అమెరికాలో దారుణం.. చిన్నారిని కొరికి చంపిన ఎలుకలు

విధాత: అగ్ర రాజ్యం అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఊయలలో నిద్రిస్తున్న ఆరునెలల పసికందుపై ఎలుకల గుంపు దాడి చేసి చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. న్యూయార్క్ పోస్టు కథనం మేరకు ఈ ఘటన ఇండియానా ప్రాంతంలో జరిగినట్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని చిన్నారి తల్లిదండ్రులను అరెస్టు చేశారు.
ఇండియానాలో నివాసం ఉండే డేవిడ్, ఏంజెల్ షోనాబామ్ దంపతుల ఆరు నెలల చిన్నారి బాలుడు ఊయలలో నిద్రపోతుండగా, ఎలుకల గుంపు దాడి చేసింది. 50చోట్ల చిన్నారిని కరిచి ఎముకలు తేలేలా ముఖం, కాళ్లు, చేతులు కొరికి తినేశాయి. రక్తం మడుగులో పడివున్న చిన్నారిని చూసిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు దృవీకరించారు.
పోలీసులు సమాచారం తెలుసుకుని దర్యాప్తు చేపట్టారు. డెవిడ్, షోనాబామ్ దంపతులకు చిన్నారికి ముందుగా మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారితో పాటు ఇద్దరు బంధువుల పిల్లలు కూడా ఉన్నారు. వారి ఇల్లు అంతా చెత్తచెదారంతో ఉండటంతో ఎలుకలు చెత్త కింద ఆవాసం ఏర్పరుచుకున్నాయని గుర్తించారు.
ఇంట్లో మిగతా పిల్లలపై కూడా ఎలుకలు గతంలో దాడి చేసి గాయపరిచాయని పోలీసులు వెల్లడించారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమైనందునా వారితో పాటు ఇంట్లో ఉండే మరో మహిళపై కేసు నమోదు అరెస్టు చేసినట్లుగా, ఆగస్టు 13న ఈ ఘటన జరిగినట్లుగా ఇండియానా పోలీసులు వెల్లడించారు.