కాళేశ్వరానికి 4 నెలలు హాలిడే!
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల డిజైన్లు, నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది.

- రంగంలోకి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ
- మూడు బరాజ్‌లపై 4 నెలల్లో నివేదిక
- మేడిగడ్డ ఎందుకు కుంగిందో పరిశీలన..
- తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై సూచన
- అప్పటివరకు ప్రభుత్వం చేసేదేమీ ఉండదు
- మరమ్మతులకూ ఎదురుచూడాల్సిందే
- మేడిగడ్డలో కుంగింది పిల్లర్ కాదు..
- కాళేశ్వరానికే అది గుండెకాయలాంటిది
- నీళ్లు నింపాలనడం అర్థరహితం
- రాజకీయ దురుద్దేశాలతో బీఆరెస్
- రైతు ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు
- నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్
విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల డిజైన్లు, నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ జే చంద్రశేఖర్ అయ్యర్ సారథ్యంలో ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించారు. ఇందులో యూసీ విద్యార్థి, ఆర్ పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ సభ్యులుగా ఉంటారు.
ఎన్డీఎస్ఏ డైరెక్టర్ (టెక్నికల్) అమితాబ్ మీనా ఈ కమిటీకి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల డిజైన్లు, నిర్మాణాలపై ఏర్పాటు చేసిన కమిటీ 4 నెలల్లో రిపోర్టు ఇవ్వలని గడువును నిర్దేశించారు. దీనితో ఈ నాలుగు నెలల్లో ప్రభుత్వం చేసేదేమీ ఉండదని అధికారవర్గాలు చెబుతున్నాయి. మరమ్మతులకూ ఎదురుచూడాల్సిందేనని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం లేఖతో.. మేడిగడ్డ బరాజ్‌లోని పియర్లు కుంగిపోవటంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై సమగ్రంగా విచారణ జరపాలని ఫిబ్రవరి 13న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. మూడు బరాజ్‌ల డిజైన్లతోపాటు నిర్మాణాలను నిపుణుల అధ్వర్యంలో అన్ని కోణాల్లో పరిశీలించాలని ఎన్డీఎస్ఏకు విజ్ఞప్తి చేసింది.
దీనిపై స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ మూడు బరాజ్‌లపై కమిటీని నియమిస్తూ మార్చి 2న ఉత్తర్వులు జారీ చేసింది. బరాజ్‌లను పరిశీలించి, కుంగుబాటుకు, పగుళ్లకు కారణాలను విశ్లేషించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలను సిఫారసు చేయాలని ఈ కమిటీకి సూచించింది. నాలుగు నెలల్లోపు తమ రిపోర్టును అందజేయాలని కమిటీకి నిర్ణీత గడువును విధించింది.
మేడిగడ్డ.. గుండెకాయ
94 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బరాజ్ గుండెకాయ లాంటిదని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అలాంటి బరాజ్ కుంగిపోతే.. ఆవేదన వ్యక్తం చేయాల్సిన బీఆరెస్ నాయకులు ఒక్క పిల్లర్ కుంగిపోయిందని మాట్లాడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
బీఆరెస్ నాయకుల మాటలకు విలువ లేదని అన్నారు. బీఆరెస్ నాయకులు బాధ్యతారహిత్యాంతో మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను, రైతాంగ ప్రయోజనాలను పణంగా పెట్టడం దురదృష్టకరమని అన్నారు. ప్రాజెక్టులో నీటిని నింపాలని బీఆరెస్ నాయకులు చేస్తున్న డిమాండ్‌ను ఆయన కొట్టిపారేశారు.
తమ ప్రభుత్వం డ్యాం సేఫ్టీ అథారిటీ, నిపుణుల కమిటీ సూచనలను మాత్రమే పాటిస్తుందని స్పష్టం చేశారు. ఈ నెల 6వ తేదీన కాళేశ్వరం పరిశీలనకు నిపుణుల కమిటీ రానున్నదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నిపుణుల కమిటీ రాకను స్వాగతిస్తున్నామని, అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పారు.
నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. కుంగిపోయిన మేడిగడ్డ బరాజ్‌ను నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ పరిశీలించి, నీటిని ఖాళీ చేయాలని సూచించిందని మంత్రి తెలిపారు. అనంతరం సుందిళ్ళ, అన్నారం బరాజ్‌లను పరిశీలించి, మేడిగడ్డలో ఉన్న సమస్యలు ఇక్కడ కూడా ఉన్నాయని, ఈ రెండు బరాజ్‌లలో కూడా నీటిని ఖాళీ చేయాలని సూచించిందని చెప్పారు.
అథారిటీ సూచన మేరకే రాష్ట్ర ప్రభుత్వం నీటిని ఖాళీ చేస్తున్నదని స్పష్టం చేశారు. ఈ విషయంలో బీఆరెస్ నేతలు రాజకీయాలు చేస్తూ, నీటిని నింపాలని డిమాండ్ చేయడం అత్యంత బాధ్యత రాహిత్యమని మంత్రి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల డిజైన్లు, నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించిందని చెప్పారు.
కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ జే చంద్రశేఖర్ అయ్యర్ సారథ్యంలో ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించిందని తెలిపారు. బరాజ్‌లను పరిశీలించి, కుంగుబాటుకు, పగుళ్లకు కారణాలను విశ్లేషించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలను సిఫారసు చేయాలని ఈ కమిటీకి సూచించిందని తెలిపారు.
బీఆరెస్ నాయకులకు ఎలాంటి సాంకేతిక అవగాహన లేకున్నా మాట్లాడడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. నాణ్యత, నిర్వహణ, నిర్మాణం, డిజైన్లు.. అన్ని విషయాలల్లో గత ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు.
బరాజ్‌ల డిజైన్‌కు సంబంధించి ఎంచుకున్న వివిధ రకాల మోడల్ స్టడీస్‌ను కమిటీ పరిశీలించాల్సి ఉంటుంది. మేడిగడ్డ కుంగిపోవడానికి కారణాలను లోతుగా విశ్లేషించాలి. మేడిగడ్డపైన ఉన్న అన్నారం, సుందిళ్లలోనూ ఉన్న ప్రమాద పరిస్థితులకు కారణాలను అధ్యయనం చేయాలి.
ఇప్పుడున్న పరిస్థితులను అథిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలు, అనుసరించాల్సిన ప్రత్యామ్నాయాలు, తిరిగి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రతలను కమిటీ సూచించాలి. అవసరమైతే ఛైర్మన్ అనుమతితో ఈ కమిటీలో మరో సభ్యుడిని కూడా నియమించుకునే అవకాశముంటుంది.