ్చేందుకు మేం సిద్దం అని.. అలా చేస్తే మీకు ఇప్పుడిస్తున్న వాటిలో సగం కూడా నిధులు రావాలని మోదీ గుర్తు చేశారు. ఆ నిధులు మీకు సరిపోతాయా అంటూ నవ్వుతూ ప్రశ్నించారు. అందుకే మీరు మాతో కలవండి అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. మేం తెలంగాణకు ఎక్కువ నిధులు ఇవ్వాలనుకుంటున్నామంటూ పరోక్షంగా మోదీ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్దికి కేంద్రం అనేక ప్రాజెక్టులు చేపట్టిందని మోదీ వివరించారు.
కేంద్రంలో, రాష్ట్రంలో వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో సహజమని, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకోవడంలో తప్పులేదని మోదీ అన్నారు . అందుకే మేము అన్ని రాష్ట్రాలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్నాం అని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచం ఇప్పుడు యుద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, ఆ ప్రభావం దేశంపై పడకుండా చూసుకుంటున్నాం అన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ అభివృద్ధికి కేంద్రం వేలకోట్లు కేటాయించింది అని మోదీ తెలిపారు. సైబరాబాద్ కు అంతర్జాతీయ స్థాయిలో పేరు ఉందని, దేశ అభివృద్ధిలో సైబరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
తెలంగాణ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని మోదీ పేర్కొన్నారు. తెలంగాణకు ఆరు అమృత భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు, 5 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఇచ్చాం అన్నారు. ఉమ్మడి ఏపీలో 1000 కోట్లు మాత్రమే రైల్వేకి ఇచ్చారు అని, మేం ఒక్క తెలంగాణకే రూ. 5500 కోట్లు ఇచ్చాం అని మోదీ వెల్లడించారు. 2014కు ముందు ఏపీకి 1000 కోట్ల కంటే తక్కువ రైల్వే బడ్జెట్ ఉండేదని, ఇప్పుడు లంగాణకే రూ.5500 కోట్ల బడ్జెట్ ఖర్చు జరుగుతుందని మోదీ వెల్లడించారు.
