పోలీసుల భద్రత మధ్య.. గాయపడిన పందెంకోడి!

గ్రామాల్లో కోడి పందాలు నిర్వ‌హించడం స‌ర్వ‌సాధార‌ణం

పోలీసుల భద్రత మధ్య.. గాయపడిన పందెంకోడి!

గ్రామాల్లో కోడి పందాలు నిర్వ‌హించడం స‌ర్వ‌సాధార‌ణం. ఈ పందాల సంద‌ర్భంగా కోళ్లకు గాయాలు కావ‌డం స‌హ‌జ‌మే. కానీ అలాంటి కోళ్ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించిన దాఖ‌లాలు త‌క్కువే. కానీ ఓ పందెం కోడికి మాత్రం పోలీసులు భ‌ద్ర‌త క‌ల్పించారు. ఈ కోడిని కోర్టులో సాక్ష్యంగా ప్ర‌వేశ‌పెట్టి నిందితుల‌కు శిక్ష ఖ‌రారు చేయిస్తామ‌ని పోలీసులు తెలిపారు. అస‌లు ఈ పందెం కోళ్ల క‌థ తెలుసుకోవాలంటే పంజాబ్ వెళ్ల‌క త‌ప్ప‌దు. 

పంజాబ్ భ‌టిండాలోని బ‌లౌనా గ్రామంలో బుధ‌వారం గ్రామ‌స్తులు కోడి పందాలు నిర్వ‌హించారు. ఈ కోడి పందాల‌పై పోలీసుల‌కు స‌మాచారం అందింది. దీంతో పోలీసులు అక్క‌డ క్ష‌ణాల్లో వాలిపోయారు. పోలీసుల‌ను గ‌మ‌నించిన కోడి పందాల నిర్వాహ‌కులు ప‌రారీ అయ్యారు. అక్క‌డ కేవ‌లం రెండు కోళ్లు, ఒక వ్య‌క్తి మాత్ర‌మే మిగిలారు. 

దీంతో రెండు కోళ్ల‌ను, వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో ఒక కోడి తీవ్రంగా గాయ‌ప‌డ‌డంతో చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, అప్ప‌టికే ప్రాణాలు కోల్పోయిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. మ‌రో కోడికి కూడా గాయాలు కావ‌డంతో దానికి ప్రాథ‌మిక చికిత్స అందించి, ఆహారం స‌మ‌కూర్చారు. అనంత‌రం ఆ గాయ‌ప‌డ్డ కోడికి పోలీసులు ప‌హారా కాస్తున్నారు. 

ఈ ఘ‌ట‌న‌లో మొత్తం ముగ్గురిపై కేసులు న‌మోదు చేశామ‌న్నారు. వారిని త్వ‌ర‌లోనే ప‌ట్టుకుని, కోర్టులో ప్ర‌వేశ‌పెడుతామ‌న్నారు. ఈ కేసులో సాక్ష్యం కింద గాయ‌ప‌డ్డ కోడిని కోర్టులో ప్ర‌వేశపెట్టి, నిందితుల‌కు శిక్ష ప‌డేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు తెలిపారు. ఇక కోడి పందాల నిర్వ‌హ‌ణ నేప‌థ్యంలో అక్క‌డ ఉంచిన 11 ట్రోఫీల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పందాల పేరిట ప‌క్షుల‌ను హింసించ‌డం నేర‌మ‌ని పోలీసులు పేర్కొన్నారు.