ఒకే రాష్ట్రంలో 2 రకాల భూ పరిహారాలా.. చర్లగూడెం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలి: టీడీపీ
భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి.. చర్లగూడెం ప్రాజెక్టు పూర్తి చేయాలి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు, ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ విధాత, నల్గొండ: ఒకే రాష్ట్రంలో రెండు రకాల భూ పరిహారాలు ఎలా చెల్లిస్తారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చర్లగూడెం ప్రాజెక్టు భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి […]

- భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి.. చర్లగూడెం ప్రాజెక్టు పూర్తి చేయాలి
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు, ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్
విధాత, నల్గొండ: ఒకే రాష్ట్రంలో రెండు రకాల భూ పరిహారాలు ఎలా చెల్లిస్తారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చర్లగూడెం ప్రాజెక్టు భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి జక్కలి ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం చర్లగూడెం భూనిర్వాసితుల తో కలిపి పది కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చర్లగూడెం ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన స్థలం నుంచి మర్రిగూడ మండల తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో బక్కని నరసింహులు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. నీళ్లు నిధులు నియామకాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల వారిగా వివక్షతను చూపిస్తున్నారన్నారు.
ఒకే రాష్ట్రంలో ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు రెండు రకాలుగా పరిహారం ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు . మల్లన్న సాగర్ ప్రాజెక్టు పరిధిలోని భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ 12 లక్షలు ,ఎకరాకు 10 లక్షల పరిహారం చొప్పున చెల్లించి ఆదుకున్నారని తెలిపారు. చర్లగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితులకు కొందరికి ఎకరాకు ఐదు లక్షల చొప్పున చెల్లించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టిస్తున్నారని ఆరోపించారు. 40 వేల కోట్లతో ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు 90వేల కోట్లకు చేరుకుందని ఆరోపించారు. ఇందులో ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 8 ఏళ్ల క్రితం ప్రారంభించిన చర్లగూడెం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం, భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడం ముఖ్యమంత్రి ద్వందనీతికి నిదర్శనమన్నారు.
ఈ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి లేదని ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి ఫిర్యాదు చేయడం , ప్రాజెక్టుకు అనుమతి తీసుకోలేదని కేంద్రం చెప్పడం ప్రాజెక్టును గందరగోళానికి గురి చేయడమేనని విమర్శించారు. కృష్ణాజిల్లాలో తమ వాటాను తేల్చాలని కేసీఆర్ కొత్త పల్లవిని అందుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నదన్నారు.
ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకోవలసిన సమస్యను కావాలనే తాత్సారం చేస్తున్నారన్నారు. ప్రాజెక్టు కోసం భూములను వదులుకున్న రైతులకు న్యాయం చేసి ప్రాజెక్టును పూర్తి చేయకపోతే తెలుగుదేశం పార్టీ మరిన్ని ఉద్యమాలను చేపడుతుందని టీడీపీ ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ హెచ్చరించారు.
భవిష్యత్తు తరాల వారి కోసం భూములను వదులుకున్న రైతులకు న్యాయం చేయాలని సూచించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు నాయకులను కొనుగోలు చేయడంలో ఉన్న శ్రద్ధ భూ నిర్వాసితులను ఆదుకోవడంలో లేదన్నారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు కుందారపు కృష్ణమాచారి, ప్రధాన కార్యదర్శి కుక్కల నరసింహ ,దేవరకొండ నకిరేకల్ నియోజకవర్గాల ఇంచార్జీలు విజయ నాయక్ ,యాతాకుల అంజయ్య, రాష్ట్ర కార్యదర్శులు జలముని రవీందర్ ,మన్నే సంజీవరావు, మండల కమిటీ అధ్యక్షుడు ఎర్రజల్ల లింగయ్య, నాయకులు మక్కెన అప్పారావు, గుమ్మడి గోవర్ధన్ రెడ్డి, దోమల వెంకన్న, ఏర్పుల సుదర్శన్, పగడాల లింగయ్య, ముద్ధం శ్రీనివాస్, గోస్కొండ వెంకటేష్, పుప్పాల యాదయ్య, నల్ల సత్యం, ఎండి షరీఫ్, ఈదా కృష్ణ ,కాసర్ల అంజయ్య ,బూరెల మల్లేశం, సిలువేరు నరసింహ ,మాధగోని అశోక్ ,గంట అంజయ్య ,తడక కోటేష్, ముత్యాల చంద్రయ్య, పగిళ్ల రవీందర్, బద్ధుల యాదగిరి పాల్గొన్నారు.