రాజస్థాన్‌లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు..
దేశంలో రైలు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. రైళ్లు ఢీకొట్టుకోవడంతో పాటు పట్టాలు తప్పడం, వంటి ఘటనలు ప్రయాణికులను కలవరానికి గురి చేస్తున్నాయి

Train Derails | దేశంలో రైలు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. రైళ్లు ఢీకొట్టుకోవడంతో పాటు పట్టాలు తప్పడం, రైళ్లలో మంటలు చెలరేగడం వంటి ఘటనలు ప్రయాణికులను కలవరానికి గురి చేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని కోటాలో భోపాల్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. శుక్రవారం రాత్రి రైలు పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు. అయితే, ఇప్పటి వరకు ప్రాణనష్టం జరుగకపోవడం ఊరట కలిగించే విషయం. ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
రైలు నంబర్ 14813 జోధ్‌పూర్-భోపాల్ ఎక్స్‌ప్రెస్ రెండు కోచ్‌లు కోట జంక్షన్ యార్డులో పట్టాలు తప్పినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం నేపథ్యంలో కోటా డివిజన్‌లోని డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) ప్రయాణికుల కోసం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్‌లను సైతం ప్రకటించారు. ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
కాగా.. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదంపై సీనియర్ అధికారి మాట్లాడుతూ కోటా జంక్షన్ సమీపలో భోపాల్ వెళ్తున్న రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్లు జరుగుతున్నాయన్నారు. ఇంతకు ముందు డిసెంబర్‌లో రాజస్థాన్ బీకనీర్ జిల్లాలో ఖాళీ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలోనూ ఎవరికి గాయాలు కాలేదు. ఈ సంఘటన బికనీర్‌లోని లాల్‌ఘర్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్నది.