మ‌ళ్లీ క‌రోనా ప్ర‌మాద ఘంటిక‌లు.. దేశంలో ఐదుగురు మృతి

దేశంలో మ‌ళ్లీ క‌రోనా ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతున్నాయి. క‌రోనా పీడ పోయింద‌నుకున్న ప్ర‌జ‌ల‌కు.. మ‌ళ్లీ క‌రోనా స‌బ్ వేరియంట్ క‌ల‌వ‌రం పెడుతోంది

మ‌ళ్లీ క‌రోనా ప్ర‌మాద ఘంటిక‌లు.. దేశంలో ఐదుగురు మృతి

న్యూఢిల్లీ : దేశంలో మ‌ళ్లీ క‌రోనా ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతున్నాయి. క‌రోనా పీడ పోయింద‌నుకున్న ప్ర‌జ‌ల‌కు.. మ‌ళ్లీ క‌రోనా స‌బ్ వేరియంట్ క‌ల‌వ‌రం పెడుతోంది. క‌రోనా స‌బ్ వేరియంట్ జేఎన్.1 చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. ఈ స‌బ్ వేరియంట్ కార‌ణంగా దేశంలో ఐదుగురు మృతి చెందారు. కేర‌ళ‌లో న‌లుగురు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఒక‌రు చ‌నిపోయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.


ఆదివారం ఒక్క‌రోజే 335 కేసులు కొత్త‌గా న‌మోదు అయ్యాయి. ప్ర‌స్తుతం 1,701 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 4.50 కోట్ల‌కు చేరిన‌ట్లు నివేదిక‌లు చెబుతున్నాయి. 4.46 కోట్ల మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. రిక‌వ‌రి రేటు 98.81 శాతంగా ఉంది. కొవిడ్ బారిన ప‌డి 5,33,316 మంది మ‌ర‌ణించారు.


జేఎన్.1 వేరియంట్‌కు సంబంధించి ఇంకా నిర్దిష్ట ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేద‌ని ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. జ్వ‌రం, నిరంత‌ర ద‌గ్గు, అల‌సిపోవ‌డం, జ‌లుబు, అతిసారం, త‌లనొప్పి వంటి మొద‌లైన విష‌యాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.