గుజ‌రాత్‌లో పిడుగుల ప‌డి 20 మంది మృత్యవాత

ఉరుములు, పిడుగులతో కూడిన అకాల వర్షం గుజరాత్‌ను వణికించింది. పలు ప్రాంతాల్లో ప‌డిన భారీ వ‌డ‌గండ్ల వాన బీభత్సం సృష్టించింది.

గుజ‌రాత్‌లో పిడుగుల ప‌డి 20 మంది మృత్యవాత
  • బీభ‌త్సం సృష్టించిన అకాల వ‌ర్షం
  • అత్యధికంగా 117 మి.మీ. వర్షపాతం


విధాత‌: ఉరుములు, పిడుగులతో కూడిన అకాల వర్షం గుజరాత్‌ను వణికించింది. పలు ప్రాంతాల్లో ప‌డిన భారీ వ‌డ‌గండ్ల వాన బీభత్సం సృష్టించింది. పిడుగుపాట్ల‌కు ఒకేరోజు ఏకంగా 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు గాయపడ్డారు. వేల ఎక‌రాల్లో పంట‌లు దెబ్బ‌తిన్నాయి. పిడుగుపాటుకు కొన్ని చోట్ల పశువులు, గొర్రెలు కూడా మృతి చెందినట్టు అధికారులు వెల్ల‌డించారు.


ఈశాన్య రుతుపవనాలకు తోడు బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న ఆవర్తనాలు, అల్పపీడనాలతో దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వరి పంట కోతకు వచ్చిన సమయంలో కురుస్తోన్న అకాల వర్షాలతో రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం అతల‌కుత‌లం చేసింది.


వ‌డ‌గండ్ల వాన‌తో న‌ల్ల‌ని రోడ్లు అన్నీ తెల్ల‌గా మారాయి. పిడుగుపాట్ల‌కు 20 మంది మ‌ర‌ణించారు. దాహోద్ జిల్లాలో నాలుగు, బరూచ్‌లో మూడు, తాపీలో ఇద్ద‌రు, అహ్మదాబాద్, అమ్రేలి, బనస్కాంత, బోటాడ్, ఖేదా, మెహసానా, పంచమహల్, సబర్‌కాంత, సూరత్, సురేంద్రనగర్, దేవభూమి ద్వారకలో ఒక్కొక్క‌రు చొప్పున మ‌ర‌ణించిన‌ట్టు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అధికారి ఒకరు తెలిపారు.


మొత్తం 254 తాలూకాల్లోని 234 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసినట్టు తెలిపారు. సూరత్‌, సురేంద్రనగర్‌, ఖేడా, తాపి, భరూచ్‌లో 16 గంటల్లో రికార్డు స్థాయిలో 50-117 మి.మీ వర్ష పాతం నమోదైందని పేర్కొన్నారు. రాజ్‌కోట్‌, మోర్బీ జిల్లాల్లో కొన్ని చోట్ల వడగండ్ల‌ వాన పడిందని వెల్ల‌డించారు.