స‌భ్య స‌మాజం సిగ్గు ప‌డే ఘ‌ట‌న‌.. 12 ఏండ్ల బాలిక‌పై లైంగిక‌దాడి

స‌భ్య స‌మాజం సిగ్గు ప‌డే ఘ‌ట‌న‌.. 12 ఏండ్ల బాలిక‌పై లైంగిక‌దాడి
  • 12 ఏండ్ల బాలిక‌పై లైంగిక‌దాడి
  • ర‌క్త‌స్రావంతో అర్ధ‌న‌గ్నంగా ఇంటింటికీ
  • వెళ్లి స‌హాయం కోరిన బాధితురాలు
  • చూసి కూడా సాయం చేయ‌ని ప్ర‌జ‌లు
  • బాధితురాలిని త‌రిమికొట్టిన ఓ వ్య‌క్తి
  • మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దారుణం
  • వీధి సీసీటీవీ కెమెరాలో ఘ‌ట‌న రికార్డు


విధాత‌: స‌భ్య స‌మాజం సిగ్గుతో త‌ల‌దించుకొనే దారుణ ఘ‌ట‌న‌. 12 ఏండ్ల బాలిక తీవ్ర‌ లైంగిక‌దాడికి గురైంది. అర్ధ‌న‌గ్నంగా ర‌క్త‌స్రావంతో ఇంటింటికీ వెళ్లి స‌హాయం చేయాల‌ని అర్థించింది. వీధిలో ఓ వ్య‌క్తి క‌నిపించ‌గానే సాయం అందిస్తాడ‌ని ఆశ‌గా అత‌డి వ‌ద్ద‌కు బాధితురాలు వెళ్ల‌గా.. సాయం చేయ‌క‌పోగా, త‌రిమికొట్టాడు.


అంద‌రూ బాలిక‌ను చూసినా ఏ ఒక్క‌రికీ అయ్యో పాపం అనిపించ‌లేదు. సాయం చేయ‌డానికి ఒక్క‌రు కూడా ముందు రాలేదు. వీధుల్లో తిరుగుతూ చివరికి ఒక ఆశ్రమానికి చేరుకోగా, నిర్వాహ‌కులు స్పందించి ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. వైద్య పరీక్షల్లో బాలిక‌పై అత్యాచారం జరిగిన‌ట్టు వైద్యులు నిర్ధారించారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఈ దారుణం జ‌రిగింది. అక్క‌డి సీసీ కెమెరాలో ఇది రికార్డ‌యింది.


అస‌లు విష‌యం ఏమిటంటే..


మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాద్‌నగర్ రహదారి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలో షాక్ గురిచేసే వీడియో దృష్ట్యాలు రికార్డ‌య్యియి. మాన‌సిక విక‌లాంగురాలైన 12 ఏండ్ల‌ బాలిక అర్ధ‌న‌గ్నంగా, లైంగిక‌దాడికి గురైన తర్వాత రక్తస్రావంతో బాధ‌ప‌డుతూ.. వీధిలోని ఇంటింటికీ వెళ్లి సహాయం కోరింది. ప్రజలు బాలిక‌ వైపు చూశారు.. కానీ సహాయం చేయ‌డానికి నిరాకరించారు. బాధితురాలు ఒక‌రి సాయం కోసం వెళ్ల‌గా అత‌డు ఆమెను తరిమికొట్టడం వీడియోలో కనిపించింది.


బాధితురాలు తాను చుట్టుకున్న‌గుడ్డతో వీధుల్లో తిరుగుతూ, చివరికి ఒక ఆశ్రమానికి చేరుకున్న‌ది. ఆశ్ర‌మ నిర్వాహ‌కుడు బాలిక లైంగిక‌దాడికి గురైన‌ట్టు అనుమానించి, ఆమెపై టవల్ కప్పి, జిల్లా ద‌వాఖాన‌కు తరలించారు. వైద్య పరీక్షల్లో లైంగిక‌దాడి జరిగినట్టు వైద్యులు నిర్ధారించి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో బాలికను ఇండోర్‌కు తరలించారు. అక్క‌డ బాధితురాలు చికిత్స పొందుతున్న‌ది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్న‌ట్టు తెలిసింది.


బాధిత బాలిక త‌న అడ్ర‌స్ చెప్ప‌లేక‌పోతున్న‌ద‌ని సీనియర్ పోలీసు అధికారిణి దీపికా షిండే తెలిపారు. అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో త‌మ‌కు ఖచ్చితంగా చెప్పలేకపోయింద‌ని, కానీ ఆమె మాట తీరు ప్రకారం ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కి చెందినదని తెలుస్తున్న‌ద‌ని పేర్కొన్నారు. గుర్తు తెలియని నిందితులపై పోక్సో కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు జ‌రుపుతున్న‌ట్టు వెల్ల‌డించారు. నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని ఉజ్జయిని పోలీస్ చీఫ్ సచిన్ శర్మ తెలిపారు. ప్రజలకు ఏదైనా సమాచారం అందితే పోలీసులకు తెలియజేయాల‌ని కోరారు.


మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో 2019 – 2021 మధ్య అత్యధిక సంఖ్యలో మహిళలు, బాలికల అదృశ్యం కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్ 2021లో దేశంలోనే అత్యధిక లైంగిక‌దాడి ఘటనలు 6,462 జ‌రిగిన‌ట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డాటా వెల్ల‌డిస్తున్న‌ది. వీటిలో 50 శాతానికి పైగా మైనర్లపై నేరాలు జరిగాయి. ఈ సంఖ్య రోజుకు 18 లైంగిక‌దాడుల‌ను సూచిస్తున్న‌ది.