పెళ్లిళ్లకు సుముహూర్తాలు..! 38లక్షలకుపైగా వివాహాలు..! రూ.4లక్షల కోట్లకుపైగానే వ్యాపారం..!
పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉండడంతో తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీతో పాటు దేశవ్యాప్తంగా భారీగానే జరుగనున్నాయి. కార్తీక మాసం మొదలు నుంచే పెళ్లిళ్లు మొదలయ్యాయి

విధాత: పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉండడంతో తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీతో పాటు దేశవ్యాప్తంగా భారీగానే జరుగనున్నాయి. కార్తీక మాసం మొదలు నుంచే పెళ్లిళ్లు మొదలయ్యాయి. ఈ నెల 23 నుంచి మరింత జోరందుకున్నాయి. డిసెంబర్ 15 వరకు దేశవ్యాప్తంగా 38 లక్షలకుపైగానే పెళ్లిళ్లు జరుగబోతున్నట్లు అంచనా. అయితే, భారతీయ సంప్రదాయంలో పెళ్లిళ్లు అంటే సామాన్యమైన విషయమేమి కాదు. అందుకే ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అనే నానుడి ఉన్నది. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మధుర జ్ఞాపకం.
దాంతో ప్రతి ఒక్కరూ పెళ్లిని ఘనంగా నిర్వహించుకునేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఎవరి ఆర్థిక స్థోమతకు తగ్గట్లుగా ధనాన్ని వెచ్చిస్తుంటారు. అయితే, ఈ పెళ్లిళ్ల సీజన్‌లో భారీగానే వ్యాపారం జరుగనున్నట్లు వ్యాపారుల సమాఖ్య కాయిట్ అంచనా వేస్తున్నది. ఈ సీజన్‌లో ఏకంగా రూ.4.74లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. గతేడాది ఇదే సీజన్‌తో పోలిస్తే ఎక్కువని పేర్కొంది. పెళ్లిళ్లకు అవసరమైన వస్తువులు, బట్టలు, బంగారు ఆభరణాలు, లాంఛనాలు తదితర వాటి కోసం ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే.
గతేడాది ఇదే సమయంలో దాదాపు రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేయబోతున్నట్లు కాయిట్ పేర్కొంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 30 నగరాల్లో ఉన్న వస్తు, సేవలకు సంబంధించిన వాణిజ్య సంస్థల నుంచి సేకరించిన సమాచారంతో ఈ అంచనాకు వచ్చినట్లు కాయిట్ సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ తెలిపారు. అలాగే, గతేడాదితో పోలిస్తే పెళ్లిళ్ల సంఖ్య భారీగా పెరగనున్నదని పేర్కొన్నారు. గత సంవత్సరం సీజన్‌లో 32లక్షలకుపైగా పెళ్లిళ్లు జరగ్గా.. దాదాపు రూ.3.75లక్షల కోట్ల వ్యాపారం జరిగింది.
ఈ ఏడాది 38లక్షకుపైగా పెళ్లిళ్లు జరుగనుండడంతో ఖర్చులు సైతం భారీగానే పెరనున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెళ్లిళ్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ నెల 19న ఒకే రోజు రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరిగినట్లు అంచనా. నవంబర్ 24, 27, 28, 29, డిసెంబర్ 3, 4, 7, 8, 9, 15 తేదీల్లో వివాహాలకు శుభముహూర్తాలు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో భారీగానే పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని కాయిట్ తెలిపింది. ఈ సీజన్‌లో జాతీయ రాజధాని ఢిల్లీలోనే 4లక్షల పెళ్లిళ్లు జరుగబోతున్నాయని.. రూ.1.25లక్షల కోట్ల వ్యాపారం జరుగుబోతున్నట్లుగా వివరించింది.