భూమిపై 69% జీవుల సంఖ్య తగ్గింది: కాప్-15 సదస్సు
జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోకపోతే.. మనుగడకే ప్రమాదం తర్జన భర్జనల మధ్య ముగిసిన జీవ వైవిద్య శిఖరాగ్ర సదస్సు మాంట్రియల్‌లో డిసెంబర్ 7నుంచి 19 దాకా నిర్వహణ సదస్సులో పాల్గొన్న 200 దేశాలు విధాత: సుదీర్ఘ చర్చలు, తీవ్ర తర్జన భర్జనల మధ్య కాప్-15 సదస్సు ముగిసింది. కెనడాలోని మాంట్రియల్‌లో డిసెంబర్ 7నుంచి 19 దాకా సాగిన ఈ మహా సదస్సులో 200 దేశాలు పాల్గొన్నాయి. కాలుష్యం, వాతావరణ మార్పులు, భూ తాపం, సముద్రాలు, జీవులను కాపాడటం ఎలా? […]

- జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోకపోతే.. మనుగడకే ప్రమాదం
- తర్జన భర్జనల మధ్య ముగిసిన జీవ వైవిద్య శిఖరాగ్ర సదస్సు
- మాంట్రియల్‌లో డిసెంబర్ 7నుంచి 19 దాకా నిర్వహణ
- సదస్సులో పాల్గొన్న 200 దేశాలు
విధాత: సుదీర్ఘ చర్చలు, తీవ్ర తర్జన భర్జనల మధ్య కాప్-15 సదస్సు ముగిసింది. కెనడాలోని మాంట్రియల్‌లో డిసెంబర్ 7నుంచి 19 దాకా సాగిన ఈ మహా సదస్సులో 200 దేశాలు పాల్గొన్నాయి. కాలుష్యం, వాతావరణ మార్పులు, భూ తాపం, సముద్రాలు, జీవులను కాపాడటం ఎలా? అనే దానిపై ఈ అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు జరిగింది.
గత రెండు మూడు దశాబ్దాలుగా వాతావరణ మార్పులు, భూ తాపం పెరగటంపై పర్యావరణ వేత్తలు, శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ విధ్వంసం ఇలాగే కొనసాగితే జీవ వైవిద్యం దెబ్బతింటుందనీ, మనిషి మనుగడ ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు.
ఈ క్రమంలోనే నాలుగేండ్లుగా సాగిన చర్చోపచర్చల నేపథ్యంలో జీవవైవిద్యంపై మాంట్రియల్ ఒప్పందం కుదిరింది. 2030 నాటికి పర్యావరణ పరిరక్షణతో పాటు, జీవ వైవిద్యాన్ని సంరరక్షించటం కోసం 20వేల కోట్ల డాలర్లు అవసరమవుతాయని, ఆ నిధిని సమకూర్చుకోవాలని సదస్సు తీర్మానించింది.
జీవ వైవిద్యంపై మాంట్రియల్ సదస్సు కన్నా ముందు మొదటి దశ సదస్సు 2021 అక్టోబర్ 11నుంచి 15దాకా చైనాలోని కున్మింగ్‌లో జరిగింది. కెనడాలోని మాంట్రియల్‌లో జరిగిన సదస్సు రెండవది.
వాతావరణ మార్పులు, జీవ వైవిద్యంపై పడుతున్న ప్రభావం గురించిన చర్చ 1990వ దశకంలోనే ప్రారంభమైంది. 1994నుంచి 96దాకా ఏటా జీవ వైవిద్య పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలన్నీ చర్చించాయి. ఆ క్రమంలో2000 సంవత్సరం నుంచి రెండేండ్ల కోసారి సదస్సు నిర్వహిస్తున్నారు.
ఆధునికాభివృద్ది నేపథ్యంలో పెరిగిన శాస్త్ర సాంకేతిక అభివృద్ధి అనేక సమస్యలను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా పర్యావరణ కాలుష్యంతో పాటు జీవ వైవిద్యంపై తీవ్ర ప్రభావం చూపింది. నానాటికీ పెరుగుతు న్న కాలుష్యానికి తోడు, టెక్నాలజి సమస్య అనేక జీవుల మనుగడకే ప్రమాదకరంగా తయారైంది.
1970 నాటితో పోలిస్తే.. భూమిపై జీవుల సంఖ్య 69శాతం తగ్గిందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. దీంతో క్షీరదాలు, పక్షులు, ఉభయ చరాలు, సరీసృపాలు, చేపలు గణనీయంగా తగ్గిపోయాయి. ముఖ్యంగా సెల్ ఫోన్‌లు వినియోగంలోకి వచ్చిన తర్వాత.. ఊర పిచ్చుకలు కనిపించకుండా పోయాయి. అంతే కాకుండా.. అనేక రకాలైన కీటకాలు, పక్షులు, కనుమరుగయ్యాయి.
అభివృద్ధి చెందుతున్న దేశాలకు పర్యావరణ పరిరక్షణతో పాటు జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవటానికి మరిన్ని నిధులు సమకూర్చాలని కాంగో డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌ను జీవ వైవిద్య శిఖరాగ్ర సదస్సు అధ్యక్షుడు చైనా పర్యావరణ శాఖ మంత్రి హుయాంగ్ రంకేవ్ తోసిపుచ్చారు. అన్ని దేశాలు బాధ్యతా యుతంగా వ్యవహరిస్తూ జీవ వైవిద్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలోంచే.. పర్యావరణ పరిక్షణ, భూతాపం పెరగటంపై పారిస్ ఒప్పందం జరిగింది. అభివృద్ధి చెందిన దేశాలు కార్బన్ ఉద్ఘారాలను గణనీయంగా తగ్గించుకోవాలని, కాలుష్యాన్ని నివారించాలని ప్రపంచ దేశాలు పారిస్ ఒప్పందంలో సంతకాలు చేశాయి. కాలుష్యానికి ప్రధాన కారకులైన అభివృద్ధి చెందిన దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పారిస్ ఒప్పందం పిలుపునిచ్చింది.
కానీ.. అగ్రరాజ్యం అమెరికా పారిస్ ఒప్పందాన్ని అమలు చేయలేమని, ఆ పేరుతో తమ పురోగమనాన్ని నివారించుకోలేమని చెప్పుకొచ్చింది. పర్యావరణ కాలుష్యానికి అభివృద్ధి చెందుతున్న దేశాలదే ప్రధాన బాధ్యత అని బాధ్యతారహితంగా మాట్లాడి ప్రపంచ దేశాల స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించింది. ఇలాంటి పరిస్థితుల్లో నేటి మాంట్రియల్ సదస్సు స్ఫూర్తిని ఏ మేరకు కొనసాగిస్తుందో చూడాలి.