ఉచిత చీరల పంపిణీలో తొక్కిసలాట.. నలుగురు మహిళలు మృతి
Tamil Nadu | ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం.. ఓ నలుగురు మహిళల ప్రాణాలను బలి తీసుకుంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడు తిరుపత్తూరు జిల్లాలోని వాణియాంబడిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వాణియాంబడి ప్రాంతంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో మురుగన్ తైపుసం ఉత్సవాలను నిర్వహిస్తారు. ఉత్సవాల నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు కంపెనీ.. మహిళలకు, పురుషులకు చీరలు, ధోతీలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఉచిత చీరలు, ధోతీల పంపిణీ […]

Tamil Nadu | ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం.. ఓ నలుగురు మహిళల ప్రాణాలను బలి తీసుకుంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడు తిరుపత్తూరు జిల్లాలోని వాణియాంబడిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. వాణియాంబడి ప్రాంతంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో మురుగన్ తైపుసం ఉత్సవాలను నిర్వహిస్తారు. ఉత్సవాల నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు కంపెనీ.. మహిళలకు, పురుషులకు చీరలు, ధోతీలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఉచిత చీరలు, ధోతీల పంపిణీ కోసం శనివారం టోకెన్లు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది.
ఈ క్రమంలో ఆ కంపెనీ వద్దకు శనివారం మధ్యాహ్నం భారీ సంఖ్యలో మహిళలు చేరుకున్నారు. టోకెన్ల కోసం ఒక్కసారిగా పరుగులు పెట్టారు. దీంతో తొక్కిసలాట జరిగింది. నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.