చైనా జలాంతర్గామిలో ఘోరం.. ఆక్సిజన్ వ్యవస్థ విఫలమై 55 మంది మృతి

విధాత: చైనా (China) కు చెందిన సబ్మెరైన్ (Submarine) లో ఘోరం జరిగింది. అందులోని ఆక్సిజన్ వ్యవస్థ విఫలమై విషవాయువులు విడుదల కావడంతో మొత్తం 55 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ మేరకు యూకే దినపత్రిక డెయిలీ మెయిల్ సంచలన విషయాన్ని వెల్లడించింది. ఆ కథనం ప్రకారం.. చైనా, కొరియా ద్వీపకల్పాల మధ్య ఉన్న ఎల్లో సముద్రంలో చైనా జలాంతర్గామి 093-417 గస్తీ తిరుగుతోంది.
ఈ క్రమంలో ఆగస్టు 21న దానికి ఓ ప్రమాదం సంభవించింది. తన ప్రాదేశిక జలాల్లో అమెరికా, దాని మిత్ర పక్షాలను ట్రాప్ చేయడానికి వేసిన భారీ గొలుసు, లంగరును 093-417 బలంగా ఢీ కొట్టింది. ఈ తాకిడికి అందులోని పలు వ్యవస్థలు విఫలమయ్యాయి. వాటన్నింటినీ సరిచేసి సముద్రగర్భం నుంచి పైకి రావడానికి జలాంతర్గామికి సుమారు ఆరు గంటలకు పైగా పట్టింది. ఈ క్రమంలో ఆక్సిజన్ వ్యవస్థ విఫలం కావడంతో విషపూరిత వాయువులను సిబ్బంది పీల్చేసుకున్నారు.
దీంతో అందులో ఉన్న మొత్తం 55 మంది ప్రాణాలు కోల్పోయారని డెయిలీ మెయిల్ వెల్లడించింది. ఇందులో కెప్టెన్ కల్నల్ క్సూ యోంగ్ పెంగ్ సహా 22 మంది అధికారులు, ఏడుగురు ఆఫీసర్ క్యాడెట్లు, 9 మంది కింది స్థాయి అధికారులు, 17 మంది సెయిలర్లు ఉన్నారని పేర్కొంది. వాళ్లు ప్రమాదంలో ఉన్నారని చైనా నేవీకి ముందుగానే తెలుసని.. అయినా వారికి సమీపంలో ఉన్న అమెరికా జలాంతర్గాములకు, నౌకలకు సమాచారం ఇవ్వలేదని తెలిపింది. అలా చేసుంటే వారి ప్రాణాలు దక్కి ఉండేవని పేర్కొంది.
అయితే ఈ వార్తలను చైనా కొట్టిపడేసింది. ఎల్లో సముద్రంలో అలాంటి ఘటన ఏదీ జరగలేదని, తమ సిబ్బంది అంతా సురక్షితమేనని స్పష్టం చేసింది. అయితే తాము ఈ కథనాన్ని అత్యంత విశ్వసనీయ సమాచారంతో ఇస్తున్నామని.. పలు దేశాల నేవీ అధికారులు తమ ప్రభుత్వాలకు అందించిన రహస్య సమాచారం తమ వద్ద ఉందని డెయిలీ మెయిల్ తెలిపింది.
అయితే చైనా గతాన్ని చూసినా తమ సైనికుల మరణాలను ఆ దేశం రహస్యంగా ఉంచుతూ రావడం కనపడుతుంది. భారత సైన్యంతో గల్వాన్ వద్ద ఘర్షణ జరిగిన ఘటనలోనూ తన సైనికుల మరణాలను గోప్యంగా ఉంచింది. దీంతో ఈ జలాంతర్గామి ఘటన నిజమయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు.