డీజీపీని మార్చగలిగే ఈసీ.. ఈడీని నియంత్రించలేదా?
కేజ్రీవాల్ అరెస్టు విషయంలో జోక్యం చేసుకోవాలని పలు రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి.

- కేజ్రీవాల్ అరెస్టులో జోక్యం చేసుకోండి
- ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీల వినతి
- ఇది వ్యక్తి సమస్యో, పార్టీ సమస్యో కాదు..
- ఇది దేశ రాజ్యాంగానికి సంబంధించినది
- కాంగ్రెస్ నేత, సీనియర్ అడ్వొకేట్ సింఘ్వి
న్యూఢిల్లీ : కేజ్రీవాల్ అరెస్టు విషయంలో జోక్యం చేసుకోవాలని పలు రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. ‘ఈ రోజు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ ఉన్నాయి. కేజ్రీవాల్ అరెస్టు ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నది. ఎన్నికల సంఘంతో మేం సమగ్రంగా చర్చించాం. ఇది వ్యక్తి సమస్యో, ఒక పార్టీ సమస్యో కాదు. కానీ.. ఇది రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు సంబంధించినది’ అని కాంగ్రెస్ నేత, కేజ్రీవాల్ తరఫు అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వి అన్నారు.
శుక్రవారం ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో అన్ని పార్టీలకు సమానావకాశాలు ఉండాలని చెప్పారు. కానీ.. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం ద్వారా ఆ సమానావకాశాలను దెబ్బతీయరాదని వ్యాఖ్యానించారు. అది నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికలను, అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
‘ఎన్నికల సంఘానికి బాధ్యత ఉన్నది. కానీ.. సమానావకాశాలను కాపాడేది పోలీసులా? ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మేం ఎన్నికల సంఘాన్ని కోరాం’ అని ఆయన తెలిపారు. ‘75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక సిటింగ్ సీఎంను అరెస్టు చేశారు. దేశంలోనే ఎంతోకాలం నుంచి ఉన్న పార్టీ ఖాతాలను స్తంభింపచేశారు. ప్రతిపక్ష నేతలపై దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగం చేసిన వివరాలను ఎన్నికల సంఘానికి అందించాం. ఒక రాష్ట్ర డీజీపీని, కార్యదర్శిని ఎన్నికల కమిషన్ మార్చగలిగినప్పుడు దర్యాప్తు సంస్థలను ఎందుకు నియంత్రించలేక పోతున్నది?’ అని ఆయన ప్రశ్నించారు.