ఏపీలో ఘోర రైలు ప్ర‌మాదం: రెండు రైళ్లు ఢీ, ఆరుగురు మృతి, 50 మందికి గాయాలు

ఏపీలో ఘోర రైలు ప్ర‌మాదం: రెండు రైళ్లు ఢీ, ఆరుగురు మృతి, 50 మందికి గాయాలు

విధాత : ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు చ‌నిపోయిన‌ట్టు తెలుస్తున్న‌ది. 50 మంది వ‌ర‌కూ గాయ‌ప‌డిన‌ట్టు స‌మాచారం. ప్ర‌మాద తీవ్ర‌త రీత్యా మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ద‌నే ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఘ‌ట‌న గురించి తెలిసిన వెంట‌నే రైల్వే అధికారులు ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకుని స‌హాయ చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. రాత్రి 7.10 గంట‌ల స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ది.


విశాఖ నుంచి ప‌లాస వెళుతున్న ప్ర‌త్యేక ప్యాసింజ‌ర్ ట్రైన్ ఓవ‌ర్‌హెడ్ కేబుల్ తెగిపోవ‌డంతో కంట‌కాప‌ల్లి వ‌ద్ద ప‌ట్టాల‌పై నిలిచిపోయింద‌ని, దాని వెనుకే వ‌స్తున్న విశాఖ-రాయ‌గ‌డ రైలు ఢీకొన్న‌ద‌ని స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌లో రాయ‌గ‌డ ప్యాసింజ‌ర్ చివ‌రి మూడు రైలుబోగీలు ప‌ట్టాలు త‌ప్పాయి. క‌రెంటు వైర్లు తెగిపోవ‌డంతో ఆ ప్రాంతాన్ని అంధకారం అవ‌రించింది. దీంతో స‌హాయ చ‌ర్య‌ల‌కు తీవ్ర ఇబ్బంది నెల‌కొన్న‌ది. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న 14 అంబులెన్సుల ద్వారా క్ష‌త‌గాత్రుల‌ను స‌మీప ద‌వాఖాన‌ల‌కు త‌ర‌లించారు.


రైలు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి, రైళ్ల‌లో చిక్కుకున్న‌వారి ఆర్త‌నాదాల‌తో ఆ ప్రాంతం భీతావ‌హంగా మారింది. ప‌లువురు చిన్నారులు సైతం చిక్కుకుపోయార‌ని తెలుస్తున్న‌ది. ప్ర‌మాదంపై ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. గాయ‌ప‌డిన‌వారికి స‌త్వ‌ర‌మే త‌గిన చికిత్స అందించాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆయ‌న ఆదేశించారు. స‌హాయ చ‌ర్య‌లు ప్ర‌భుత్వ శాఖ‌లు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సూచించారు.