వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్లు.. సీఎం రేవంత్

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. బుధవారం సచివాలయంలో

వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్లు.. సీఎం రేవంత్

– ఆలయ అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం

విధాత బ్యూరో, కరీంనగర్: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి శేషాద్రి, హెచ్ఎండీఏ కమిషనర్ దాన కిషోర్, వీటీడీఏ వైస్ చైర్మన్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ పీ గౌతమి, దేవాదాయ కమిషనర్ అనిల్ కుమార్, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఈవో డీ కృష్ణాప్రసాద్, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అవినాష్ సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులు పవర్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం, బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధి నమూనాలు, పార్కింగ్ స్థలంలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు, శివార్చన మండప నిర్మాణలపై పవర్ ప్రజెంటేషన్ ద్వారా వీటీడీఏ వైస్ చైర్మన్ అనురాగ్ జయంతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు..

– ఆలయ అభివృద్ధి కి నిధులు విడుదల

గతంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థాన అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ సాఫ్ట్ లోన్ ద్వారా మంజూరై నిలిచిపోయిన రూ.20 కోట్ల నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. హెచ్ఎండీఏ సాఫ్ట్ లోన్ నిధుల ద్వారా జరుగుతున్న బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధి, శివార్చన మండప నిర్మాణం, గుడి చెరువు సుందరీకరణ, నటరాజ విగ్రహ ఏర్పాటు, పార్కు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధితో పాటు, పార్కింగ్ స్థలాల్లో టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల్లో వేగం పెంచి సకాలంలో పనులు పూర్తి చేయాలని సూచించారు.

– రోడ్డు విస్తరణపై ప్రత్యేక ప్రణాళిక

వేములవాడ పట్టణ ప్రజలతో పాటు రాజన్న భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా వేములవాడ మూలవాగు బ్రిడ్జితో పాటు బ్రిడ్జి నుండి 800 మీటర్లు వరకు రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని సూచించారు. రోడ్డు విస్తరణతో పాటు మూలవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన రూ.35 కోట్ల నిధులను త్వరలో విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

– గుడి చెరువు ప్రక్షాళన

గుడి చెరువులోకి మురికి నీరు చేరకుండా తగిన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నూతన కాలువ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. నూతన మురుగు కాలువ నిర్మాణానికి ఎస్టీఎఫ్ నిధులు విడుదల చేయాలని, మురుగు నీటిని ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేయాలని తెలిపారు. ప్రస్తుతం గుడి చెరువు విస్తీర్ణం, పార్కింగ్ స్థల వివరాలు అడిగితెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.